Share News

ప్రిసైడింగ్‌ అధికారులదే బాధ్యత

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:32 AM

పోలింగ్‌ రోజు ప్రిసైడింగ్‌ అధికారులదే పూర్తి బాధ్యత అని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో కల్పనాకుమారి తెలిపారు.

ప్రిసైడింగ్‌ అధికారులదే బాధ్యత
స్ర్టాంగ్‌ రూంను పరిశీలిస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విష్ణుచరణ్‌

సీతంపేట: పోలింగ్‌ రోజు ప్రిసైడింగ్‌ అధికారులదే పూర్తి బాధ్యత అని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో కల్పనాకుమారి తెలిపారు. ఐటీడీఏ ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ఇస్తున్న శిక్షణ తరగతులను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోలింగ్‌ రోజు పీవో, ఏపీవోలు చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో ప్రతి అంశాన్ని తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్‌ రోజు నివేదికలు ఇచ్చే ఫారాలు, ఈవీఎంల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని, నిర్దిష్ట సమయానికి పోలింగ్‌ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, మాస్టర్‌ ట్రైనీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్ర్టాంగ్‌ రూం పరిశీలన

సాలూరు,ఏప్రిల్‌ 15: సాలూరు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూంను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌ సోమవారం పరిశీలించారు. అనంతరం ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసై డింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల విధులు, ఇతరత్రా అంశాలపై చర్చించారు. తహసీల్దార్‌ సింహాచలం తదితరులు ఉన్నారు.

బాలలను వినియోగిస్తే చర్యలు

పార్వతీపురం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 18 ఏళ్లలోపు బాలలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించరాదని కార్మికశాఖ సహాయ కమిషనర్‌ కె.రామకృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో, ప్రచార పనులకు రాజకీయ పార్టీల వారు బాలలను వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ప్రకారం ఆరు నెలల పాటు జైలు శిక్ష, రూ.50 వేలు వరకు జరిమానా ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:32 AM