Share News

పార్లమెంట్‌కు సమర్థుడిని పంపించాలి

ABN , Publish Date - May 08 , 2024 | 11:57 PM

సమర్థుడైన ప్రతినిధిని పార్లమెంట్‌కు పంపిస్తేనే, ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

పార్లమెంట్‌కు సమర్థుడిని పంపించాలి
గద్వాల రోడ్డు షోలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

- అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌కు అండగా నిలవండి

- కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలు తప్పవు

- బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు గల్లంతే

- తెలంగాణ ప్రయోజనాలు బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

- రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

గద్వాల టౌన్‌, మే 8 : సమర్థుడైన ప్రతినిధిని పార్లమెంట్‌కు పంపిస్తేనే, ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం విద్యావంతుడు, సమర్థుడైన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు అండగా నిలవాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి గద్వాల పట్టణంలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు అండగా నిలవాలని, ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయాలను కేసీఆర్‌ శాసిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ జోడెద్దుల్లా పనిచేస్తూ, నడిగడ్డ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారని తెలిపారు. వారిని ఆశీర్వదించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నెట్టెంపాడు ద్వారా 1.25 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరిచ్చామని తెలిపారు. ప్రస్తుతం పంటలన్నీ ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. గద్వాల నియోజకవర్గంలో ఐదేళ్లలో రూ.4,125 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డిని తిరిగి ఎన్నుకున్న ప్రజలు, అదే నమ్మకంతో అంతకు మించిన మెజార్టీని ప్రవీణ్‌కుమార్‌కు అందించాలన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీకి వాయిదాలు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. పాలనా సౌలభ్యం కోసం తమ ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేస్తే, వాటిని రద్దు చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, మిగతా వాటిని గాలికి వదిలేసిన ప్రభుత్వం, కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభించే సరికి రైతుబంధును గుర్తుకు తెచ్చుకున్నదని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే జలదీక్ష చేస్తే తప్ప, ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు ప్రభుత్వానికి గుర్తుకు రాలేదని దెప్పిపొడిచారు. అదే సమయంలో ప్రతీ ఒక్కరికీ జన్‌ధన్‌ ఖాతాలు తెరిచి, రూ.15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ, పదేళ్లలో ఎంత జమ చేశారో చెప్పాలన్నారు. ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పదేళ్ల పాలనలో నిప్పులా ఉన్న కేసీఆర్‌కు, ఆరు నెలల అబద్ధపు పాలనకు, బీఆర్‌ఎస్‌ త్యాగానికి, కాంగ్రెస్‌ భోగానికి, కేసీఆర్‌ ఆశయాలకు, కాంగ్రెస్‌ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరుగా లోక్‌సభ ఎన్నికలను అభివర్ణించారు. పార్లమెంట్‌లో తాను అడుగుపెడితే నిరుద్యోగులు, రైతులు, శ్రమజీవులు, విద్యార్థులు అన్నివర్గాల వారు పార్లమెంట్‌లో ఉన్నట్లేనని చెప్పుకొచ్చారు. గురుకులాల కార్యదర్శిగా తొమ్మిదేళ్ల పాటు బాలల భవిష్యత్‌ కోసం పనిచేసిన తాను పార్లమెంట్‌ సభ్యుడిగా వారికి జీవిత భద్రత కోసం శ్రమిస్తానన్నారు. అణగారిన వర్గాల ఆశలకు తూట్లు పొడిచే రీతిలో రిజర్వేషన్ల రద్దుకు సిద్ధపడుతున్న బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ శాసనసభలో తనను ఆశీర్వదించిన ప్రజలు, అంతకు రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు అండగా నిలవాలని కోరారు.

Updated Date - May 08 , 2024 | 11:57 PM