Share News

ఓట్ల కొనుగోలుకు వైసీపీ యత్నాలు!

ABN , Publish Date - May 05 , 2024 | 02:02 AM

ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని వైసీపీ విశ్వప్రయత్నం చేస్తోంది.

ఓట్ల కొనుగోలుకు వైసీపీ యత్నాలు!

  • అధిష్ఠానం నుంచి అభ్యర్థులకు చేరిన భారీ నిల్వలు?

  • వార్డు స్థాయికి తరలింపుపై మల్లగుల్లాలు

  • ఎన్నికల అధికారులు, ప్రత్యర్థి పార్టీల నిఘాతో బెంబేలు

  • ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల నేపథ్యంలో ఉలికిపాటు

  • నగదు తరలింపునకు రహస్య మార్గాలపై అన్వేషణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని వైసీపీ విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెడుతోంది. దీనికితోడు పోలింగ్‌కు ఒకరోజు ముందు ప్రతి ఓటరుకు నగదు పంపిణీ చేసేందుకు పక్కాగా స్కెచ్‌ వేస్తోంది. ఈ మేరకు ప్రతి అభ్యర్థికీ పార్టీ అధిష్ఠానం నుంచి భారీగా నగదు చేరిందని సమాచారం. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు డబ్బును విచ్చలవిడిగా వినియోగించాలని వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.

జిల్లాలోని వైసీపీ అభ్యర్థులందరికీ పార్టీ అధిష్ఠానం ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా నగదు పంపిందని విశ్వసనీయ సమాచారం. ఇలా అభ్యర్థులకు చేరిన నగదును వార్డు స్థాయిలోని నేతలకు చేరవేసి, అక్కడి నుంచి ఓటర్లకు పంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తోపాటు ప్రత్యర్థి పార్టీల నిఘా పెరగడంతో నగదు ఎలా తరలించాలనే దానిపై వైసీపీ నేతలు, అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారని తెలిసింది.

షెడ్యూల్‌కు ముందే చేరిన నగదు

పోటీలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వైసీపీ అధిష్ఠానం ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే జిల్లాల వారీగా డబ్బు సిద్ధం చేసినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తమ పార్టీ నుంచి పోటికి దిగుతున్న అభ్యర్థులందరికీ జిల్లాల్లో భద్రపరిచిన డబ్బును అప్పగించారని ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా పంపిణీచేసి పోలింగ్‌కు ఒకటి, రెండు రోజులు ముందు మాత్రమే ఓటర్లకు అందించేలా పార్టీ నుంచి ప్రతి అభ్యర్థికీ స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం.

వార్డులకు తరలింపుపై మీనమేషాలు

అధిష్ఠానం నుంచి వచ్చిన డబ్బును వార్డు, అక్కడి నుంచి పోలింగ్‌ బూత్‌స్థాయికి తరలించేందుకు వైసీపీ అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. కొంతమంది ఇప్పటికే డబ్బులు పంచుతుండడం, ప్రచారసభల పేరుతో భారీగా ఖర్చు చేస్తుండడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల కదలికలు, కార్యాలయాలు, ఇళ్లపైన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, పోలీసులు నిఘా పెంచారు. తాజాగా తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సోదాలు చేయడం మిగిలిన వైసీపీ అభ్యర్థులను కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటికే డబ్బును రహస్య స్థావరాల్లో భద్రంగా దాచి ఉంచినప్పటికీ, ఆ మొత్తాన్ని వార్డు స్థాయికి ఎలా తరలించాలనే దానిపై వారిలో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. ప్రతి వార్డులో నాలుగైదు చోట్లకు నగదు తరలించి, తర్వాత ఓటర్ల సంఖ్య ఆధారంగా ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకూ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

రహస్య మార్గాలపై అన్వేషణ

ఎన్నికల అధికారులు, ప్రత్యర్థి పార్టీల నిఘా నేపథ్యంలో వార్డులకు డబ్బును రహస్యంగా తరలించే మార్గాలను అన్వేషించే పనిలో అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారంటున్నారు. ఈ విషయం మూడో వ్యక్తికి తెలిస్తే ప్రత్యర్థులకు లీక్‌ చేస్తారనే భయంతో అత్యంత నమ్మకస్తులైన ఒకరిద్దరితో మాత్రమే చర్చిస్తున్నారని వైసీపీలోని ముఖ్యనేతలే పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Updated Date - May 05 , 2024 | 02:02 AM