Share News

రేవంత్‌, సంజయ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:21 AM

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ను గెలిపించేందుకు రేవంత్‌రెడ్డి డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలిపారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ఇది రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనమన్నారు.

 రేవంత్‌, సంజయ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 28: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ను గెలిపించేందుకు రేవంత్‌రెడ్డి డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలిపారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ఇది రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనమన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీ సభ్యులు, ముఖ్యకార్యకర్తల సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ వర్షాకాలంలోపే మానేరు రివర్‌ఫ్రంట్‌ను పూర్తిచేసి కరీంనగర్‌ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేవారన్నారు. ఇప్పుడు ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు తోకాడిస్తున్నారని, ప్రజాశక్తికి మించిన శక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరొకటి లేదని అన్నారు. 10, 12 పార్లమెంట్‌ స్థానాలను గెలిపించి తమ చేతిలో పెడితే కేసీఆర్‌ కు రాష్ట్రాన్ని శాంసించే శక్తి ఏడాదిలో వస్తుందన్నారు. ఇప్పుడు తోకాడిస్తున్న డీసీపీలు, ఏసీపీలు, పోలీసులు మళ్లీ మనముందు వచ్చి నిలబడతారని అన్నారు. స్మార్ట్‌సిటీ, సీఎం అస్యూరెన్సు, ఇలా వేలాది కోట్ల నిధులతో కరీంనగర్‌ను అన్నిరంగాల్లో మంత్రిగా గంగుల కమలాకర్‌ అభివృద్ధి చేశారని, ఆయన చేసిన పనులకు 50 వేల మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం ఉండగా మూడు వేల మెజార్టీతో గెలిచారని అన్నారు. ఈ మెజార్టీ ప్రజలు తగ్గించలేదు.. మనకు మనమే తగ్గించుకున్నామని, పార్టీ నాయకులు, కార్యకర్తల వల్లే మెజారిటీ తగ్గిందని అన్నారు. మన కోసం, భావితరాల కోసం కష్టపడి మళ్లీ బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవలసిన అవసరముందని కేటీఆర్‌ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని సిరిసిల్ల, హుజురాబాద్‌, హుస్నాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో మనం బలంగానే ఉన్నామన్నారు. కరీంనగర్‌ చాలా కీలకమని, ఇక్కడ ఓట్లు ఎక్కువగా ఉండటమే కాకుండా కరీంనగర్‌ ప్రభావం మానకొండూర్‌, చొప్పదండిపైకూడా పడుతుందని తెలిపారు. కరీంనగర్‌లో భారీ మెజార్టీతో వినోద్‌కుమార్‌ గెలిచే విధంగా కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ సీఎం అవుతారంటున్నారని, ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. ఆయన పార్టీ కండువా లేకుండా కరీంనగర్‌లో నిలబడితే ఆయనను ఎవరూ గుర్తుపట్టరని, అసలు ఆయన లీడరే కాదని, మ్యాచ్‌ఫిక్సింగ్‌తో రేవంత్‌రెడ్డి సంజయ్‌ని గెలిపించేందుకు డమ్మీ అభ్యర్థిని పెట్టారని విమర్శించారు. కరీంనగర్‌ నుంచి జీవన్‌రెడ్డి పోటీచేస్తానని టికెట్‌ అడిగితే ఆయనకు ఇష్టంలేని నిజామాబాద్‌లో పోటీచేయించారని, ఇక్కడే ఉండే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ అవగాహనతో సంజయ్‌ కోసం మ్యాచ్‌ఫిక్సింగ్‌చేసి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్‌ ఐదేళ్లలో జడ్పీ, మున్సిపల్‌, మండల సమావేశాలకు హాజరు కాలేదని, చివరకు పార్లమెంట్‌కు కూడా వెళ్లలేదన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న వారిని ఓడిస్తే దేవుళ్లు కూడా సంతోషిస్తారని, బీజేపీ నేతలను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఫ కరీంనగర్‌లో ఓట్లు అడిగే హక్కు నాకే ఉంది...

- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌

కరీంనగర్‌ ఓటర్లను ఓట్లు అడిగే హక్కు తనకే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు. ఎంపీగా, న్యాయవాదిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, అధికారులతో గట్టిగా వాదించి, కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ ఇవ్వకుంటే సుప్రీం కోర్టులో కేసు వేస్తానని, 20 లక్షల ఫీజుతో అడ్వకేట్‌ను మాట్లాడానని చెప్పడంతోనే స్మార్ట్‌సిటీ ఇచ్చారని అన్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌కు కేంద్రం ఎన్నికొర్రీలు పెట్టినా కేసీఆర్‌ను ఒప్పించి మంజూరు చేయించానని, ఏడాదిన్నరలో కరీంనగర్‌కు రైలు వస్తుందని అన్నారు. ఎంపీగా బండి సంజయ్‌కుమార్‌ ఒక్క నవోదయ పాఠశాల తేలేదని, కొండగట్టు, వేములవాడకు ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. కొండగట్టు ఆలయానికి 33 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వంతో ఇప్పించానని అన్నారు. జడ్పీ సమావేశాలకు కూడా హాజరు కానీ ఎంపీ బండిసంజయ్‌ ధర్మం అంటారని, ధర్మం అంటే ఆయనకిచ్చిన బాధ్యతను నెరవేర్చడమేనన్నారు. ప్రజలకు ఏమి చేశావని ప్రశ్నించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఎంపీగా వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవల్సిన బాధ్యత మనపై ఉందని, గెలిపించేందుకు పార్టీశ్రేణులు కష్టపడాలని కోరారు. సమావేశంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ పాల్గొన్నారు.

ఫ కాంగ్రెస్‌, బీజేపీవి దొంగ హామీలు

తిమ్మాపూర్‌: కాంగ్రెస్‌, బీజేపీ దొంగ హామిలు ఇచ్చి గెలిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కె తారకరామారావు విమర్శించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ మానకొండూర్‌ నియోజకవర్గ బూత్‌ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటిఆర్‌ ముఖ్య అతిఽథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ కూడా రాదన్నారు. కేసీఆర్‌ గట్టిగ కొట్లాడుతుంటే ఆయన బిడ్డను జైలులో పెట్టారని అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పతనం మొదలైందని, కాంగ్రెస్‌ హామీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వడ్లకు మద్దతు ధర రాక పోవడంతో రైతులు 1800రూపాయలకే అమ్ముకునే దుస్ధితికి వచ్చిందన్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వెళుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నరని, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌లోనే ఉంటానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ, జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్‌ సల్ల శారద, నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:21 AM