Share News

రాజకీయ కట్టప్పలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:43 PM

ఎన్నికల వేళ నేతలకు సరికొత్త చిక్కు వచ్చిపడింది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు సొంతవారయ్యారు. ఇలా జోరుగా గోడ దూకుడుల పర్వం కొనసాగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా నేతలకు ఇప్పుడు కోవర్ట్‌ల భయం పట్టుకుంది.

రాజకీయ కట్టప్పలు

- అభ్యర్థుల్లో గబులు

- ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి

(కొమరాడ)

ఎన్నికల వేళ నేతలకు సరికొత్త చిక్కు వచ్చిపడింది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు సొంతవారయ్యారు. ఇలా జోరుగా గోడ దూకుడుల పర్వం కొనసాగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా నేతలకు ఇప్పుడు కోవర్ట్‌ల భయం పట్టుకుంది. స్వపక్షంలోనే ఉండి పనిచేసే కన్నా ప్రత్యర్థి వర్గంలోకి చేరి వారి అనుపానులను చేరవేయడం ఓ రాజకీయం. స్వపక్షంలోనే కొనసాగుతూ వారి వ్యూహాలను ప్రత్యర్థి పార్టీకి చేరవేయడం మరో కోవర్టు కళ. రాజకీయ పార్టీల గెలుపు ఎత్తుల్లో ఇది కూడా ఓ వ్యూహమే. పార్టీలోకి వచ్చే వారిని కాదనలేరు. అలా అని అందరినీ కోవర్టులుగా చూడలేరు. కానీ ఒకరిద్దరు మాత్రం ఈ తరహా వ్యక్తులు కచ్చితంగా ఉంటారని నేతలే నమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఆ కోవర్టులను ఎలా పసిగట్టడం అనేది మాత్రమే. ముల్లుకు ముల్లు విరుగుడే అన్న చందాన ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యర్థుల శిబిరాల్లో కోవర్టులను ఇప్పటికే మోహరించాయి. వీరి ద్వారానే తమ దగ్గర ఉన్న కోరవర్టుల పేర్లు తెలుసుకునే సరికి అవాక్కవడం వారి వంతవుతోంది. ఫలానా వ్యక్తి కోవర్టు అని తెలిసినా బహిరంగంగా అది వెలిబుచ్చలేని వింత పరిస్థితి నేతలది. ఎందుకంటే ఇది ఎన్నికల వేళ కనుక ప్రతి ఓటు, ప్రతినేత విలువైన వారే. దీంతో వారిని పార్టీలోనే ఉంచుతూ... వారి విషయంలో జాగ్రత్త వహిస్తూ ఎన్నికల కార్యం జరిపించుకోవడమే ప్రస్తుతం నేతల ముందు ఉన్న తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నారు.

నేతల్లో టెన్షన్‌

రాజకీయం అంటేనే ఎదుటి వారి బలాలు, బలహీనతలు తెలుసుకుని వాటికి అనుగుణంగా గెలుపు వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. కానీ నిన్న మొన్నటి వరకు తమ వెంట తిరిగిన వారు ఇప్పుడు ఆవలి పక్షాన కనబడుతుండే సరికి వారిలో టెన్షన్‌ కనబడుతోంది. వారి లోగట్టులన్నీ ఆ నేతలకు తెలిసి ఉండడమే అందుకు కారణం. తన అంతరంగీకులుగా మెలిగే ఒకరిద్దరు నేతల వద్ద మాత్రమే ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన వివరాలు పంచుకుంటున్నారు. గోడలకు చెవులు ఉండొచ్చు అనే చందాన అత్యంత రహస్యంగా ఎన్నికల ప్రణాళికలకు పదును పెడుతూ కోవర్టు రాజకీయాలకు చెక్‌ పెట్టాలనే తలంపుతో నేతలు ఉన్నారు.

కోవర్టులు రకరకాలు

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు వివిధ రకాలుగా కోవర్ట్‌ ఆపరేషన్‌ చేపడుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రత్యర్థి శిబిరంలోనే ఉంచి దెబ్బతీయడం. ఇటీవల ఓ అభ్యర్థి వద్దకు ద్వితీయ శ్రేణి నేత ఒకరు తాను ప్రస్తుతం ఉన్న పార్టీని వదిలేసి మీ గూటికి వస్తానని వర్తమానం పంపారు. ఆ అభ్యర్థి మాత్రం పార్టీ మారేకంటే అక్కడే ఉండి వారి పథక రచనలన్నీ తనకు చేరవేయాలని... ఇదే తనకు చేసే మేలు అని చెప్పారు. అంతే అటు పార్టీ మారినట్లయింది. ఇటు కోవర్ట్‌ ఆపరేషన్‌ మొదలయ్యింది. ఆవల శిబిరంలోకి వెళ్లి వారి నేతలు, కార్యకర్తలతో మమేకమైపోయి... వారి వ్యవహారాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా తన సొంత శిబిరం నేతలకు చేర్చడం ఇదో రకం కోవర్టు వ్యవహారం. వీరు తటస్థంగా ఉన్నట్లు కలరింగ్‌ ఇస్తూ ఏదో ఒక పక్షానికి లోపాయికారిగా పనిచేస్తారు. పోలీసులు నేరుగా డబ్బు ఉన్న చోటుకు వెళి కొన్ని సందర్భాల్లో దాడులు చేస్తుంటారు. ఇదంతా ఈ తటస్థ కోవర్టుల పుణ్యమే. ఇలా కోవర్టులందు రకాలు వేరయా అన్న చందాన వీరితో పెను ప్రమాదం కూడా అభ్యర్థులకు పొంచి ఉందండోయ్‌.

భలే అవకాశవాదం

కోవర్ట్‌లకు మరో అవకాశం కూడా ఉంది. ప్రత్యర్థి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసినా.. సొంత పార్టీ గెలిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఈ విజయం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుని ఎంచక్కా ఆ నేత నీడలోనే ఉండొచ్చు. ఇలా కాకుండా ఎవరికోసమైతే కోవర్టు అవతారమెత్తారో వారే గెలిస్తే దర్జాగా మళ్లీ వారి దగ్గరకు వెళ్లిపోయి అక్కడా గెలుపు క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునే ఉభయకుశలోపరి సౌలభ్యం కోవర్టులకు మాత్రమే ఉంది.

అందరూ మంచివారే.. కానీ

అధికార పార్టీ మీద అసంతృప్తితో పాటు ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగానో, పార్టీల ఏకపక్ష ధోరణి నచ్చకనో పార్టీలు మారడం సహజం. ఇలా మారే వారిలో చాలామంది నిజంగా నిండు మనసుతో పార్టీ మారేవారే. కానీ ఒకరిద్దరు మాత్రం కోవర్టు రాజకీయం చేస్తుంటారు. ఈ మొత్తంలో వారిని పసిగట్టడమే పార్టీలకు పెద్ద పరీక్ష. ఒక్కోసారి నిబద్ధత కలిగిన నేతను విస్మరించి... కోవర్టుకే పెద్ద పీట వేసే నేతాగణానికీ కొదవలేదు. అందుకే నేతలూ కోవర్టులతో బహుపరాక్‌..

Updated Date - Apr 29 , 2024 | 11:43 PM