Share News

కొవ్వూరు.. హామీల వరద

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:05 AM

కొవ్వూరు నియోజకవర్గంలో ఆదాయ వనరులు అంతంతమాత్రం కాగా పర్యాటకమే ప్రధానం. అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నా వైసీపీ పాలనలో పర్యాటకం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

కొవ్వూరు.. హామీల వరద

హేవలాక్‌ వంతెన పర్యాటకాభివృద్ధి మరిచిపోయారు

జిల్లా ఆస్పత్రి ఏర్పాటు ఊసే లేదు

కొవ్వూరు – భద్రాచలం రైలు మార్గం ఆగిపోయింది

కొవ్వూరు నియోజకవర్గంలో ఆదాయ వనరులు అంతంతమాత్రం కాగా పర్యాటకమే ప్రధానం. అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నా వైసీపీ పాలనలో పర్యాటకం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పాదయాత్రలో జగన్‌ హామీల వరద పారించారు. అధికారంలోకి వచ్చాక గోదావరిలో కొట్టుకుపోయాయి. ఒకపక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన గోష్పాదక్షేత్రం, మరోపక్క గోదావరికి మణిహారాలుగా నిర్మించిన నాలుగు వంతెనలు. ఎక్స్‌ప్రెస్‌ హైవే ఆనుకుని, పచ్చని ప్రకృతి రమణీయ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారు. రాజమహేంద్రవరం, కొవ్వూరును జంట నగరాలు చేస్తామని జగన్‌ ఇచ్చిన హామీ గోదారిలో కలిసిపోయింది. గోదావరిపై హేవలాక్‌ వంతెన పర్యాటక హామీని సీఎం జగన్‌ మరిచిపోయారు. కొవిడ్‌ ఉధృతంగా ఉన్నప్పుడు కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో పలు రైళ్ల హాల్ట్‌ నిలిపివేశారు. నేటికీ వాటిని పునరుద్ధరించలేదు. నియోకవర్గ కేంద్రమైన కొవ్వూరు చుట్టుపక్కల సుమారు వంద గ్రామాలకు ముఖ్య పట్టణం. ఇక్కడ కనీసం డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కూడా చేపట్టకపోవడం వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

– కొవ్వూరు

కొవ్వూరు డివిజన్‌ కేంద్రం.. నియోజకవర్గ కేంద్రం.. మున్సిపాలిటీ.. సుమారు వంద గ్రామాలకు ముఖ్య పట్టణం.. వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అభివృద్ధిని పట్టించుకోలేదు. 70 ఏళ్ల కిందట నియోజకవర్గ కేంద్రం ఎలా ఉందో నేటికి అలానే ఉంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో పుష్కర సమయంలోనే చేపట్టిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికీ కనిపిస్తుంది. కొవ్వూరు మున్సిపాల్టీ ఏర్పడి 5 దశాబ్దాలు అవుతున్నా డంపింగ్‌ యార్డు సమస్య వేధిస్తుంది. శాశ్వత డంపింగ్‌యార్డు లేకపోవడంతో ప్రతి రోజు ఇంటింటా సేకరించిన, చ్తెను రహదారుల వెంబడి పారబోసి తగల బెట్టడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రిఫరల్‌ కేంద్రంగా పేరుగాంచింది. కొవ్వూరు పట్టణం నేషనల్‌ హైవేను ఆనుకుని ఉండడంతో ఆసుపత్రికి రహదారి ప్రమాదాలలో గాయపడిన వారిని ఇక్కడకు తీసుకువస్తుంటారు. అత్యవసర సేవలకు రాజమహేంద్రవరం రిపర్‌ చేస్తున్నారు.

కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మాణం చేపట్టక పోవడంతో జూనియర్‌ కళాశాలలో షిఫ్ట్‌ల వారీగా తరగతు లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయి విద్య అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

కొవ్వూరు పట్టణంలో స్థానిక క్సిస్టియన్‌పేట గామన్‌ వంతెన నుంచి గోదావరి గట్టు వెంబడి రోడ్డు కం రైలు బిడ్ర్జి వరకు నిర్మించిన గోదావరి బండ్‌ పార్క్‌ కళావిహానంగా తయారైంది. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలని కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పార్క్‌ పిచ్చిమొక్కలు, విష పురుగులకు ఆవాసంగాను, జూద క్రీడలకు నిలయంగా మారింది. గోదావరి బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దడంలో స్ధానిక మంత్రి, వైసీపీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు.

కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో పంట కాలువలు, మురుగు కాలువలు దశాబ్దకాలంగా పూడిక తొలగించలేదు. కాలువలు పూడిక, గుర్రపుడెక్క, ఆక్రమణలతో వర్షాకాలంలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు నష్టాల బారిన పడుతున్నారు.

