YCP Government : పిడికెడు పెట్టి బండెడు పట్టి
ABN , Publish Date - May 07 , 2024 | 03:36 AM
ఈ ఐదేళ్లలో అడ్డగోలుగా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు పెండింగ్ పెట్టారు. అప్పులు పెరిగాయి కానీ, ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. ‘సంక్షేమం’లోనూ సవాలక్ష నిబంధనలతో కోతలు పెట్టారు.
ఇదీ జగన్ మార్క్ డొల్ల ‘సంక్షేమం’
ఐదేళ్లలో కొత్తగా ఇచ్చింది 44,825 కోట్లే.. సర్కారు లాక్కొంది 1,02,830 కోట్లు
కొత్తగా తెచ్చింది నాలుగు పథకాలే
అమ్మఒడి, వాహనమిత్ర, చేదోడు, చేయూత
మినహా అన్నీ గతంలో ఉన్న పథకాలే
పేర్లు మార్చి కొత్తగా ఇస్తున్నట్టు కలరింగ్
పైగా నిబంధనలతో అమల్లో కోతలు
మరోవైపు పేదలపై రకరకాలుగా బాదుడు
బోగస్ గొప్పలు..
సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్.. ఓ చేత్తో పేదలకు ఇస్తూ, మరో చేత్తో రెండింతలు లాక్కొన్నారు. అమ్మఒడి, వాహన మిత్ర, చేదోడు, చేయూత పథకాలు మాత్రమే కొత్తవి. మిగతా పథకాలన్నీ పాతవే. వాటికి పేర్లు, అమలు తీరు మార్చి తానే కొత్తగా ప్రారంభించినట్టు కలరింగ్ ఇచ్చారు. పైగా గతంలో ఉన్న ఎన్నో పథకాలను రద్దు చేశారు.
జగన్ ఈ ఐదేళ్లలో కొత్త పథకాలకు చేసిన ఖర్చు రూ.44,825 కోట్లు అయితే.. ఆర్టీసీ, కరెంట్ చార్జీలు, పేదల ఇళ్లపై ఓటీఎస్, రకరకాల పన్నుల పేరిట ప్రజల నుంచి ఏకంగా రూ.1,02,830 కోట్లు లాక్కొన్నారు. కొత్త పథకాలకు చేసిన ఖర్చు కంటే.. వాతల మోతే ఎక్కువ.
వంద ఇచ్చి.. 200 లాగి..
జగన్ సంక్షేమ పథకాల పేరిట రూ.100 ఇస్తే.. ప్రజల నుంచి పన్నులు, చార్జీల రూపంలో రూ.200 లాక్కొన్నారు. ఉదాహరణకు ఈ ఐదేళ్లలో అమ్మఒడి పథకం కింద ఓ విడత ఎగ్గొట్టి, నాలుగు విడతల్లో మొత్తం రూ.25,000 కోట్లు ఇచ్చారు.
ఈ ఐదేళ్లలో ట్రూఅప్, సర్దుబాటు పేరిట మొత్తం 9సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజల నుంచి అదనంగా రూ.25,000 కోట్లు గుంజుకున్నారు. అంటే... అమ్మఒడి కింద ఇచ్చిన మొత్తాన్ని కరెంటు చార్జీల రూపంలో లాగేసుకున్నారు.
మరి పేదలను ఏం ఉద్ధరించినట్టు? వారికి ఏం సాయం చేసినట్టు? ఒక్క అమ్మఒడే కాదు ఇతర పథకాల సంగతీ ఇంతే. ఆర్టీసీ చార్జీలు, పన్నులు, ఓటీఎస్, పెట్రోల్, డీజిల్‌పై సెస్, వ్యాట్ బాదుడుతో పేదల నుంచి పిండుకున్నారు. జగన్ ఎంతో గొప్పగా చెప్పుకొనే సంక్షేమం ఇదే.
బాదుడే బాదుడు
మద్యం నుంచి 30,000 కోట్లు
మద్య నిషేధం చేస్తామంటూ గత ఎన్నికల్లో గెలిచిన జగన్.. సీఎం అయ్యాక ప్రభుత్వ దుకాణాలు తెరిచి మద్యం అమ్మించారు. ఊరూపేరు లేని, ఆరోగ్యానికి హానిచేసే రకరకాల బ్రాండ్లు అమ్మించి పేదల జీవితాలతో ఆడుకున్నారు. భారీగా మద్యం ధరల పెంపుతో ప్రజలపై అదనంగా పడిన భారం 30,000 కోట్లు.
