Share News

నమ్మించారు.. నట్టేట ముంచారు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:09 PM

‘మన ప్రభుత్వం వచ్చాక.. మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం. ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం’.. ఇదీ 2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన హామీ. అయితే సీఎం అయ్యాక ఆ మాట పూర్తిగా మరిచిపోయారు.

నమ్మించారు.. నట్టేట ముంచారు

అధికారంలోకి వచ్చాక పట్టించుకోని పరిస్థితి..

ఎన్నికలకు ముందు మినీ డీఎస్సీ పేరిట హడావుడి

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయని సర్కారు

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న జిల్లా నిరుద్యోగ యువత

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

‘మన ప్రభుత్వం వచ్చాక.. మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం. ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం’.. ఇదీ 2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన హామీ. అయితే సీఎం అయ్యాక ఆ మాట పూర్తిగా మరిచిపోయారు. ఇప్పుడు ఎన్నికల ముందు మినీ డీఎస్సీ ప్రకటించినా కోడ్‌ దెబ్బతో దానినీ నిర్వహించలేని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఒకే ఒక్కసారి మాత్రమే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసినా.. వాటిని కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. మొత్తంగా నిరుద్యోగ యువతకు వైసీపీ ప్రభుత్వం మోసగించింది. మాటల్లోనే ముంచి నయవంచనకు గురిచేసింది. ఐదేళ్ల పాలనలో నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేసింది.

ఇదీ పరిస్థితి..

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతానని.. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలు నమ్మిన జిల్లాలో నిరుద్యోగ యువత వైసీపీకి పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్‌ హామీలన్నీ మరిచారు. నిరుద్యోగులను నట్టేట ముంచారు. జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీ విషయంలో దగా చేశారు. ఈ ఐదేళ్లలో 2021 జూన్‌లో మాత్రమే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసినా.. వాటిని కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న జగన్‌.. ఈ ఐదేళ్లలో కేవలం వేల సంఖ్యలో పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మరోవైపు మెగా డీఎస్సీ అదిగో.. ఇదిగో అంటూ.. ఐదేళ్లు కాలం గడిపేసిన సర్కారు ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మినీ డీఎస్సీ పేరిట హడావుడి చేసి నిరుద్యోగులకు నిరాశే మిగిల్చింది. కోడ్‌ అమలులో ఉంటుందని తెలిసినప్పటికీ మినీ డీఎస్సీ ప్రకటించి జగన్‌ చేతులు దులుపు కున్నారు. ఉపాధ్యాయ పోస్టుల్లో కూడా భారీగా కోత విధించారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఒక్క అవకాశం ఇస్తే.. తమ జీవితాలతో ఆడుకున్నారంటూ జిల్లాకు చెందిన అనేకమంది డీఎస్సీ అభ్యర్థులు, డీఎడ్‌, బీఎడ్‌లను పూర్తి చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 1998 డీఎస్సీ వారికి మినిమం టైమ్‌ స్కేలుపై కాంట్రాక్టు ప్రాతిపదికనే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఎంటీఎస్‌పై ఇచ్చిన ఉద్యోగాలు రెగ్యులర్‌ కాదు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ప్రకటనపై నాటి ప్రతిపక్ష నేత జగన్‌ ఎన్నో విమర్శలు గుప్పించారు. కానీ వైసీపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఐదేళ్ల కాలంలో మొక్కుబడి నోటిఫికేషన్‌ ఇవ్వడం తప్ప పెద్దగా పోస్టులు భర్తీ చేసింది లేదు. మరోవైపు సచివాలయాల ఉద్యోగాలపై గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ .. ఇప్పటికీ వాటి స్థాయి ఏంటనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు రేషనలైజేషన్‌ పేరిట వైసీపీ సర్కారు పోస్టులను కుదించేసింది. దీంతో భారీగా సింగిల్‌ టీచర్‌ పాఠశాలలు పెరిగిపోయాయి. మరోవైపు పాఠశాలల్లో ఉన్న టీచర్లపై పనిభారాన్ని పెంచారు. ఇదిలా ఉండగా వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రూప్‌-2 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో తొలి నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇటీవల ప్రిలిమ్స్‌ నిర్వహించగా త్వరలో మెయిన్స్‌ జరుగుతుంది. ఉద్యోగాల భర్తీ మాత్రం దాదాపుగా వచ్చే ప్రభుత్వంలోనే పూర్తవుతుంది.

ఎంతో శ్రమించినా..

