Share News

Khammam Parliament : ఎవరిదో.. ఆధిపత్యం

ABN , Publish Date - May 12 , 2024 | 05:56 AM

భౌగోళికంగా తెలుగు రాష్ట్రాలకు గుమ్మంలా భావించే ఖమ్మం నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రె్‌సకు కంచుకోటగా నిలుస్తోంది. గతంలో జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావు

Khammam Parliament :  ఎవరిదో.. ఆధిపత్యం

ఖమ్మంలో హవా కొనసాగించాలని కాంగ్రెస్‌ ప్రయత్నం

అధిక మెజారిటీ సాధించడమే లక్ష్యమని ప్రకటన..

సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటామని బీఆర్‌ఎస్‌ ధీమా

గత ఎన్నికల ఫలితమే పునరావృతమవుతుందన్న నమ్మకం..

ఈసారి తామూ సత్తా చూపిస్తామన్న బీజేపీ

రాజకీయ చైతన్యానికి మారుపేరు. వామపక్ష ఉద్యమాలకు నెలవు. ఎన్నికల్లో విలక్షణ తీర్పులు ఇచ్చే నియోజకవర్గం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టినీ ఆకర్షించే ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఈసారి ఆసక్తికర పోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్శించిన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌, వరుసగా రెండోసారి గెలిచి సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ భావిస్తుండగా, ఈసారి తాము కూడా రేసులో ఉన్నామని బీజేపీ అంటోంది.

ఖమ్మం, మే 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి): భౌగోళికంగా తెలుగు రాష్ట్రాలకు గుమ్మంలా భావించే ఖమ్మం నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రె్‌సకు కంచుకోటగా నిలుస్తోంది. గతంలో జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావు వంటి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించారు. 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఇక్కడ 11 సార్లు కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించింది. ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వారిలో జలగం వెంగళరావు, పీవీ రంగయ్యనాయుడు, రేణుకాచౌదరి కేంద్రమంత్రులు కూడా అయ్యారు. అయితే స్థానికుల కంటే స్థానికేతర అభ్యర్థులే ఇక్కడ ఎక్కువసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరఫున వరుసగా మూడుసార్లు గెలుపొందిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌కు చెందినవారు కాగా, రెండుసార్లు గెలిచిన రేణుకాచౌదరి, ఒక్కోసారి నెగ్గిన పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు, పీపుల్స్‌ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌ నుంచి రెండుసార్లు గెలిచిన పీవీ విఠల్‌రావు కూడా స్థానికేతరులే. ఇలా వలస నేతలను ఎక్కువసార్లు ఆదరించిన ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఈసారి మూడు ప్రధాన పార్టీల నుంచి జిల్లాకు చెందిన నేతలే బరిలో నిలిచారు.

కాంగ్రెస్‌లో గెలుపు ధీమా..

ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఉత్కంఠగా సాగింది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గానికి బలమైన ఓటుబ్యాంకు ఉండడంతో వారికే టికెట్‌ వస్తుందని ఎక్కువ మంది భావించారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, వీరెవరికీ కాకుండా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డికి టికెట్‌ దక్కింది. జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మంత్రులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండడంతోపాటు ఇటీవలే రేణుకాచౌదరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రె్‌సకు బలమైన నాయకత్వంతోపాటు బలమైన ఓటుబ్యాంకు కూడా ఉంది. రఘురాంరెడ్డి గెలుపు కోసం నాయకులంతా కలిసికట్టుగా పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కొత్తగూడెంలో ‘జనజాతర’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఖమ్మం అభ్యర్థిని 3లక్షల మెజారిటీతో గెలిపించాలని జిల్లా మంత్రులకు సూచించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింట్లో కాంగ్రెస్‌ గెలవగా, కొత్తగూడెంలో కాంగ్రెస్‌ మిత్రపక్షం సీపీఐ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డికి ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం, సీపీఐ మద్దతు ప్రకటించి ప్రచారంలోనూ పాల్గొంటున్నాయి. రఘురాంరెడ్డి కూడా తాను స్థానికుడినని, కూసుమంచి మండలం చేగొమ్మకు చెందిన కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన వాడినని గుర్తు చేస్తున్నారు.


నామా గెలుపుపై బీఆర్‌ఎస్‌ ఆశలు..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రస్తుతం ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఉన్న నామా నాగేశ్వరరావు బరిలో నిలిచారు. ఖమ్మం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు పోటీచేసి రెండుసార్లు గెలిచిన నామా.. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బీఆర్‌ఎస్‌ ఒక్క అసెంబ్లీ స్థానంలోనే గెలిచినా.. ఆ తరువాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలుపొందారు. దీంతో ఈసారి కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా ఎంపీ స్థానాన్ని తామే గెలుచుకుంటామని బీఆర్‌ఎస్‌ నేతలు విశ్వాసంతో ఉన్నారు. అయితే 2018లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓడినా.. అప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోవడం నామాకు కలిసివచ్చింది. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఘోర పరాజయంతోపాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి అన్నీ కష్టాలే కనిపిస్తున్నాయి.

Untitled-6.jpg


నేను సైతం అంటున్న బీజేపీ..

ఖమ్మంలో గతంలో నామమాత్రంగా ఉన్న బీజేపీ.. ఈసారి ప్రధాన పార్టీలకు పోటీగా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ కరిష్మాతో సత్తా చూపిస్తామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తాను మాత్రమే స్థానికుడినని, మిగిలిన ఇద్దరూ నాన్‌లోకల్‌ అని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు అంటున్నారు. ఆయన తరఫున ఇప్పటికే కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారం నిర్వహించారు. బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంతోపాటు భద్రాద్రి-అయోధ్యకు ఆధ్యాత్మిక కారిడార్‌ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు.

Untitled-5.jpg

Updated Date - May 12 , 2024 | 05:56 AM