Share News

నా గెలుపుపై ప్రజల నమ్మకం

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:51 PM

‘టీడీపీ హయాంలో తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశాను. ఆ సమయంలో పట్టణాభివృద్ధికి ఎలా పనిచేశానో ప్రజలందరూ చూశారు.

నా గెలుపుపై ప్రజల నమ్మకం

మునిసిపల్‌ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం అభివృద్ధి చేశా.. ప్రజా సమస్యలపై ఐదేళ్లుగా పోరాటం

వైసీపీ హయాంలో అంతా అవినీతే : ఆంధ్రజ్యోతితో తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి

భీమవరం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి):

‘టీడీపీ హయాంలో తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశాను. ఆ సమయంలో పట్టణాభివృద్ధికి ఎలా పనిచేశానో ప్రజలందరూ చూశారు. పార్క్‌లు అభివృద్ధి చేశాం. బైపాస్‌ రోడ్లు పూర్తిచేశాం. ట్రాఫిక్‌ సమస్యను నివా రించాం. వర్షాలు పడితే హౌసింగ్‌ బోర్డు కాలనీ నీటిలోనే ఉండేది. ప్రధాన రహదారులు మూడు రోజులపాటు నీటిలో ఉండిపోయి దుర్భ ర పరిస్థితులు ఉండేవి. దీని నివారణకు ఎల్‌ఐసీ ఆఫీస్‌ నుం చి కడకట్ల వరకు, హౌసింగ్‌ బోర్డు నుంచి అజ్జరం డ్రెయిన్‌ వరకు డ్రెయిన్లు నిర్మించాం. ఫలితంగా ముంపు సమస్య తీరింది. ఇక గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులు టీడీపీ హయాంలోనే చేశాం. ఇలా నా పనితీరును చాలా ఏళ్ల క్రితమే నియోజకవర్గ ప్రజలు కళ్లారా చూశారు. నేను గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.. తాడేపల్లి గూడెం ఎన్‌డీఏ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్‌. ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించారు.

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు పునాది వేస్తే..

తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు మా హయాంలోనే ప్రణాళిక రూపొందించాం. ఇందుకు కడియపు చెరువును స్వాధీనం చేసుకున్నాం. చెరువు ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయిస్తే రూ.18 లక్షలు సొంత సొమ్ములు ఇచ్చి కేసులు ఉపసంహరించుకునేలా చేశాం. టెండర్లు పూర్తి చేయించి పనులు మొదలు పెట్టించాం. కాని, వైసీపీ వచ్చిన తర్వాత ఐదేళ్లు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను పట్టించుకోలేదు. మళ్లీ మేం అధికారంలోకి వచ్చిన తక్షణమే రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను పూర్తి చేయిస్తాం.

మంచినీటి సరఫరా అస్తవ్యస్తం

మా హయాంలో అమృత్‌ పథకం కింద పట్టణంలో కొత్త పైపు లైన్‌లు వేశాం. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లను నిర్మించాం. కాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలతో మంచినీటి సరఫరా అస్తవ్యస్తమైంది. గ్రామాలకు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా విజ్జేశ్వరం నుంచి పైప్‌లైన్‌ల ద్వారా నేరుగా మంచి నీరు అందించడానికి టీడీపీ హయాంలో చర్యలు తీసుకున్నాం. కాని, ఐదేళ్లు పూర్తయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం అధికారంలోకి రాగానే వీటిని పూర్తి చేసి తాగునీటి సమస్యను నివారిస్తాం.

ఏపీ నిట్‌ మా ఘనతే

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఏపీ నిట్‌ టీడీపీ హయాంలో తేగలిగాం. అప్పటి మంత్రి మాణిక్యాలరావు, నేను ఢిల్లీ వెళ్లి నిట్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ఐదేళ్లపాలన అరాచకం.. అవినీతి

తాడేపల్లిగూడెంలో భవనాలను నిర్మించాలంటే అధికార పార్టీ నాయకులకు కమీషన్‌లు ఇవ్వాలి. ఈ విధంగా నిర్మాణదారుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. టీడీఆర్‌ బాండ్ల మంజూరులోనూ కోట్లు గడించారు. అధికార పార్టీ అవినీతి వల్ల ఇళ్లు కట్టుకోవడాన్ని అంతా వాయిదాలు వేసుకున్నారు. మళ్లీ వైసీపీకి అధికారమిస్తే పట్టణంలోని మాస్టర్‌ ప్లాన్‌ రహదారులన్నీ విస్తరిస్తామంటూ కోట్లు విలువైన టీడీఆర్‌ బాండ్‌ల జారీకి ప్రణాళికలు వేసుకున్నారు.

జనంలో అసంతృప్తి.. వైసీపీకి ఓటమి

గడిచిన ఐదేళ్లుగా విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. ధరలు పెరిగాయి. వ్యాపారాలు తగ్గాయి. సామాన్యులు బతకడం కష్టంగా మారింది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రహదారుల అభివృద్ధికి పోరాటాలు చేశాం. అర్ధరాత్రి వేళ మా ఇంటికి పోలీసులు వచ్చి తనిఖీలు చేశారు. భయభ్రాంతులకు గురిచేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టీడీపీ పాదయాత్ర చేస్తే అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

కూటమి సంపూర్ణ సహకారం

తాడేపల్లిగూడెంలో టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు సంపూర్ణ సహకారం ఇస్తున్నారు. నా విజయం తథ్యం. ఇప్పుడు పోటీ మెజారిటీ కోసమే జరుగుతోంది.

Updated Date - Apr 28 , 2024 | 11:51 PM