Share News

వైసీపీ దౌర్జన్యకాండ

ABN , Publish Date - May 05 , 2024 | 02:06 AM

డిప్యూటీ సీఎం, వైసీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన మండలంలోని తారువలో శనివారం వైసీపీ నాయకులు చెలరేగిపోయారు.

వైసీపీ దౌర్జన్యకాండ

  • డిప్యూటీ సీఎం బూడి స్వగ్రామం తారువలో ఉద్రిక్తత

  • జెండా ఎగురవేసినందుకు బీజేపీ కార్యకర్తపై ముత్యాలనాయుడు అనుచరుల దాడి

  • - పరామర్శించడానికి వచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై కూడా ప్రతాపం

  • - వాహనాన్ని ధ్వంసం చేసి వీరంగం

  • - బాధితులపైనే తిరిగి పోలీసులకు ఫిర్యాదు

  • - పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీఎం రమేశ్‌ ఆరోపణ

  • - భారీగా పోలీసుల మోహరింపు

దేవరాపల్లి, మే 4:

డిప్యూటీ సీఎం, వైసీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన మండలంలోని తారువలో శనివారం వైసీపీ నాయకులు చెలరేగిపోయారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నాయకులపై దాడి చేశారు. కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన సీఎం రమేశ్‌పై కూడా బూడి ముత్యాలనాయుడు వర్గీయులు దాడికి తెగబడడం, ఆయన వాహనాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

తారువలో శనివారం కూటమి ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జెండా ఎగురవేసేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్త గంగాధర్‌ (ముత్యాలనాయుడు బావమరిది)తో పాటు మరో ముగ్గురిపై బూడి ముత్యాల నాయుడు వర్గీయులు దాడి చేయడమే కాకుండా వారిపై తిరిగి దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఎన్నికల ప్రచారం చేస్తుంటే తమపైనే బూడి వర్గీయులు దాడి చేసి తమ ఇంటిని ధ్వంసం చేసి తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని బాధితుడు గంగాధర్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు అండగా వ్యవహరిస్తున్నారని, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ దశలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కూటమి కార్యకర్తలు పెద్దఎత్తున స్టేషన్‌ వద్దకు చేరుకోవడం, గంగాధర్‌కు మద్దతుగా బూడి ముత్యాలనాయుడు కుమారుడు, స్వతంత్ర అభ్యర్థి రవికుమార్‌, దేవరాపల్లి ఎంపీపీ భర్త కిలపర్తి భాస్కర్‌ తదితరులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పరామర్శకు వెళ్లిన సీఎం రమేష్‌పై దాడితో నిరసన

దాడికి గురైన గంగాధర్‌కు బాసటగా నిలవడంతో పాటు బూడి వర్గీయుల దాడిలో ధ్వంసమైన అతని ఇంటిని పరిశీలించేందుకు బూడి మొదటి భార్య కుమారుడు రవికుమార్‌లతో కలిసి తారువ వెళ్లిన సీఎం రమేశ్‌పై బూడి వర్గీయులు దాడి చేసి, వాహనాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ దశలో పోలీసులు బలవంతంగా సీఎం రమేశ్‌ను పోలీసు వాహనంలో తారువ నుంచి స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు యత్నించారు. అయితే సీఎం రమేశ్‌ ఉన్న వాహనాన్ని కదలనీయకుండా బూడి వర్గీయులు అడ్డుకోవడంతో పాటు జీపును ధ్వంసం చేశారు.

బూడి వర్గీయుల తీరుపై నిరసన

బీజేపీ కార్యకర్త గంగాధర్‌, సీఎం రమేశ్‌పై బూడి వర్గీయుల దాడులు, ఆపై సీఎం రమేశ్‌ వాహనం ధ్వంసం తదితర ఘటనలతో తారవతో పాటు మండల కేంద్రమైన దేవరాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ కూటమి కార్యకర్తలు ఆందోళన చేశారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. కాగా ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు సీఎం రమేశ్‌ను శనివారం రాత్రి దేవరాపల్లి నుంచి పంపించి వేసినప్పటికీ, బూడి వర్గీయుల చేతిలో దాడికి గురైన వారిపైనే కేసులు నమోదు చేయడానికి యత్నించడాన్ని కూటమి నేతలు తప్పుపడుతున్నారు. ఈ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా డిప్యూటీ సీఎంకు మద్దతుగా నిలవడాన్ని సీఎం రమేశ్‌ తప్పుబట్టారు. వివాదాల నేపథ్యంలో దేవరాపల్లి మండల కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం స్థానికుల్లో నెలకొంది.

Updated Date - May 05 , 2024 | 02:06 AM