Share News

కేజీహెచ్‌లో నీటి కష్టాలు!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:34 AM

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.

కేజీహెచ్‌లో నీటి కష్టాలు!

అనేక వార్డుల్లో రోగులకు అవస్థలు

జీవీఎంసీ నుంచి అరకొర సరఫరా

ప్రత్యామ్నాయంపై అధికారుల కసరత్తు

రెండు బోరుబావుల ఏర్పాటుకు చర్యలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్‌జార్జ్‌ ఆస్పత్రిలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. అనేక వార్డులకు, నర్సింగ్‌ విద్యార్థి నుల హాస్టల్స్‌ కు నీటి సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణంగా కేజీహెచ్‌లోని వార్డులు, నర్సింగ్‌ కాలేజీ, హాస్టల్‌తో పాటు అధికారుల చాంబర్స్‌కు అవసరమయ్యే నీటిని జీవీఎంసీ సరఫరా చేస్తుంది. కేజీహెచ్‌లో రోజువారీ అవసరాలకు 500 కిలోలీటర్లు నీరు అవసరమవుతుంది. ఇందుకోసం ఐదు చోట్ల నీటిని నిల్వ చేసే సంపులున్నాయి. వీటికి రెండు మార్గాల్లో జీవీఎంసీ నీరు సరఫరా చేస్తుంది. అయితే గత కొద్దిరోజులుగా కేజీహెచ్‌కు ఒకవైపు నుంచి మాత్రమే జీవీఎంసీ నీటిని సరఫరా చేస్తోంది. దీంతో వార్డులు, నర్సింగ్‌ హాస్టల్స్‌లో విద్యార్థులకు సరఫరా కావడం లేదు. మొత్తంగా 300 కిలోలీటర్లకు మించి నీరు రాకపోవడంతో అనేకవార్డుల్లో ఉదయం 11 గంటల తరువాత సరఫరా కావడం లేదు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వాష్‌రూమ్స్‌, ఇతర అవసరాలకు రోగులు అవస్థలు పడుతున్నారు. నీరు లేక టాయిలెట్లు శుభ్రం చేయకపోవడంతో అనేక వార్డుల్లో దుర్గంధం వ్యాపిస్తోందని రోగులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా అనేక వార్డుల్లో రోగులకు చల్లని నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లకు కూడా నీరు సరఫరా కావడం లేదు. తాగునీటి ఇబ్బందులను పలువురు రోగులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం లభించలేదని, దీంతో మార్కెట్‌లో సీసాలతో నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో నీటి ఇబ్బందుల దృష్ట్యా జీవీఎంసీ ట్యాంకర్లతో సరఫరా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలుకావడం లేదు.

ప్రత్యామ్నాయం దిశగా...

కేజీహెచ్‌లో నీటి అవసరాలను తీర్చడం కోసం పూర్తిగా జీవీఎంసీపైనే ఆధారపడుతున్నారు. ఏటా వేసవిలో నీటి కష్టాలు ఎదురవుతుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పా ట్లపై అధికారులు దృష్టిసారించారు. కేజీహెచ్‌లోని గ్రౌండ్‌ వాటర్‌ను వినియోగించుకు నేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం రెండు చోట్ల బోర్లు వేయాలని నిర్ణయిం చినట్టు ఆర్‌ఎంవో డాక్టర్‌ లక్ష్మీతులసి పేర్కొన్నారు. సూపరింటెండెంట్‌ కార్యాలయం సమీపంలో ఒకటి, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ వద్ద మరో బోరు వేసేందుకు యత్నిస్తున్నామన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:34 AM