సర్కారు కొలువు సాధించాలనే లక్ష్యంతో జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఎంతో శ్రమించారు. అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీ పట్టారు. సరదాలు సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. శిక్షణ పొందారు. ఇందుకోసం వేలాది రుపాయలు ఖర్చు పెట్టారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే అన్ని సర్దుకుపోతాయని ఆశతో లక్ష్యంపైనే గురిపెట్టారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో మెగా డీఎస్సీ ప్రకటన రాకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్రంగా మండిపడుతున్నారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆశలు వదులుకున్నారు. మొదట రెండు మూడేళ్లు ఎదురు చూసినా ఆ తర్వాత చాలామంది ఇతర ఉపాధి మార్గాల్లోకి వెళ్లిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చేనాటికే కొంతకాలంగా కోచింగ్‌ తీసుకున్న వారు కూడా చిన్నాచితకా ప్రైవేటు ఉద్యోగాలు చూసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు వ్యవసాయం, కూలి పనులకు పరిమితమయ్యారు. ఇంకా ఎంతోమంది ఖాళీగా మిగిలిపోయారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

సాలూరు రూరల్‌: ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వగా.. పోస్టుల సంఖ్యను మాత్రం తగ్గించారు. ఎస్జీటీలు 103, పాఠశాల సహాయకులు 97, టీజీటీ 84 చొప్పున మొత్తంగా 284 ఉపాధ్యాయ ఖాళీలనే చూపించారు. అయితే అభ్యర్థులు మాత్రం వేలల్లోనే ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2021-2022, 2022-2023 ఏడాదిలో జీవో 117 ప్రకారం .. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం, హేతుబద్ధీకరణ చేయడమే ఇందుకు కారణమని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు భావిస్తున్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాలో రెండో ఎంఈవో పోస్టుల కోసం ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌కు చెందిన 112 పోస్టులను రద్దు చేశారు. కర్నూలు జిల్లాలో ఎస్జీటీ పోస్టుల మంజూరు తక్కువగా ఉండడంతో ఉమ్మడి జిల్లా నుంచి 139 పోస్టులు సర్దుబాటు చేశారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి ఉమ్మడి జిల్లాలో ఆ పోస్టుల సంఖ్య తక్కువైపోయాయి. దీంతో ఇక్కడి నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014లో 339, 2018లో 377 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. కాగా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు డీఎస్సీ నిర్వహించకపోవడం వల్ల ప్రస్తుత మినీ డీఎస్సీకి వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ నిరుద్యో గులను ఊరించడానికేనని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

మోసం చేశారు..

మమ్మల్ని నూటికి నూరు శాతం సీఎం జగన్‌ మోసం చేశారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తారనే ఆశతో మా లాంటి వారెంతో మంది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అప్పులు చేసి శిక్షణ పొందాం. కానీ మెగా డీఎస్సీని వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రకటించలేదు. దీనివల్ల మేము చాలా నష్టపోయాం. వచ్చే ఎన్నికల్లో తగినవిధంగా బుద్ధి చెబుతాం.

-ఓ నిరుద్యోగ యువకుడు, పార్వతీపురం

================================

అప్పులు చేసి శిక్షణ తీసుకున్నా..

మెగా డీఎస్సీ కోసం అప్పులు చేసి మరీ నేను శిక్షణ తీసుకున్నా.. కానీ వైసీపీ ప్రభుత్వ కాలంలో మెగా డీఎస్సీ ప్రకటించలేదు. దీనివల్ల మాలాంటివారు ఎంతోమంది తీవ్ర నిరాశ చెందారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన వారికి ఓట్లు వేసే ప్రసక్తే లేదు.

- ఉపాధ్యాయ శిక్షణ పొందిన యువకుడు, పాలకొండ

================================

ఫలితం దక్కలేదు..

వైసీపీ సర్కారు పాలనలో మెగా డీఎస్సీ నిర్వహిస్తారని ఆశించాం. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వేలాది రుపాయలు ఖర్చు పెట్టి .. ఎంతో కష్టపమడి శిక్షణ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మాకు చాలా అన్యాయం చేశారు.

- ఓ డీఎస్సీ అభ్యర్థి, గరగుబిల్లి మండలం

================================

నిరుద్యోగులుగా మిగిలాం..

వైసీపీ ప్రభుత్వ పాలనలో మా లాంటి ఉపాధ్యాయ వృత్తి శిక్షణ పొందిన వారికి చాలా అన్యాయం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందని కష్టపడి చదివాం. కానీ మెగా డీఎస్సీ ప్రకటించకపోవడం వల్ల నిరుద్యోగులుగా మిగిలాం.

- ఉపాధ్యాయ వృత్తి శిక్షణ పొందిన యువకుడు, భామిని మండలం

================================

Updated Date - Apr 28 , 2024 | 11:09 PM