Share News

నాడు శ్రీకాకుళం... నేడు విజయనగరం..

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:36 PM

రాజాం.. ప్రపంచ పారిశ్రామిక చిత్రపటంలో సుస్థిరస్థానం.. చారిత్రకంగా పౌరుషానికి మారుపేరైన బొబ్బిలి రాజుల ప్రతినిధి తాండ్ర పాపారాయుడు నడయాడిన నేల.. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు ఉన్న నగరం.. రాజకీయంగా ఉద్దండపిండాల నిలయం.

నాడు శ్రీకాకుళం... నేడు విజయనగరం..
రాజాం నియోజవర్గం మ్యాప్‌

- మారిన రాజాం

- కొత్త జిల్లాలో తొలి ఎన్నికలు

- ఏడు దశాబ్దాల అనుబంధానికి చెల్లుచీటీ

రాజాం రూరల్‌ : రాజాం.. ప్రపంచ పారిశ్రామిక చిత్రపటంలో సుస్థిరస్థానం.. చారిత్రకంగా పౌరుషానికి మారుపేరైన బొబ్బిలి రాజుల ప్రతినిధి తాండ్ర పాపారాయుడు నడయాడిన నేల.. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు ఉన్న నగరం.. రాజకీయంగా ఉద్దండపిండాల నిలయం. ఏడు దశాబ్దాల పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మమేకమైన పట్టణం. తొలినాళ్లలో పేరుకు ఉణుకూరు నియోజకవర్గమైనా రాజకీయాలకు గుండెకాయ వంటి స్థలం. అనూహ్యంగా రెండేళ్ల క్రితం హద్దులు... సరిహద్దులు మార్చుకుని శ్రీకాకుళంతో అనుబంధానికి చెల్లుచీటీ ఇచ్చి... విజయనగరం జిల్లాతో కొత్త బంధం ఏర్పరచుకున్న కేంద్రం.. వచ్చేనెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా కొత్త జిల్లాలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న నాయకులు, ప్రజలకు కేంద్ర బిందువైన నియోజకవర్గం.

ఏడు దశాబ్దాల క్రితం

1950 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఎన్నికలు జరిగినప్పుడల్లా రాజాంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉణుకూరు నియోకవర్గం నుంచి పాలవలస సంగంనాయుడు, ఆయన భార్య పాలవలస రుక్మిణమ్మ, వారి కుమారుడు పాలవలస రాజశేఖరం, కిమిడి కళా వెంకటరావు, కిమిడి గణపతిరావు వంటి నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘన చరిత ఉంది. పేరుకు ఉణుకూరు అయినా రాజకీయ వేదిక రాజాంగానే చెప్పక తప్పదు. తొలిరోజుల నుంచి బీసీలకు కేటాయించిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీలకు కేటాయించారు. దీంతో తొలిసారిగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి రాజాం వలస వచ్చిన కోండ్రు మురళీమోహన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా, అక్కడి నుంచే వలస వచ్చిన

సీనియర్‌ నేత, ఫైర్‌బ్రాండ్‌ కావలి ప్రతిభాభారతి తెలుగుదేశం తరపున ఎన్నికలలో తలపడ్డారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజాంలో కోండ్రు మురళీమోహన్‌ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి... ఆపై వైఎస్సార్‌ సీపీలోకి చేరిన కంబాల జోగులు 2014, 19 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల తరువాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు, ఆరోగ్యం దృష్ట్యా ప్రతిభాభారతి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. కోండ్రు మురళీమోహన్‌ ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం

సరిగ్గా రెండేళ్ల క్రితం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మూడు ముక్కలైంది. 2022 ఏప్రిల్‌ 4న రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో, పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో చేరాయి. మిగిలిన నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లాలో ఉండిపోయాయి. ఫలితంగా సరిహద్దులు మారాయి. రాజకీయంగా జిల్లా ప్రజలతో ఉన్న అనుబంధానికి తెరపడింది. తొలిసారిగా విజయనగరం జిల్లాలో ఎన్నికలకు ఇక్కడి ప్రజలు సిద్ధపడుతున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని పట్టణానికి చెందిన ఓ వైద్యుడు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

నియోజకవర్గంలో..

నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 284 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 2,25,336 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,13,441 మంది పురుషులు కాగా... 1,11,876 మంది మహిళలు.

.......................................................

మండలం పోలింగ్‌ కేంద్రాలు పురుషులు మహిళలు థర్డ్‌జెండర్‌ మొత్తం

................................................

రాజాం 82 38795 38564 12 77371

వంగర 50 17369 17456 2 35097

రేగిడి 75 28537 27701 2 56240

సంతకవిటి 77 28470 28155 3 56628

..............................................................................

284 113441 111876 19 225336.

................................................................................

Updated Date - Apr 28 , 2024 | 11:36 PM