Share News

రంగు మార్చారు.. అంతే!

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:19 AM

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో హామీలకే రంగులేశారు. పట్టణంలో టిడ్కో ఇళ్లు పేదలకు అందిస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చి ఇళ్లకు పార్టీ రంగు వేసి ప్రజలను మోసం చేశారు.

రంగు మార్చారు.. అంతే!
తాడేపల్లిగూడెంలో టీడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను హామీలతో మోసం చేశారు

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్మాణం గాలికొదిలేశారు

స్టేడియం ఊసే లేదు

రహదారులు అధ్వానం

గ్రామాల్లో మురుగు కంపు

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో హామీలకే రంగులేశారు. పట్టణంలో టిడ్కో ఇళ్లు పేదలకు అందిస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చి ఇళ్లకు పార్టీ రంగు వేసి ప్రజలను మోసం చేశారు. మంచినీటి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే మంత్రి అయ్యారు కానీ నియోజకవర్గంలో అంగుళం అభివృద్ధి లేదు. ప్రాజెక్ట్‌లన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. నియోజకవర్గంలో అధ్వాన రహదారులు వైసీపీ పాలనకు అద్దం పడతాయి. ఐదేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు కొండంత.. అభివృద్ధి చిటికెడంత కూడా లేదు.

– తాడేపల్లిగూడెం అర్బన్‌

నియోజకవర్గంలో అభివృద్ధి జాడ లేదు. హామీలకు రంగులు మార్చడం, ఒకే పనికి రెండు సార్లు శంకుస్థాపన చేయడం, పూర్తి చేసిన పని ఒక్కటి కూడా లేకపోవడం వైసీపీ పాలన ప్రత్యేకం. నియోజకవర్గంలో రహదారులు, డ్రెయిన్లు అధ్వానం. పట్టణ ప్రజలకు తీరని దాహార్తి.

రంగు మారిన టిడ్కో ఇళ్లు

ఏపీ టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. లబ్ధిదారుల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రంగు మార్చారు. 300 చదరపు అడుగుల ఇళ్లను మాత్రమే ఉచితంగా ఇచ్చారు. 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు రూ.3.65 లక్షల భారం పడింది.

సమ్మర్‌ స్టోరేజీ.. రెండుసార్లు శంకుస్థాపన

తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌కు శ్రీకారం చుట్టింది. అంతలో ఎన్నికలు రావడంతో వైసీపీ పాలనలో మొదటికొచ్చింది. ఎమ్మెల్యే అయిన కొట్టు సత్యనారాయణ మరోసారి శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు. కొత్త అంచనాలతో అమృత్‌ 2.0లో ప్రాజెక్ట్‌ను మంజూరు చేశారు. ఇటీవల రెండో సారి మళ్లీ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌కు మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీపై అయోమయం

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించేలా ప్రణాళిక చేసుకున్నారు. ప్రభుత్వం మారిపోవడంతో పట్టణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.

తాడేపల్లిగూడెం పట్టణంలో స్టేడియం నిర్మిస్తామంటూ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. దానిని నిర్మించలేదు. అంతేకాదు. తెలుగుదేశం హయాంలో గణేశ్‌ నగర్‌వద్ద ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కడకట్లలో స్విమ్మింగ్‌ పూల్‌ను కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.

పెంటపాడు మండలంలో అధ్వాన రహదారులు, బోడపాడులో వెంకయ్య వయ్యేరు కాలువపై వంతెన నిర్మాణంపై పాలకులు కన్నెత్తి చూడలేదు. బోడపాడు వంతెన సమస్యతో విద్యార్థుల పాట్లు చెప్పనలవి కాదు. గ్రామంలో 7వ తరగతి వరకు మాత్రమే పాఠశాల ఉంది. హైస్కూలు విద్యకు రావిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సిందే. వారికోసం గ్రామస్తులు కాలువపై బల్లకట్టు ఏర్పాటు చేసి ఒక మనిషిని పెట్టారు. తర్వాత బల్లకట్టు నడిపే వ్యక్తి మానేయడంతో ఇరువైపులా తాడు కట్టుకుని గ్రామస్తులే బల్లకట్టుపై కాలువ దాటేవారు. ఇటీవల వర్షాలకు బల్లకట్టు కూడా కొట్టుకుపోయింది. దీనితో సుమారు 6 కిలో మీటర్ల అధ్వాన పుంత దారిలో విద్యార్థులు విన్యాసాలు చేయాల్సిందే.

