Share News

ఓ అధికారికి కాసులే కాసులు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:47 AM

ఎన్నికల్లో మద్యం వినియోగం తగ్గించాలన్న ఆలోచనతో ఇండెంట్‌ పెట్టే అవకాశం షాపులకు లేకుండా ఈసీ నియంత్రించింది. ఉన్నతాధికారులే ఏఏ బ్రాండ్ల మద్యం.. ఎంతెంత అవసరమో గుర్తించాలని చెప్పింది. ఈ ఆదేశం జిల్లాలోని ఓ ఎక్సైజ్‌ అధికారికి కాసులు తెచ్చిపెడుతోంది.

ఓ అధికారికి కాసులే కాసులు

ఓ అధికారికి కాసులే కాసులు

మద్యం సిండికేట్‌తో మిలాఖత్‌

విజయనగరం (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో మద్యం వినియోగం తగ్గించాలన్న ఆలోచనతో ఇండెంట్‌ పెట్టే అవకాశం షాపులకు లేకుండా ఈసీ నియంత్రించింది. ఉన్నతాధికారులే ఏఏ బ్రాండ్ల మద్యం.. ఎంతెంత అవసరమో గుర్తించాలని చెప్పింది. ఈ ఆదేశం జిల్లాలోని ఓ ఎక్సైజ్‌ అధికారికి కాసులు తెచ్చిపెడుతోంది. జిల్లాలో ఏ ప్రభుత్వ మద్యం షాపుకైనా.. ప్రైవేట్‌ బార్లుకు అయినా అతనే ఇండెంట్‌ పెడుతున్నారు. మద్యం సిండికేట్‌లతో చేతులు కలిపి రెండుచేతులా సంపాదిస్తున్నారు. కాగా కూలీలు, కార్మికులు సేవించే తక్కువ ధర మద్యం కేవలం బార్లులో మాత్రమే లభించడం గమనార్హం. మద్యం ప్రియులకు వేసవి తాపాన్ని తగ్గించే బ్రాండెడ్‌ బీర్లు కూడా బార్లుకే ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. మద్యం దుకాణాలకు మాత్రం అంతంతమాత్రంగా ఇండెంట్‌ పెడుతున్నారు. వైన్‌ షాపులకు నెలలో కేవలం 5 నుంచి 10 కేసులు మాత్రమే బ్రాండెడ్‌ బీర్లు పంపిస్తున్నారని, మిగిలిన సరుకల్లా బార్లుకు తరలిస్తున్నారని సమాచారం. విధులో చేరి ఏడాది గడవక ముందే ఓ కీలక ఎక్సైజ్‌ అధికారి రాజకీయ పెద్దలతో పరిచయాలు పెంచుకుని రెండుచేతులా దోచేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ అధికారి మద్యం సిండికేట్ల నుంచి ఫోన్‌ రాగానే ఇండెంట్‌ రెడీచేసి వారికి కావాల్సిన సరుకు పంపిస్తున్నారని తెలుస్తోంది. అధికార పార్టీ అభ్యర్థులకు కూడా పెద్దఎత్తున మద్యం అందించేందుకు సహకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- పొద్దంతా కష్టపడి సాయంత్రం సేదతీరేందుకు ఓ క్వాటర్‌ కొనుక్కునేందుకు వైన్‌ షాపునకు వెళ్తే అక్కడ రేట్లు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. క్వాటర్‌ (180 ఎంఎల్‌) ధర రూ.400 నుంచి రూ.700 చెబుతున్నారు. అదే బారుకు వెళ్తే తక్కువ ధర మద్యం క్వాటర్‌ బాటిళ్లు కూడా అక్కడ దొరుకుతున్నాయి. అయితే క్వాటర్‌పై రూ.50 నుంచి రూ.60 అధికంగా వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఆ ఎక్సైజ్‌ అధికారి తీరుతో సాయంత్రం అయ్యే సరికి వైన్‌షాపులు నిల్‌గా , బార్లు మద్యం ప్రియులతో ఫుల్‌గా కనిపిస్తున్నాయి.

==================

Updated Date - Apr 29 , 2024 | 12:47 AM