విద్యుత్ మోత 25,000 కోట్లు
ఈ ఐదేళ్లలో ట్రూఅప్, సర్దుబాటు చార్జీల పేరుతో భారీగా బాదేశారు. అది చాలదన్నట్టు స్మార్ట్‌మీటర్ల ఖర్చును ప్రజల నెత్తినే రుద్దుతున్నారు. ఈ బాదుడుతో పాటు పరిశ్రమలకు పెంచిన చార్జీలు కలిపి దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేశారు.
బస్సు చార్జీల బాదుడు 5,200 కోట్లు
ఆర్టీసీ చార్జీలను జగన్ సర్కార్ ఎడాపెడా పెంచేసింది. ఈ ఐదేళ్లుగా పేదలపై రూ.5,200 కోట్ల భారం వేసింది.
పన్నుల వాత 2,350 కోట్లు
2021-22 నుంచి కొత్త ఆస్తి పన్ను విధానంతో ప్రజలపై భారం మోపారు. జనాల నుంచి రూ.950 కోట్లను ప్రభుత్వం పిండేసింది. దీనికి తోడు చెత్త పన్ను వేశారు. దీని ద్వారా ప్రభుత్వం ఏటా రూ.400 కోట్లు లాగుతోంది. ఇక 2021 నవంబరు నుంచి వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పెంచింది. లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పెంపు వల్ల ఏటా ప్రజలపై రూ.409 కోట్ల భారం పడుతోంది. రెండున్నరేళ్లలో ఈ బాదుడు రూ.1,000 కోట్లపైనే!
పెట్రోల్, డీజిల్‌పై 20,000 కోట్లు
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా ఎక్కువ. లీటరుకు రూ.2గా ఉన్న అదనపు వ్యాట్‌ను జగన్ సర్కారు రూ.4కు పెంచింది. దీంతోపాటు ప్రతి లీటర్‌పై రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట రూపాయి చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. ఈ ఐదేళ్లలో వీటి ద్వారా ఖజానాకు రూ.65,000 కోట్లు రాగా.. ఇందులో జగన్ సర్కారు అదనంగా వేసిన వ్యాట్, సెస్ ద్వారా పిండింది దాదాపు రూ.20,000 కోట్లు.
కోతలు.. వాతలు
రేషన్‌పై దెబ్బ 6,900 కోట్లు
జగన్ సర్కారు చివరికి రేషన్ సరుకులను కూడా వదల్లేదు. కందిపప్పు, చక్కెర ధరలను పెంచేసింది. రాష్ట్రంలో కోటీ 45 లక్షల రేషన్ కార్డులుండగా... సగటున ప్రతి నెలా కోటీ 23 లక్షల కార్డుదారులు కందిపప్పు తీసుకుంటున్నారు. 2 కిలోలు ఇవ్వాల్సిన కందిపప్పును జగన్ ప్రభుత్వం కేజీకి తగ్గించింది.
పైగా రూ.40 ఉన్న కిలో కందిపప్పు ధరను రూ.67కి పెంచింది. పేదలపై ఏడాదికి రూ.1,590 కోట్ల చొప్పున, నాలుగేళ్లలో రూ.6,500 కోట్ల భారం పడింది. అలాగే, అర కిలో చక్కెర ధరను రూ.10 నుంచి రూ.17కు పెంచారు. దీనివల్ల ప్రజలపై ఏడాదికి రూ.103 కోట్ల చొప్పున, నాలుగేళ్లలో రూ.410 కోట్ల భారం వేశారు.
పేదల ఇళ్లపై 3,900 కోట్లు
గత ప్రభుత్వాలు పేదలకు కట్టించిన ఇళ్లపైనా జగన్ డబ్బులు వసూలు చేశారు. ఓటీఎస్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000, పట్టణాల్లో రూ.15,000, నగరాల్లో రూ.20,000 చొప్పున బలవంతంగా వసూలు చేశారు. జగన్ ఫొటో, నవరత్నాల లోగోలతో కూడిన ఇంటి పట్టా అంటూ లబ్ధిదారులకు ఇచ్చారు.