అధ్వానంగా రహదారులు

మండలంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ప్రధాన రహదారులు సైతం గోతులతో ప్రమాదకరంగా ఉన్నాయి. రావిపాడు, కె.పెంటపాడు, తదితర గ్రామాలలో పుంత రహదారుల అభివృద్ధికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు చేశామంటున్నా కార్యాచరణ లేదు.

గ్రామాలలో మురుగు కంపు

డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానం కావడంతో గ్రామాలు కంపు కొడుతున్నాయి. ప్రత్తిపాడు ఎస్సీ కాలనీ కొత్తపేట, మీనవల్లూరు, ఉమామహేశ్వరం ఎస్సీ కాలనీల్లో మురుగుతో స్థానికిలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్తిపాడు కొత్తపేటలో మురుగు నిలిచిపోయి దోమల వ్యాప్తితో రోగాల బారిన పడుతున్నారు.

ఇళ్లేవి జగనన్నా..?

ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో టిడ్కో ఇళ్లు ఇస్తానన్నారు. రంగులేసి ఊరుకున్నారు. పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మిస్తామన్నారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి సమ్మర్‌ స్టోరేజి ట్యాంక్‌ నిర్మిస్తామన్నారు. ఐదేళ్లు గడిచినా వాటి ప్రస్తావనే తేలేదు. గ్రామాల్లో రహదారులు గోతులతో ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోలేదు. మురుగుతో కంపుకొడుతున్నా పట్టనట్లు పదవీ కాలం గడిపేశారు.

నెరవేరని హామీలు

తాడేపల్లిగూడెం పట్టణంలో స్టేడియం నిర్మిస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అమలు చేయలేదు.

టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. పనులు పూర్తి చేయడకుండా కేవలం రంగులు వేసి ప్రజలను మోసం చేశారు.

పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్మాణంపై హామీ అమలుకు ఐదేళ్లు సరిపోలేదు.

పట్టణంలో ప్రధాన సమస్యల మురుగు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రతిపాదనలతో కొట్టుమిట్టాడుతోంది. భూగర్భ డ్రెయినేజీ నిర్మాణం పూర్తిచేస్తామన్న పాలకులు పట్టించుకోలేదు.

కె.పెంటపాడు – పడమర విప్పర్రు రహదారి నిర్మాణానికి మంత్రి కొట్టు సత్యనారాయణ హామీ నిలుపుకోలేదు.

ప్రత్తిపాడు కొత్తపేటలో డ్రెయినేజీ, రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి కొట్టు హామీ ఇచ్చారు. నేటికీ హామీ నెరవేరలేదు.

వెంకయ్య వయ్యేరుపై బోడపాడు వద్ద వంతెన నిర్మాణం పట్టించుకోలేదు.

సైకిల్‌పై 12 కిలో మీటర్లు

వెంకయ్య వయ్యేరు కాలువపై వంతెన లేక ఇబ్బంది పడుతున్నాం. రావిపాడు పాఠశాలకు వెళ్ళేందుకు పుంత రహదారి చుట్టూ తిరిగి ప్రతీ రోజు 12 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి వస్తున్నాం. వంతెన నిర్మాణం జరిగితే ఇబ్బంది ఉండదు. తొందరగా ఇంటికి చేరతాం.

ఎస్‌.వాసంతి, 9వ తరగతి విద్యార్థి, బోడపాడు

పుంతదారిలో భయం.. భయం..

ప్రతీ రోజు పుంత దారిలో వెళ్లి రావడం చాలా భయంగా ఉంది. దారి మధ్యలో పాములు వచేస్తున్నాయి. వెలుగు ఉండగా ఇంటికి చేరుకోవాలి. లేక పోతే దారి చాలా భయంగా ఉంటుంది. ఆలస్యం అవుతుందని పాఠశాలలో ప్రత్యేక తరగతులకు కూడా హాజరు కాలేకపోతున్నాం.

ఎం.నందిని, 9వ తరగతి విదార్థిని, బోడపాడు

సైకిల్‌కు మరమ్మతులు భారం

వంతెన నిర్మిస్తామని చెబుతున్నారు కానీ పట్టించుకోవడం లేదు. రోజూ సైకిల్‌పై పాఠశాలకు వెళుతున్నాం. పుంత దారిలో రాళ్లతో సైకిల్‌ పంక్చర్‌ అవుతుంది. టైర్‌ పంక్చర్‌కు రూ 40 ఖర్చు అవుతోంది. ఆలస్యమైతే ఇంటి వద్ద అమ్మ, నాన్న భయపడతారు. వంతెన నిర్మించండి.. ప్లీజ్‌

ఎం.సూర్య, విద్యార్థి, 9వ తరగతి

Updated Date - Apr 30 , 2024 | 12:19 AM