Share News

ఐదేళ్లూ వేతన యాతనే..

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:44 AM

ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్‌ గాలికివదిలేశారు. సకాలంలో వేతనాలు అందక.. సమగ్రమైన పీఆర్సీకి నోచుకోక... మెడికల్‌, ఇతర బిల్లులూ దక్కక వారు తీవ్ర నిరాశతో నెట్టుకొచ్చారు. ఉద్యోగ సంఘం నేతలు తమ సమస్యలపై సీఎం కలిసి విన్నవించుకుందామన్నా దర్శనం దొరికేది కాదు. 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన ఆయన అధికారంలోకి వచ్చాక దగ్గరకు రానివ్వలేదు. ఈ ఐదేళ్లూ ఉద్యోగవర్గాలు ఉద్యమాలతోనే నెట్టుకువచ్చాయి. కలెక్టరేట్‌ నిత్యం నిరసనలతో అట్టుడుకేది. విజయనగరం ఆందోళనకారులతో నిండిపోయేది.

ఐదేళ్లూ వేతన యాతనే..
కలెక్టరేట్‌ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన(ఫైల్‌)

ఐదేళ్లూ వేతన యాతనే..

జీతం కోసం ప్రతినెలా రోడ్డెక్కిన ఉద్యోగులు

పీఆర్సీ అమలు కోసమూ ఉద్యమం

రావాల్సిన బిల్లులూ అందక అవస్థలు

కలెక్టరేట్‌ వద్ద నిత్యం నిరసన శిబిరాలు

ఇప్పటి మెనిఫేస్టోలోనూ మభ్యపెట్టేయత్నం

ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్‌ గాలికివదిలేశారు. సకాలంలో వేతనాలు అందక.. సమగ్రమైన పీఆర్సీకి నోచుకోక... మెడికల్‌, ఇతర బిల్లులూ దక్కక వారు తీవ్ర నిరాశతో నెట్టుకొచ్చారు. ఉద్యోగ సంఘం నేతలు తమ సమస్యలపై సీఎం కలిసి విన్నవించుకుందామన్నా దర్శనం దొరికేది కాదు. 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన ఆయన అధికారంలోకి వచ్చాక దగ్గరకు రానివ్వలేదు. ఈ ఐదేళ్లూ ఉద్యోగవర్గాలు ఉద్యమాలతోనే నెట్టుకువచ్చాయి. కలెక్టరేట్‌ నిత్యం నిరసనలతో అట్టుడుకేది. విజయనగరం ఆందోళనకారులతో నిండిపోయేది.

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28:

వైసీపీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా సకాలంలో వేతనం పొందిన పరిస్థితి లేదు. పదో తేదీ వచ్చినా జీతం పడుతుందో లేదోనన్న దిగులుతోనే కనిపించేవారు. జీతాలు ఇప్పించండి మహాప్రభో అంటూ ఉద్యోగులు అనేకసార్లు ఆందోళనలు చేశారు. ప్రతి నెలా ‘ ప్రభుత్వానికి అప్పు పుట్టిందా.. ఈ నెల మనకు జీతం అందుతుందా’’ అంటూ ఉద్యోగులు సామాజిక మాద్యమాల్లో చర్చలు పెట్టిన దుస్థితి ప్రతినెలా కొనసాగింది. పింఛన్ల పరిస్థితి వర్ణనాతీతం. మందులు కొనుక్కోవడానికి పండుటాకులు అల్లాడిపోయేవారు. జీతాలు ఇప్పించేందుకు చట్టం చేయాలంటూ ఉద్యోగుల సంఘం ఏకంగా గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చింది. ఇలాంటి దుస్థితి ఏ ప్రభుత్వ హయాంలోనూ రాలేదు. ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు పెండింగ్‌ పెట్టేవారు. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్‌ మొత్తాన్ని ప్రాన్‌ఖాతాకు జమ చేసేవారు కాదు. ఇలా అనేక బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఆఖరుకు రిటైర్‌ అయిన ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను కూడా పూర్తిగా అందించే పరిస్థితి లేదు.

- జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎక్కువ ఉంది ఉపాధ్యాయులే. వీరికి ప్రతి నెల జీతం అందకపోవడంతో పాటు ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్‌, సరెండర్‌ లీవులు వంటి ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పెన్షనర్లు కూడా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్‌ డబ్బులు అందకపోవడంతో మండల, కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు.

- సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. సాంఘిక సంక్షేమ గురుకులల్లో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా, డీ అడిక్షన్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్ర్టాక్టు ఉద్యోగులు కూడా చాలా మంది జీతాలు సకాలంలో రాక ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ, మున్సిపల్‌ కార్మికులదీ అదే దుస్థితి.

- ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిపించడం.. ఏమీ తేల్చకుండా పంపించేయడం జరిగేది.

- పీఆర్సీ అమలులో జగన్‌ సర్కారు చేసిన అన్యాయంపై 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు నిర్వహించిన గర్జన ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని సదుపాయాలు కల్పించి ఉద్యమాన్ని అణచివేసే ఎత్తుగడకు దిగింది. ఉద్యోగుల సంఘాన్ని వేరు చేయాలని నిర్ణయించి విభజించు.. పాలించు సూత్రాన్ని అమలు చేసింది.

- 2019 ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామన్న హామీతో వారిలో ఆశలు కల్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకును చూపి కొద్దిమందినే క్రమబద్ధీకరించారు. అది కూడా ఎన్నికల ముందు చేశారు.

- వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూసిన ఉద్యోగులు, పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు ఎటువంటి మేలు చేయకపోయినా ఏదేదో చేశామని చెప్పుకోవడం సరికాదంటున్నారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులూ నిరసన బాట పట్టారు. విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యూలర్‌ చేయకపో వడంతో వారు కూడా ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం జరగలేదు

ఈ ఐదేళ్లలో ఉద్యోగులు, పెన్షర్లకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఏ ప్రభుత్వం ఇటువంటి నిరంకుశ విధానాలు అవలంభించలేదు. సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆఖరుకు జీపీఎస్‌ విధానం తెచ్చారు. ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగులు,పెన్షనర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఓ రిటైర్డ్‌ తహసీల్దార్‌ వేదన

రెగ్యులర్‌ చేయలేదు

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయలేదు. గత ఎన్నికల ప్రచారంలో రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించారు అమలు కాలేదు. జిల్లా వ్యాప్తంగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ న్యాయం జరగలేదు. సమగ్రశిక్షలో పని చేస్తున్న ఉద్యోగులు సుమారు నెల రోజుల పాటు ఆందోళన చేసినా పట్టించుకోలేదు.

ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి నిరాశ

సరైన హామీ లేదు

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా ఉద్యోగాల భర్తీ గురించి లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు నోటిఫికేషన్‌ ఇచ్చారు. గ్రూప్స్‌ పోస్టులూ అంతే. జిల్లాలోని నిరుద్యోగులంతా నిరాశలో ఉన్నారు.

ఓ నిరుద్యోగి ఆవేదన

Updated Date - Apr 29 , 2024 | 12:44 AM