Share News

నిజాలు చెప్పడమే తప్పా?

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:09 PM

జిల్లాలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలకు నోచుకోలేదనేది కాదనలేని వాస్తవం. తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఇంటర్నెట్‌ వసతులకు దూరంగానే ఉన్నాయి. అయితే ఆయా స్కూళ్లలో వాస్తవ పరిస్థితులను సంబంధిత ఉపాధ్యాయులు ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థలో నమోదు చేయడమే ఇప్పుడు తప్పుగా మారింది. ఈ మేరకు 537 ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల షోకాజ్‌ నోటీసులిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

 నిజాలు చెప్పడమే తప్పా?
ఇంటర్నెట్‌, మరుగుదొడ్ల సదుపాయం లేని సాంబన్నవలస పాఠశాల

తాగునీరు, మరగుదొడ్లు, ఇంటర్నెట్‌ సదుపాయాలకు దూరం

ఆ విషయాలను ధ్రువీకరించిన టీచర్లకు నోటీసుల జారీ

ప్రభుత్వంపై ఉపాధ్యాయల సంఘాల ఆగ్రహం

ఇదంతా వేధింపుల్లో భాగమేనని మండిపాటు

పార్వతీపురం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘నాడు-నేడుతో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేశాం.. అన్ని వసతులు కల్పించాం’ అని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలకు నోచుకోలేదనేది కాదనలేని వాస్తవం. తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఇంటర్నెట్‌ వసతులకు దూరంగానే ఉన్నాయి. అయితే ఆయా స్కూళ్లలో వాస్తవ పరిస్థితులను సంబంధిత ఉపాధ్యాయులు ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థలో నమోదు చేయడమే ఇప్పుడు తప్పుగా మారింది. ఈ మేరకు 537 ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల షోకాజ్‌ నోటీసులిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవాలను చెప్పడమే తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో లేని మౌలిక సదుపాయాలను ఉన్నట్టుగా ఎలా నమోదు చేయగలమని పలువురు ఉపాధ్యాయులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైమనా సర్కారు ఇలా తమను వేధింపులకు గురి చేయడం తగదని వారు వాపోతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో పలువురు ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘మన్యం’లో పలు సర్కారీ స్కూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని పూర్తిస్థాయిలో తరగతి గదులు లేని పాఠశాలలు 32 వరకు ఉన్నాయి. అదే విధంగా విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లు లేని స్కూళ్లు 121 ఉన్నాయి. తాగునీటి సదుపాయం లేని పాఠశాలలు 53 , విద్యుత్‌ సదుపాయం లేని బడులు 56, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని పాఠశాలలు 336 ఉన్నాయి. ఈ విధంగా జిల్లాలో 598 పాఠశాలలు ఉన్నాయి. దీంతో ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు వాస్తవ పరిస్థితులను ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థలో పొందుపరిచారు. దీంతో వారికి విద్యాశాఖ షోకాజ్‌ నోటీసులు అందించింది.

కొన్ని పాఠశాలల్లో ఇలా..

- పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలంలో జనార్థనపురం పాఠశాలలో పూర్తిస్థాయిలో తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. మొరగాడం ఎంపీపీఎస్‌ పాఠశాలలో ఇంటర్నెట్‌తో పాటు మరుగుదొడ్లు లేవు. సీతానగరం మండలంలో అప్పయ్యపేట, కృష్ణరాజపురం తదితర ఏడు ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. పార్వతీపురం మండలంలో కొన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

- పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలో బూర్జగూడలోని జీపీఎస్‌ పాఠశాలలో మరుగుదొడ్లు, సమరపాడు జీపీఎస్‌ పాఠశాలలో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. పాలకొండ మండలం ఎస్‌.డోలమడ, ఎం.సింగుపురం తదితర ఎంపీపీఎస్‌ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు.

- కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడు జీపీఎస్‌ పాఠశాలలో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. వండడి జీపీఎస్‌ పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. చిన్న వంకధార జీపీఎస్‌ పాఠశాలలో తాగునీరు సదుపాయం లేదు. కురుపాం మండలం డీఎల్‌ పురం, జరడ జీపీఎస్‌ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లోని వివిధ పాఠశాలలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు.

- సాలూరు మండలం డిప్పలపాడు గిరిజన విద్యాశాఖ పరిధిలో ఉన్న జీపీఎస్‌ పాఠశాలలో పూర్తిస్థాయిలో తరగతి గదులు లేవు. సాలూరు కేజీబీవీలో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాల పరిధిలోని పలు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 537 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి.. వాస్తవ పరిస్థితులను ఉపాధ్యాయులు ధ్రువీకరించడంపై సర్కారు తీవ్ర అవమానంగా భావించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారుల ద్వారా జిల్లాలో పలువురు టీచర్లకు నోటీసులు ఇప్పించింది. అయితే పాఠశాలల్లో లేని సదుపాయాలు ఉన్నట్టుగా ఉపాధ్యాయులు ఎలా ధ్రువీకరించగలరని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన నిధుల కోసం వైసీపీ ప్రభుత్వం ఇలా.. టీచర్లను వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే వారికి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.

నోటీసులివ్వడం దారుణం

జిల్లాలోని 537 పాఠశాలలకు సంబంధించి కొన్నింటిలో ఇంటర్నెట్‌, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు లేకపోవడం వాస్తవం. అయితే ఆయా స్కూళ్లలో ఉన్న పరిస్థితిని .. ఉన్నది ఉన్నట్టుగా ఉపాధ్యాయులు ధ్రువీకరిస్తే అదేదో తప్పు చేసినట్టుగా వారికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం దారుణం. దీనిని యూటీఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తోంది. టీచర్లకు ఇచ్చిన నోటీసులను వెంటనే విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలి.

- ఎస్‌.మురళీమోహన్‌రావు, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు, పార్వతీపురం

Updated Date - Apr 28 , 2024 | 11:09 PM