Share News

అది రాజకీయ రణక్షేత్రం

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:34 PM

బొబ్బిలి పేరు చెబితే రాజరికం...అప్పటి ఎత్తులు...పైఎత్తులు...యుద్ధాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అదే నియోజకవర్గంలో భాగమైన తెర్లాం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రం. తెర్లాం నియోజకవర్గం పేరు చెబితే రాజకీయ రణరంగం గుర్తుకు వస్తుంది. అక్కడ రెండు కుటుంబాల ప్రాబల్యం కనిపించేది. నిత్యం రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొనేది.

అది రాజకీయ రణక్షేత్రం

- ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకు వాలేది కాదు

- రాజకీయ పార్టీల ప్రాబల్యం నామమాత్రమే

- తెంటు-వాసిరెడ్డి మాటే వేదవాక్కు

- ఇదీ నాటి తెర్లాం నియోజకవర్గంలో పరిస్థితి

బొబ్బిలి పేరు చెబితే రాజరికం...అప్పటి ఎత్తులు...పైఎత్తులు...యుద్ధాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అదే నియోజకవర్గంలో భాగమైన తెర్లాం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రం. తెర్లాం నియోజకవర్గం పేరు చెబితే రాజకీయ రణరంగం గుర్తుకు వస్తుంది. అక్కడ రెండు కుటుంబాల ప్రాబల్యం కనిపించేది. నిత్యం రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొనేది.

(బొబ్బిలి)

‘ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలినా సహించలేని రీతిలో అక్కడ రాజకీయం సాగేది. ఒకే రక్తం పంచుకుని పుట్టిన సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు సైతం ఆ గ్రామాలలో చెరో పక్క ఉంటే... వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. 1978 నుంచి 2008 వరకు రాష్ట్ర స్థాయిలో ఓ ప్రత్యేకమైన ఉనికిని చాటుకున్న ఒకప్పటి తెర్లాం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఇది. ఒళ్లు గగుర్పాటు కలిగించే విధంగా అక్కడ రాజకీయ పరిస్థితులు ఉండేవి. ఆ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల ప్రాబల్యం అంతంత మాత్రమే. తెంటు-వాసిరెడ్డి కుటుంబాల హవాయే సాగేది. వారికి చురకత్తుల్లాంటి వీరాభిమానులు ఉండేవారు. తమ అధినేత ఏది చెబితే అది అక్షరాలా చేసి చూపించేవారు. నాయకుల మాట వేదవాక్కుగా భావించి ఒక్కోసారి రక్తసంబంధాలను కూడా వదులుకునేవారు. సమారు మూడు దశాబ్దాల పాటు మనుగడ సాగించిన తెర్లాం నియోజకవర్గంలో తెంటు-వాసిరెడ్డి కుటుంబాల వారు చిరకాల ప్రత్యర్థులు. వాసిరెడ్డి వరదారామారావుపై తెంటు జయప్రకాశ్‌ తెలుగుదేశం తరపున పోటీ చేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక్కసారి మాత్రమే జయప్రకాశ్‌ ఓటమి చెందారు.

-తెంటు జయప్రకాశ్‌ తండ్రి లక్ష్మునాయుడు 1978లో జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయనపై ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరపున (ఆవు-దూడ గుర్తుపై) పోటీ చేసిన వాసిరెడ్డి వరదరామారావు అప్పట్లో గెలుపొందారు. తెర్లాం నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసిరెడ్డి... ఆ తరువాత వరుసగా జయప్రకాశ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. 1999లో వాసిరెడ్డి ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా తెంటు జయప్రకాశ్‌పై పోటీ చేసి గెలుపొందారు.

- 2004లో మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన జయప్రకాశ్‌ అనారోగ్యంతో 2006లో కన్నుమూశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో జయప్రకాశ్‌ తనయుడు లక్ష్మునాయుడు (రాజా) తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో వాసిరెడ్డి పోటీ చేయకుండా ఉండిపోయారు. లోకసత్తా తరఫున రెడ్డి లక్ష్మునాయుడు, ఇండిపెండెంట్లుగా గుడివాడ మహేశ్‌, ఏగోటి సింహాచలం ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజాకు 74.39 శాతం ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గానికి అవే ఆఖరి ఎన్నికలు కావడం గమనార్హం.

- తెంటు-వాసిరెడ్డిలకు ఎన్నికల్లో ఊరూరా అభిమాన గణం బ్రహ్మరథం పట్టేవారు. ప్రతీ గ్రామంలోనూ వీరిద్దరికీ కరెన్సీ నోట్ల దండలను మెడలో వేసి విరాళాలుగా సమర్పించేవారు. కొన్ని సందర్భాలలో అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు పెద్దగా అయ్యేది కాదు.

- వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పలువురి కేబినెట్‌లలో కీలక మంత్రిగా పనిచేసి బొబ్బిలి ప్రాంతానికి కావల్సిన అనేక ఇరిగేషన్‌, విద్యుత్‌ ప్రాజెక్టులను మంజూరు చేయించారు. బొబ్బిలి నుంచి 1983లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేశారు. ఎన్టీఆర్‌ ప్రభంజనంలో పరాజయం పొందారు. ఆయన తనయుడు వాసిరెడ్డి వరదారామారావు తెర్లాం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, డీసీసీబీ చైర్మన్‌గా, ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌గా పదవులు నిర్వహించారు.

- వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు-తెంటు లక్ష్మునాయుడు సీనియర్‌లు మంచి మిత్రులుగా ఉండేవారు. బంధుత్వం నెరిపేవారు. ఆ తరువాత కాలంలో రాజకీయంగా ఆ రెండు కుటుంబాలు బద్ధశత్రువులుగా మారిపోయాయి. తెంటు లక్ష్మునాయుడు కుమారుడు జయప్రకాశ్‌, మనవడు లక్ష్మునాయుడు (రాజా)లు వాసిరెడ్డి ప్రత్యర్థులుగా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు మూడోతరం యువకులు ఈ రెండు కుటుంబాలలో ఉన్నారు. నాటి కక్షలు, పగలు లేకపోయినప్పటికీ రాజకీయంగా చెరో పార్టీలో కొనసాగుతున్నారు. జయప్రకాశ్‌ తనయుడు లక్ష్మునాయుడు(రాజా) ఉప ఎన్నికల్లో ఒక విడత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత బొబ్బిలిలో విలీనం కావడంతో ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగరావు చేతిలో ఓటమి చెందారు. 2014లో టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత లక్ష్మునాయుడు కొత్తగా ఏర్పాటైన బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) చైర్మన్‌గా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోనికి రావడంతో తెంటు ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు వీరే..

-1978లో నూతనంగా ఏర్పాటైన తెర్లాం నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా వాసిరెడ్డి వరదారామారావు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఆవు-దూడ గుర్తుపై గెలుపొందారు. సీనియర్‌ తెంటు లక్ష్మునాయుడు అప్పట్లో జనతా పార్టీ తరపున పోటీ చేశారు.

-1983, 1985, 1989, 1994, 2004: తెంటు జయప్రకాశ్‌ (తెలుగుదేశం పార్టీ)

-1999లో వాసిరెడ్డి వరదారామారావు ( కాంగ్రెస్‌-ఐ)

-2008 తెర్లాం ఉప ఎన్నికల్లో తెంటు లక్ష్మునాయుడు (రాజా) గెలుపు

-2014 ఎన్నికల నుంచి తెర్లాం అసెంబ్లీ కనుమరుగై బొబ్బిలి అసెంబ్లీలో కలిసిపోయింది.

Updated Date - Apr 28 , 2024 | 11:34 PM