ఇప్పుడు ఆ ఇళ్లు అమ్ముకోవడానికి కానీ, బ్యాంకులో తాకట్టు పెట్టడానికి కానీ ఆ పట్టాలు పనికిరావడం లేదని పేదలు గగ్గోలు పెడుతున్నారు. జగన్ సర్కార్ మాత్రం పేదలను కుళ్లబొడిచి రూ.3,900 కోట్లు వసూలు చేసింది. అలాగే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరించే పేరుతో మరో రూ.500 కోట్లు వసూలు చేసింది.
విద్యార్థులకు కోత 1,400 కోట్లు
ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని జగన్ ప్రభుత్వం ఎత్తేస్తూ జీవో 77 ఇచ్చింది. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై దాదాపు రూ.1,400 కోట్ల భారం పడింది.
రైతుల నుంచి 650 కోట్లు
అసలే తీవ్రనష్టాల్లో ఉన్న రైతులపై ప్రభుత్వం నీటి తీరువా బకాయిల భారం మోపింది. 2013-14 నుంచి రైతులు చెల్లించాల్సిన ఈ బకాయిల భారం రూ.650 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
మీ సేవలపై మోత 120 కోట్లు
మీ సేవ చార్జీలను జగన్ సర్కారు పెంచింది. 2022 ఏప్రిల్ నుంచి మొదలైన ఈ పెంపుతో ప్రజలపై అదనంగా రూ.120 కోట్ల భారం పడింది.
ఇసుకతో 4,000 కోట్లు
జగన్ సీఎం అయ్యాక ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. టన్ను ఇసుక ధరను రూ.375గా నిర్ణయించారు. ఏడాదిన్నర తర్వాత రూ.475కి పెంచారు. ఈ ఐదేళ్లలో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుకను విక్రయించారు. దీని విలువ రూ.4,000 కోట్లు.
రిజిస్ర్టేషన్లపై వాత 1,000 కోట్లు
ఐదేళ్లలో మూడుసార్లు భూముల మార్కెట్ విలువ పెంచారు. యూజర్ చార్జీలు కూడా పెంచారు. దీంతో రిజిస్ర్టేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలు భారీగా పెరిగాయి. దీనివల్ల ప్రజలపై ఈ ఐదేళ్లలో అదనంగా రూ.1000 కోట్ల భారం పడింది.
ఈ ఐదేళ్లలో అడ్డగోలుగా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారు. కేంద్ర నిధులు దారి మళ్లించారు. ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు పెండింగ్ పెట్టారు. అప్పులు పెరిగాయి కానీ, ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. ‘సంక్షేమం’లోనూ సవాలక్ష నిబంధనలతో కోతలు పెట్టారు.
రకరకాలుగా పన్నులు, చార్జీలు బాదుతూ సామాన్యులపై ఆర్థిక భారం మోపారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేనివిధంగా చివరికి చెత్తకు కూడా పన్ను వేశారు. మరోవైపు యువతకు ఉపాధి లేదు. కార్మికులకు చేతిలో పనిలేదు. సంక్షేమానికి వేలు, లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతూనే.. అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు.
పేదలకు ఇచ్చిన దాని కంటే వారి నుంచి లాక్కొన్నదే ఎక్కువ. జగన్ సీఎం అయ్యాక తెచ్చిన కొత్త పథకాలు అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర, చేదోడు. ఐదేళ్లలో అమ్మఒడి కోసం రూ.24,000 కోట్లు, చేయూతకు రూ.18,000 కోట్లు, చేదోడుకు రూ.1,625 కోట్లు, వాహన మిత్రకు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు.
గతంలో ఉన్న పథకాల కోసం కాకుండా జగన్ తెచ్చిన ఈ కొత్త పథకాల కోసం ఈ ఐదేళ్లలో ఖర్చు పెట్టింది రూ.44,825 కోట్లు మాత్రమే. జగన్ గద్దెనెక్కాక మద్యం ధరలు, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచారు.
ఆస్తిపన్ను పెంచారు. రిజిస్ర్టేషన్ చార్జీలు, యూజర్ చార్జీలు భారీగా పెంచారు. ఉచిత ఇసుకను అమ్ముకున్కారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేశారు. వాహనాలపై పన్నుల మోత మోగించారు. ఇలా పేదల జేబుకు చిల్లుపెట్టే ఏమార్గాన్నీ వదలకుండా వారిని మరింత పేదరికంలోకి నెట్టేశారు. ఈ ఐదేళ్లలో ఇలా పేదల నుంచి మొత్తం అక్షరాలా లక్ష కోట్ల రూపాయలకు పైగా లాక్కొన్నారు.