Share News

ఇన్సూరెన్స్‌ సొమ్ములకు ఎసరు!

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:17 AM

ఓ ఉద్యోగి తాను కష్టపడి సంపాదించిన సొమ్ము ఓ ప్రభుత్వ సంస్థలో దాచుకొంటే ఆ సొమ్ములు గల్లంతవుతున్నాయి. తన జీతం నుంచి నెల నెలా మినహాయించి దాచిపెట్టుకొన్న సొమ్ములు ఎక్కడో పోయాయో తెలియక ఏమి చేయలేని పరిస్థితి నేడు ఉద్యోగులలో నెలకొంది.

   ఇన్సూరెన్స్‌ సొమ్ములకు ఎసరు!

ఏపీజీఎల్‌ఐ ఖాతాదారుల్లో ఆందోళన

ఉద్యోగుల జీతం నుంచి సొమ్ము మినహాయింపు

మిస్సింగ్స్‌ క్రెడిట్స్‌ 15 ఏళ్లకు పైనే..

ట్రెజరీ బిల్లులు మినహాయింపు..కానీ జమలేదు

రిటైర్డ్‌ ఉద్యోగులు సొమ్ముల కోసం రెండేళ్లుగా ఎదురు చూపులు

ఏపీజీఎల్‌ఐ రుణాల కోసం పడిగాపులు

ఉంగుటూరు మండలంలో పని చేస్తున్న ఒక ఉపాధ్యా యుడు 2008 డీఎస్సీ ద్వారా అపాయింట్‌ అయ్యారు. అతనికి 2011 నుంచి 2020 వరకు మిస్సింగ్‌ క్రెడిట్స్‌ వచ్చాయి. అంటే మినహాయించబడిన ప్రీమియం సొమ్ము వారి ఖాతాలో జమ కాలేదు. అతను 2013లో అంతర్‌ జిల్లా బదిలీలో ఈ జిల్లాకు వచ్చాడు. ఇప్పుడు పూర్వ జిల్లా నుంచి షెడ్యూల్స్‌ బిల్‌ నెంబర్స్‌ ఏ విధంగా తెచ్చుకోగలడు. మిస్సింగ్‌ క్రెడిట్స్‌ సొమ్ములు ఎక్కడకు పోయినట్టు.

2012 డీఎస్సీ ద్వారా ఎంపికై వీరవాసరం మండలంలో పని చేస్తున్న ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ తన సర్వీసులో ఇప్పటికే నాలుగు చోట్లకు బదిలీ అయ్యాడు. ఇప్పుడు మిస్సింగ్స్‌ క్రెడిట్స్‌ పేరుతో పంపిన నోటీసులో ఏకంగా ఏడు నెలల ప్రీమియం సొమ్ము జమకాలేదని పేర్కొన్నారు. ఇలా 12 ఏళ్ల తర్వాత ప్రీమియం సొమ్ములు కట్టలేదం టూ సెలవివ్వడం ఎంతవరకు న్యాయమని ఆ ఉద్యోగి ప్రశ్నిస్తున్నాడు.

నిడమర్రు ఏప్రిల్‌ 14 : ఓ ఉద్యోగి తాను కష్టపడి సంపాదించిన సొమ్ము ఓ ప్రభుత్వ సంస్థలో దాచుకొంటే ఆ సొమ్ములు గల్లంతవుతున్నాయి. తన జీతం నుంచి నెల నెలా మినహాయించి దాచిపెట్టుకొన్న సొమ్ములు ఎక్కడో పోయాయో తెలియక ఏమి చేయలేని పరిస్థితి నేడు ఉద్యోగులలో నెలకొంది. ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏపీజీ ఎల్‌ఐ) సంస్థలో పాలసీలు కడుతున్న ఉద్యోగుల ప్రీమియం సొమ్ములు జమ సంబంధిత డ్రాయింగ్‌ అఽథారిటీ ద్వారా మినహాయించబడుతూ ట్రెజరీ ద్వారా ఆ సంస్థకు నెలనెలా జమ చేయబడతాయి. కానీ నేడు ఏపీజీ ఎల్‌ఐ సంస్థలో ఉద్యోగుల సొమ్ములు ఖాతాల్లో జమకాలేదని 15 ఏళ్ల తర్వాత చావుకబురు చల్లగా చెప్పారు సంబంధిత శాఖ వారు. ఖాతాలో సొమ్ములు జమ కాకుంటే ఏటా ఆ వివరాలు చెప్పడం మానివేసి ఒక్కసారిగా 15 ఏళ్ల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జీవిత బీమా సంస్థ రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌ నిమిత్తం ప్రీమియం సొమ్మును కట్టించుకుని జీవిత బీమా పాలసీని అందజేసేవారు. ఉద్యోగి రిటైర్‌మెంట్‌ సమయంలో వారికి మొత్తం ఇన్సూరెన్స్‌ సొమ్మును అందజేసేవారు. కానీ నేడు ఈ సంస్థ ఉద్యోగులను నట్టేట ముంచింది. ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 70 నుంచి 80 వేల మంది ఉంటారు. వీరికి సంబం ధించి సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు ప్రీమియం సొమ్ము గల్లంతు అయ్యిందని ఉద్యోగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఆయా సంస్థలో పనిచేసే ఉద్యోగుల పొరపాటా లేక సొమ్ములు కాజేశారా..? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 డిసెంబరులో ఉద్యోగ విరమణ చేసిన ఓ విశ్రాంత ఉద్యోగికి తాను దాచుకొన్న జీవిత బీమా సొమ్ము చెల్లించడానికి ప్రభుత్వానికి సుమారు రెండేళ్లు పట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వీ సులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకమైన ఇబ్బందే ఎదుర్కొంటున్నారు. తమ ఆపత్కాలంలో అత్యవసర సమ యంలో లోన్‌ ద్వారా తమ ఖాతాలో సొమ్ము విత్‌డ్రా చేసు కొందామని దరఖాస్తు చేసుకుంటే 10 నుంచి 12 నెలలకు గాని మంజూరు కావడం లేదు.

మిస్సింగ్స్‌ క్రెడిట్స్‌ 15 ఏళ్లకు పైనే..

ఏపీజీఎల్‌ఐ యాజమాన్య లోపం వల్ల ఉద్యోగులకు సంబం ధించి గత 15 ఏళ్లుగా జమ కాని ప్రీమియం సొమ్ములను ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తోంది. 2009 నుంచి ట్రెజరీ బిల్లుల్లో మినహాయించినా ఈ ప్రీమియం సొమ్ములు అందలేని ఇప్పుడు తెలపడం ఏంటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

పేమెంట్స్‌ జమలేదెందుకు ?

ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఏటా తమ ఖాతాలను జమ చేయబడిన సొమ్ము, ఖర్చు అయిన సొమ్ములపై ఆడిట్‌ నిర్వహిస్తుంది. కానీ ఒక జీవిత బీమా సంస్థ అయి ఉండి ఉద్యోగుల ప్రీమియం సొమ్ముల చెల్లింపులో ఇంత అలసత్వం ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నాయి. ప్రతినెలా ట్రెజరీ ద్వారా వచ్చే ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను ఉద్యోగులకు వారి ఖాతాలో జమ చేయడంలో ఎందుకు అలసత్వమో అర్థం కావడం లేదు.

Updated Date - Apr 15 , 2024 | 12:17 AM