Share News

హైవేలోనూ జనానికి తిప్పలే

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:42 AM

మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారయాత్ర ఏలూరు జిల్లాలో అడుగిడింది.

హైవేలోనూ జనానికి తిప్పలే
పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు

సీఎం జగన్‌ పర్యటనలో భారీ భద్రత

బస్సులో నుంచి కదలకుండానే చేతులూపిన జగన్‌.. హైవేపై ‘ఫ్యాన్‌’ కార్యకర్తలకు చుక్కలు

జనం పల్చగా, వాహనాల శ్రేణి పెద్దగా..

పెదవేగి/పెదపాడు/ఏలూరు క్రైం/దెందులూరు/ భీమడోలు/ఉంగుటూరు, ఏప్రిల్‌ 15 : మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారయాత్ర ఏలూరు జిల్లాలో అడుగిడింది. బస్సులో సీఎం జగన్‌ ప్రయాణిస్తుండగా ఆయన వెంటే పెద్దసంఖ్యలో వాహనాలు అనుసరించాయి. గులకరాయి దాడి తర్వాత కనీవిని ఎరుగని రీతిలో భద్రతా బలగాల మధ్య సోమవారం రాత్రి హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నారాయణపురం వరకు సీఎం జగన్‌ బస్సులో ప్రయాణించారు. ఏలూరు జిల్లా సరిహద్దు అప్పనవీడు దాటి హైవేలో ప్రవేశించిన కాన్వాయ్‌ కలపర్రు టోల్‌గేట్‌ వద్ద కొన్ని నిమిషాలపాటు ఆగింది. అప్పటికే ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల నుంచి కొద్దిపాటి సంఖ్యలో కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. సీఎం జగన్‌పై గులకరాయి దాడి జరిగి 48 గంటలు దాటిన తర్వాత పోలీస్‌, భద్రతా బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. గతంలో మాదిరిగా కాకుండా వైసీపీ వారైనా ఎక్కడ లేని జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను నిలువరించారు. కలపర్రు టోల్‌గేట్‌ వద్ద అప్పటికే ఎమ్మెల్యేలు ఆళ్ళ నాని, కొఠారు అబ్బయ్యచౌదరి కార్యకర్తలు వెంటరాగా అక్కడకు చేరుకున్నారు. వారిద్దరు సీఎం ప్రయాణిస్తున్న బస్సులోకి వెళ్ళారు. ఆపై జడ్పీ చైర్‌ పర్సన్‌ ఘంటా పద్మశ్రీ బస్సు ఎదుటే సీఎం జగన్‌కు గుమ్మడికాయ దిష్టి తీశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ హోదాలో పద్మశ్రీని మాత్రమే ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అనుమతించారు. మిగతా వారిని బస్సు సమీపంలోకి రానీయకుండా నెట్టివేశారు. ఉన్న కొద్దిపాటి కార్యకర్తలకు ఈ చర్యలు రుచించలేదు. కలపర్రు టోల్‌గేట్‌ వద్ద మాత్రమే జనం పల్చగా హజరయ్యారు. ఆ తర్వాత సీఎం కాన్వాయ్‌ హైవేపై దూసుకుపోయింది. ఇంతకు ముందు కొద్దిపాటి మందే కార్యకర్తలు ఉన్నా వారిని చూసి అభివాదం చేసే సీఎం ఈసారి బస్సులోనే ఉండిపోయారు. ప్రత్యేకించి ఆయన ప్రయాణిస్తున్న మార్గం జాతీయ రహదారి కావడంతో ఏలూరు ఆశ్రం ఆస్పత్రి, దెందులూరు క్రాస్‌ రోడ్డు, కొవ్వలి క్రాస్‌రోడ్డు, సత్యనారాయణపురం.. ఎక్కడా కూడా ఆగకుండానే హైవే మీదే ముందుకు సాగారు. సర్వీస్‌ రోడ్లలోను ఎక్కడా జనమే కనిపించలేదు. రాత్రివేళ కావడంతో వీరంతా ముందస్తుగా కలపర్రు టోల్‌గేట్‌ వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వెళ్ళినట్టు వైసీపీ నేతలు మాట ఏమార్చారు. లంకల గ్రామాలకు చెందిన కొద్దిపాటి మందిని గుండుగొలను జంక్షన్‌కు జగన్‌ రాకకు కొన్నిగంటల ముందే స్థానిక నేతలు రప్పించారు. ఎక్కడా ప్రసంగాలు, ఓదార్పులు లేకుండానే నిర్ణీత వ్యవధికంటే జగన్‌ పర్యటన గంటన్నర ఆలస్యంగా సాగింది. దీంతో వచ్చిన కొద్దిమంది గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. భీమడోలు రైల్వే క్రాసింగ్‌ వద్ద వేచిఉన్న కొద్దిపాటి జనాన్ని కూడా జగన్‌ను కలవనీయకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. పూళ్ళ సెంటర్‌లోనూ కాస్తో కూస్తో జనం ఉన్నా సీఎం కాన్వాయ్‌ ముందుకే సాగింది. కైకరం, నారాయణపురం జంక్షన్లలో రాత్రి హైవే మీదే సీఎం కోసం పడిగాపులు పడడమే కాకుండా విపరీతమైన భద్రతా కారణాల దృష్ట్యా అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఎవరినీ కలవనీయకుండా చేశారు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి కైకరం వరకు సుమారు 51 కిలోమీటర్లు గంటంపావు వ్యవధిలోనే సీఎం కాన్వాయ్‌ ప్రయాణించింది.

హైవేలోనూ తప్పని తిప్పలు..

ఇంతకు ముందు నిర్దేశించిన కార్యక్రమం ప్రకారం గుడివాడ, భీమవరం మార్గంలో సీఎం జగన్‌ మేమూ సిద్ధం యాత్ర చేయాల్సి ఉంది. కానీ సీఎంపై గులకరాయి దాడి జరిగిన తర్వాత షెడ్యూల్‌ మార్చారు. హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా ఏలూరు జిల్లాలోకి కాన్వాయ్‌ రూట్‌ను మళ్లించారు. దీంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హైవేలోనే జనం తిప్పలు పడక తప్పలేదు. సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు, ప్రైవేట్‌ వాహనాలకు మధ్య ముప్పావుగంట వ్యవధి ఉండేలా పోలీసులు జాగ్రత్తలు పడడంతో ప్రయాణికులు చుక్కలు చూశారు. దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. ఆఖరికి సర్వీసు రోడ్లలోనూ వాహనాలను వెళ్లనీయకుండా అత్యుత్సాహంతో నిలువరించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:42 AM