Share News

Kumaram Bheem Asifabad: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్ర్కాప్‌ దుకాణాలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:14 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 28: కాగజ్‌నగర్‌లో స్ర్కాప్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పట్టణంలో పుట్టగొగుల్లా ఈ దుకాణాలు వెలుస్తున్నాయి. అనుమతులు, లైసెన్సులు లేకుండానే ఈ వ్యాపారం ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు.

Kumaram Bheem Asifabad:  పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్ర్కాప్‌ దుకాణాలు

- నిబంధనలకు పాతర, పొంచి ఉన్న ప్రమాదం

- కాగజ్‌నగర్‌లో యథేచ్ఛగా స్ర్కాప్‌ దందా

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 28: కాగజ్‌నగర్‌లో స్ర్కాప్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పట్టణంలో పుట్టగొగుల్లా ఈ దుకాణాలు వెలుస్తున్నాయి. అనుమతులు, లైసెన్సులు లేకుండానే ఈ వ్యాపారం ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అధికారులకు ముడుపులు అందజేయటంతో ఈ దుకాణాలపై వైపు వారు కనీసం కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. కాగజ్‌నగర్‌ ప్రధాన రహదారి సమీపంలో గోడౌన్‌లు ఏర్పాటు చేశారు. గతంలో పలు చోరీలు జరగగా ఆ చోరీ వస్తువులు స్ర్కాప్‌ దుకాణాల వారు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే విద్యుత్‌ వైర్లు అపరహణ జరుగుతున్నాయి. వాస్తవంగా ఈ వ్యాపారంలో వినియోగంలోకి రానివి, చెడిపోయిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పలు స్ర్కాప్‌ దుకాణాల్లో ఏకంగా చోరీకి పాల్పడిన వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అతి తక్కువ ధరకు చోరీకి పాల్పడిన వస్తువులను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. పైగా వీటికి సంబంధించి ఎలాంటి పన్నులు కట్టకుండానే సామగ్రి తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోందనే ఆరోపణలున్నాయి.

పట్టణంలో పలుచోట్ల ఏకంగా నివాసగృహాల పక్కను ఇనుప విడి భాగాలు ఉంచటంతో వేసవిలో అగ్నిప్రమాదాల సంభవించే అవకాశాలున్నాయి. గతంలోనూ అగ్నిప్రమాదాలు సంభవించిన దాఖలాలున్నాయి. ఆస్తి, ప్రాణనష్టం జరుగకముందే అధికారులు ముందస్తుగా స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిర్పూరు నియోజకవర్గంలోని సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, దహెగాం, చింతలమానేపల్లికి చెందిన పలు ప్రాజెక్టులకు సంబంఽధించిన పరికరాలు కూడా చోరీ చేసి స్ర్కాప్‌ దుకాణాల్లో అమ్ముతున్నట్టు ప్రచారంలో ఉంది. కేవలం తాత్కాలికంగా కేసులు నమోదు చేసి అధికారులు ఈ దందాపై నిఘా పెట్టకపోవటంతో వీరి వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా కార్లు, ఇతర వాహనాలు చోరీ చేసి ఈ ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు సమాచారం. వీరి వద్ద ఉన్న కట్టర్‌ల ద్వారా వాహనాలను గంటల్లోనే తుక్కు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో లారీలు కూడా అపహరణ జరిగినట్టు ఫిర్యాదులు ఉండగా ఇంత వరకు వాటి ఆచూకీ లభించలేదు.

పట్టణం, మండలంలో స్ర్కాప్‌ అపహరించిన వారివద్ద నుంచి కొనుగోలు చేసిన తర్వాత లారీల్లో తూకం వేసి నేరుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ లారీ లోడ్‌ చేస్తున్న సమయంలోనే చోరీ చేసిన వస్తువులు కూడా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారులు గట్టి నిఘా పెట్టి వీరి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని అంతా కోరుతున్నారు. ఈ విషయమై డీఎస్పీ కరుణాకర్‌ను సంప్రదించగా తుక్కు వ్యాపారంపై గట్టి నిఘా పెడుతున్నామన్నారు. అలాగే చోరీలపై ఇతర క్రయ, విక్రయాలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 10:14 PM