Share News

వారికైతే ఒకే..

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:46 AM

గంట్యాడ మండలం కొటారుబిల్లి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇటీవల అక్రమాలు బయట పడ్డాయి. మద్యం బాటిళ్ల మూతలపై వేసిన సీళ్లు తొలగించి నిల్వలను పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు సేల్స్‌మన్లను తొలగించారు.

వారికైతే ఒకే..
విజయనగరంలో ప్రభుత్వ వైన్‌మార్ట్‌లో ఖాళీ అయిన నిల్వలు

వారికైతే ఒకే..

అధికారపార్టీ నేత ఆదేశంతో నేటికీ మద్యం అక్రమ రవాణా!

సహకరిస్తున్న దుకాణాల సిబ్బంది

అప్పుడప్పుడు బెడిసికొట్టి పట్టుబడుతున్న వైనం

సీళ్లు తొలగించి పక్కదారి పట్టిస్తున్న లిక్కర్‌ సిండికేట్‌

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

- గంట్యాడ మండలం కొటారుబిల్లి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇటీవల అక్రమాలు బయట పడ్డాయి. మద్యం బాటిళ్ల మూతలపై వేసిన సీళ్లు తొలగించి నిల్వలను పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు సేల్స్‌మన్లను తొలగించారు.

- పూసపాటిరేగ మండలంలో ఇద్దరు సేల్స్‌మెన్లను అధికారులు తొలగించారు. వారు మద్యం నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారన్నది ఆరోపణ. ఆ మద్యం నిల్వలు బెల్టు షాపులకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరు సేల్స్‌మెన్లను విధుల నుంచి తొలగించారు.

మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందనడానికి ఈ రెండు ఉదాహరణలు మాత్రమే. ఎన్నికల్లో మద్యాన్ని ఓ ఆయుధంగా భావించిన అధికార పార్టీ నాయకులు దుకాణాల నుంచి చాకచక్యంగా తమ స్టాక్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. అందుకు దుకాణాల్లోని సిబ్బంది కమీషన్లకు కక్కుర్తి పడి సహకరిస్తున్నారు. నాయకుల సిఫార్సు మీదే ఉద్యోగాలు పొందిన కొందరు రుణం తీర్చుకోవడానికి వారు ఏం చెప్పినా అంగీకరిస్తున్నారు. కొన్నిసార్లు బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కాని, మద్దతుదారులు కాని ఫిర్యాదు ఇచ్చాకే ఎక్సైజ్‌ అధికారులు స్పందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏదైనాగాని కొన్నాళ్లుగా మద్యం నిల్వలను ప్రభుత్వ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందే పక్కదారి పట్టిస్తున్నారు. ఈ నిల్వల్లో కొన్ని బెల్టు షాపులకు వెళ్తున్నాయి.

ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించింది. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు జరిగిన స్థాయిలోనే ఇప్పుడూ సాగాలని, ఎక్కువ అమ్మకాలు చేయకూడదని ఆదేశించింది. అలాగే షాపులు తెరిచి ఉంచే సమయం కూడా కుదించింది. ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని చెప్పింది. వాస్తవంగా ఈ సమయానికి ముందే ఆయా దుకాణాల అమ్మకాల కోటా ముగుస్తోంది. ప్రత్యేక దారిలో మద్యం తరలుతుండడంతో నిబంధనలు మొక్కుబడిగా మిగిలాయి. మందుబాబులు చేసేదిలేక బెల్ట్‌షాపులను ఆశ్రయిస్తున్నారు. వారేమో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు.

సీళ్లు తొలగించి..

కొన్ని చోట్ల లభ్యం అవుతున్న మద్యం నిల్వలపై సీళ్లు ఉండడం లేదు. అంటే సీళ్లు తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి నిల్వలను తప్పుతోవ పట్టిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల దర్యాప్తుల్లో కూడా తేలింది. అంటే సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు తెలివిగా వ్యవహరించి నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారు. సీళ్లు తొలగిస్తే దానిపై ఉండే స్కానింగ్‌ కోడ్‌ నెంబరు, బ్యాచ్‌ నెంబరు వంటివి పోతాయి. దీని వల్ల పట్టబడుతున్న నిల్వలు ఏ షాపునుంచి తరలిందీ గుర్తించడం కష్టం.

ముందు నుంచే మద్యం వ్యూహం

గతేడాది డిసెంబరు 26 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 19వరకు అంటే సుమారు నాలుగు నెలల్లో ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారు నాయకుల అడుగుజాడల్లోనే నడిచారు. ఎన్నికలకు చాలా ముందు నుంచే నాయకులు మద్యం వ్యూహం అమలు చేశారు. ఈ తంతులో సిబ్బంది పావులుగా మిగిలారు. ఈ వ్యవధిలో ముగ్గురు సూపర్‌వైజర్లు, 10మంది సేల్స్‌ మెన్లు తొలగింపునకు గురయ్యారు.

Updated Date - Apr 29 , 2024 | 12:46 AM