Share News

Kumaram Bheem Asifabad: కుల సంఘాలే టార్గెట్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:19 PM

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 26: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు కుల సంఘాల ఓట్లపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలో కుల సంఘాలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

Kumaram Bheem Asifabad:  కుల సంఘాలే టార్గెట్‌

- చేరికలపై దృష్టిపెట్టిన నాయకులు

- సిర్పూరు, ఆసిఫాబాద్‌లో జోరుగా మంతనాలు

- బీఆర్‌ఎస్‌ను అన్నీ తానై నడిపిస్తున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- కాంగ్రెస్‌కు మెజార్టీ తెచ్చేందుకు కృషిచేస్తున్న కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్‌

- పీఎం మోదీ చరిష్మాతో ముందడుగు వేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 26: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు కుల సంఘాల ఓట్లపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలో కుల సంఘాలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఆదిలాబాద్‌ పార్లమెంటు సెగ్మెంటు పరిధిలో ఎస్టీ ఓటర్ల తర్వాత అత్యంత కీలక మారింది బీసీ ఓటు బ్యాంకు. దీంతో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు బీసీ, ఎస్సీ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని వారిని ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోకవర్గాల్లో బీసీ ఓటుబ్యాంకు గణనీయంగా ఉన్న సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకొని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌పార్టీ గతంలో తాము చేసిన కుల సంఘాలకు కేటాయించిన నిధులు, అభివృద్ధిపనులపై బీఆర్‌ఎస్‌ నాయకులు కులసంఘాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు.

జిల్లాలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన కోనేరు కోనప్ప ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవటంతో బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలినట్లయింది. ఈ క్రమంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ రెండు పార్టీలు బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసుకొని ఆ పార్టీ క్యాడర్‌ను తమ వైపు ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉన్న క్యాడర్‌ను చేజారి పోనీయకుండా కాపాడుకునేందుకు ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ జిల్లా వారే కావటంతో ఈ రెండు నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే రేయింబవళ్లు తేడా లేకుండా కుల సంఘాల నాయకులను కలుస్తున్నారు. కొత్తగా కాంగ్రెస్‌లోకి చేరిన కోనప్ప సిర్పూరు నియోజకవర్గంలో అధిక మెజార్టీ సాధించి తన సత్తాచాటాలని భావిస్తున్నారు. అలాగే సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్‌ కూడా కాంగ్రెస్‌ బలోపేతానికి తమ వంతుగా కృషిచేస్తున్నారు.

మరోవైపు నరేంద్ర మోదీ చరిష్మాతో బీజేపీ పట్ల ఉన్న క్రేజ్‌ను కొనసాగిస్తూ సిర్పూరులో మరింత పట్టు సాధించి బీజేపీకి మెజార్టీ ఓటు బ్యాంకు పెంచేలా ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సిర్పూరు నియోజకవర్గం బీజేపీకి పట్టు ఉన్న ప్రాంతాలతోపాటు గ్రామీణ ఓటర్లను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఆసిఫాబాద్‌ నియోజకర్గంలోను కొట్నాక విజయ్‌కి పగ్గాలు అప్పగించటం ద్వారా ఆ నియోజకవర్గంలోని ప్రధాన ఓటు బ్యాంకు అయిన ఆదివాసీల ఓట్లను బీజేపీ వైపు మళ్లీంచేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తలరాతను మార్చగల సామర్థ్యం కలిగిన బీసీ సామాజిక వర్గాల్లో కీలకమైన ఆరె, బారె, మున్నూరు కాపుల ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఎత్తుకు పైత్తులతో వ్యూహ్మాతకంగా ప్రచారానికి పదును పెడుతున్నాయి. మరోవైపు ఎస్సీ(మాదిగ) సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు ప్రకటించిన దరిమిలా ఆ సామాజికవర్గ ఓటర్లు ఎవరి వైపు నిలబడుతారన్నది జిల్లాలో ఆసక్తిగా మారింది.

Updated Date - Apr 26 , 2024 | 10:19 PM