Share News

భారతీయుల ఆత్మ.. బీజేపీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:58 PM

బీజేపీ అంటే భారతీయుల ఆత్మ అని ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మానకొండూర్‌లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో దళిత సమ్మేళనం నిర్వహించారు.

భారతీయుల ఆత్మ.. బీజేపీ

మానకొండూర్‌, ఏప్రిల్‌ 26: బీజేపీ అంటే భారతీయుల ఆత్మ అని ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మానకొండూర్‌లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో దళిత సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్‌ మాట్లాడుతూ నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నదన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అవమానించాయని, అలాంటి పార్టీలకు దళితులు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ పేరులోనే భారతీయత ఉందని, ఈ పార్టీని ఈ దేశ ముద్దు బిడ్డలయిన అటల్‌ బిహరీ వాజ్‌పేయ్‌, ఎల్‌కే అద్వాని స్థాపించారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో భారతీయత ఎక్కడుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ పొరపాటున అఽధికారంలోకి వస్తే పేదలు సహా ఎవ్వరు చనిపోయినా వారి ఆస్తిలో 55 శాతం గుంజుకుంటుందని హెచ్చరించారు. ఇదే విషయాన్నికాంగ్రెస్‌ పార్టీ విదేశాంగ విభాగం ఇన్‌చార్జి శ్యాంపిట్రోడా స్పష్టం చేశారని ఆయన తెలిపారు. తెలంగాణలో మొదటి సీఎం దళితుడేనని హమీ ఇచ్చి ఓట్లు దండుకున్న తర్వాత కేసీఆర్‌ మోసం చేశాడని విమర్శించారు. అంబేడ్కర్‌ ఆశయాలను అమలు చేస్తున్న నరేంద్ర మోదీ తనకు వచ్చిన ప్రధాని పదవి అంబేడ్కర్‌ పెట్టిన భిబిక్షేనని నిండు సభలో చాటి చెప్పారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారిని నడి రోడ్డున పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి మహిళల పుస్తెల తాడు తెంచిన నీచుడు కేసీఆర్‌ అని అన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు పట్టిన శని అని, అందుకే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. పరాయోడు మోసం చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టమని, సొంతోడు మోసం చేస్తే పాతపెట్టమని ప్రజాకవి కాళోజీ అన్నారని, తెలంగాణను దోచుకున్న ఆంధ్రా పాలకులను తరిమికొట్టి పొలిమేర దాటించినమని, ఇగ బీఆర్‌ఎస్‌ను పాతరేసే టైమొచ్చిందన్నారు. జూన్‌ 4న ఆ పార్టీని గొయ్యి తీసి వెయ్యి అడుగుల లోతున పాతరేసేందుకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధులు ఎన్నడైనా మీ వద్దకు వచ్చారా? మీ కోసం ఎన్నడైనా పోరాడారా అని ప్రశ్నించారు. తాను ప్రజల కోసం చేసిన పోరాటాలేమిటో... వాళ్లు చేసిన పోరాటాలేమిటో బేరీజు వేసుకుని ఎవరికి ఓటేస్తే మీ ఓటుకు విలువ ఉంటుందో చూసుకుని వారికే ఓటేయండని కోరారు. తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, కేసీఆర్‌ కూడా ఐదు రోజులు కరీంనగర్‌కు వచ్చి తనను ఓడగొట్టడానికి కుట్ర చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్‌ కుమార్‌, మాజీ అధ్యక్షుడు కొప్పు భాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కుమ్మరి శంకర్‌, జిల్లా ఉపాద్యక్షులు గుర్రాల వెంకట్‌రెడ్డి, రంగు బాస్కరాచారి, మండల అధ్యక్షుడు రాపాక ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఫ బీజేపీలో భారీగా చేరికలు

భగత్‌నగర్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో మానకొండూర్‌, చొప్పదండి నియోజక వర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌ నియోజక వర్గ ప్రజలకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తెలియదన్నారు. మానకొండూర్‌ నియోజక వర్గం గన్నేరువరం మండల జంగపల్లికి చెందిన మాజీ ఉపసర్పంచ్‌ గీకురు లత ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. చొప్పదండి నియోజక వర్గం మల్యాల మండలానికి చెరందిన యూత్‌ అసోసియేషన్‌ నాయకులు అరుణ్‌, అశోక్‌, అంజి, అజయ్‌, దినేష్‌, మహేశ్‌తో పాటు 20 మందికి పైగా యువలకు బీజేపీలో చేరారు. కుమ్మరి సంఘానికి చెందిన రాజయ్య, రాజేశం, లింగయ్య, హనుమంతు, లచ్చయ్య, ధర్మయ్య,తో పాటు 25 మంది బీజేపీలో చేరారు. కురుమ సంఘానికి చెందిన పెద్ద రాజమల్లు, చిన్న రాజమల్లు, మనోజ్‌ లచ్చయ్య, రాజయ్యతో పాటు 20 మంది బీజేపీలో చేరారు.

ఫ కమలాకర్‌ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న బండి సంజయ్‌

కమలాపూర్‌ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి హుజూరాబాద్‌ నియోజక వర్గంలోని కమలాపూర్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో పూజలు నిర్వహించారు. రథాన్ని స్వయంగా లాగుతూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు.

Updated Date - Apr 26 , 2024 | 11:58 PM