హామీల వంతెన హేవలాక్‌

గోదావరిపై మొట్టమొదటి వంతెన హేవ్‌లాక్‌ బ్రిడ్జి. రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి నిర్మాణం అనంతరం హేవలాక్‌ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. నిరుపయోగంగా ఉన్న వంతెనను పర్యాటకంగా అబివృద్ధి చేస్తామని ప్రతిపక్ష హోదాలో పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మరిచిపోయారు. మరమ్మతులకు గురైన రోడ్డు కం రైలు వంతెనకు పూర్తిస్థాయి పనులు చేపట్టక పోవడంతో తరచు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వంతెనల చెంతనే భారీ యంత్రాలతో ఇసుక డ్రెడ్జింగ్‌ చేయడంతో వంతెనలు క్రుంగిపోతున్నాయి. ఇటీవల గామన్‌ వంతెన స్తంభం కుంగింది. రాకపోకలు నిలిపివేశారు.

కొవ్వూరులో రైళ్లు ఆగవు

కొవిడ్‌ కారణంగా కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో రైళ్ల హాల్ట్‌ నిలిపివేశారు. హాల్ట్‌ పునరుద్ధరించడంలో ప్రభుత్వం, మంత్రి విఫలమయ్యారు. కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాలలోని సుమారు వంద గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిలుపుదల చేసిన రానుపోను 35 రైళ్లను పునరుద్ధరించాలని నేటికి ఆందోళన చేపడతూనే ఉన్నారు.

కొవ్వూరు, భద్రాచలం రైలు మార్గం పూర్తిచేయాలి

కొవ్వూరు, భద్రాచలం రైల్వేలైను సర్వే పనులను పూర్తిచేయాలి. నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. దీంతో ఏజన్సీ ప్రాంతం పూర్తిస్థాయిలో అబివృద్ది చెందుతుంది. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు బొగ్గు రవాణాకు మార్గం సుగమమవుతుంది.

జిల్లా ఆస్పత్రి ఏర్పాటు..?

కొవ్వూరులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో నిత్యం ఏదో ప్రమాదంలో క్షతగాత్రులు కొవ్వూరు ఆసుపత్రికి వస్తుంటారు. వారిని రాజమహేంద్రవరం, కాకినాడ రిఫర్‌ చేయడంతో రిఫరల్‌ కేంద్రంగా పేరుగాంచింది. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి ప్రాంగణాన్ని మెడికల్‌ కళాశాలగా మార్పు చేశారు. ఈ నేపద్యంలో జిల్లా ఆసుపత్రి కొవ్వూరులో ఏర్పాటుచేస్తే పట్టణం మరింత అబివృద్ధి చెందుతుంది.

నెరవేరని సీఎం హామీలు

కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణానికి రూ. 30 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రూపాయి విదల్చలేదు.

కుమారదేవం, పైడిమెట్ట, బ్రాహ్మణగూడెం, చాగల్లు ఎత్తిపోతల పఽథకాలకు నూతన పంపులు ఏర్పాటుకు నిదులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ అతీగతీ లేదు.

కొవ్వూరులో ఎస్సీ కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం, ముస్లింలకు షాఽదిఖానా నిర్మాణానికి నిదులు కేటాయిస్తున్నట్లు, నియోజకవర్గంలో మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్‌ భవనాలు నిర్మాణ ప్రతిపాదనలకు సీఎం రైట్‌ రైట్‌ అన్నారు. డబ్బులు ఇవ్వలేదు.

కొవ్వాడ కాలువ వరద ముంపు నుంచి తాళ్లపూడి మండల రైతులను గట్టెంక్కించడానికి, ప్రమాదాలు జరగకుండా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో కల్వర్టు నిర్మాణం చేపడతామని, సుమారు రూ. 50 కోట్ల పనులకు ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ అందించారు. నిధులు ఇవ్వలేదు.

గోదావరి తీరంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం గోష్పాదక్షేత్రాన్ని పర్యాటకంగా అబివృద్ధి చేస్తామన్నారు. పట్టించుకోలేదు.

కొవ్వూరు, రాజమహేంద్రవరం మధ్య రోడ్డు కం రైలు బ్రిడ్జిపై పెరిగిన వాహన రాకపోకల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్డు కం రైలు బ్రిడ్జికి అనుసంధానంగా మరో రోడ్డు వంతెన నిర్మాణం ప్రతిపాదనే లేదు.

Updated Date - Apr 29 , 2024 | 12:05 AM