Share News

బరిలో నిలిచేది వీరే..

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:04 AM

సార్వత్రిక ఎన్నికల పోరులో నిలిచేదెవరో తేలిపోయింది. అనకాపల్లి జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉండేవారు ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. వీరికి గుర్తులను కూడా కేటాయించారు. ఎన్నికల బరిలో అనేక రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ ఈసారి ప్రధాన పోటీ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉండనుంది.

బరిలో నిలిచేది వీరే..

- అనకాపల్లి లోక్‌సభ స్థానానికి 15 మంది పోటీ

- జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు బరిలో 68 మంది

- అన్నిచోట్ల కూటమి, వైసీపీ మధ్యే పోరు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికల పోరులో నిలిచేదెవరో తేలిపోయింది. అనకాపల్లి జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉండేవారు ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. వీరికి గుర్తులను కూడా కేటాయించారు. ఎన్నికల బరిలో అనేక రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ ఈసారి ప్రధాన పోటీ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉండనుంది.

అనకాపల్లి లోక్‌సభ బరిలో 15 మంది...

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి 22 నామినేషన్లు ఆమోదం పొందగా, ఇందులో ఏడుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 15 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకు 94 నామినేషన్లు ఆమోదం పొందగా, ఇందులో 26 మంది ఉససంహరించుకున్నారు. 68 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికంగా 14 మంది పోటీ పడుతుండగా, చోడవరం నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో నిలిచారు. కాగా లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు మధ్యే గట్టి పోటీ ఉంది.

ఏడు అసెంబ్లీ స్థానాల్లో 68 మంది...

జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 68 మంది పోటీలో ఉన్నారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి 12 నామినేషన్లు ఆమోదం పొందగా, ఎవరూ ఉపసంహరించుకోలేదు. నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనిమిది నామినేషన్లు ఆమోదం పొందగా, ఒక్కరు కూడా ఉపసంహరించుకోలేదు. చోడవరం నియోజకవర్గానికి 13 నామినేషన్లు ఆమోదం పొందగా, ఏడుగురు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మాడుగుల నియోజకవర్గం నుంచి 11 నామినేషన్లు ఆమోదం పొందగా, ఇద్దరు ఉపసంహరించుకున్నారు. దీంతో 9 మంది అభ్యర్థులు మిగిలారు. ఎలమంచిలి నియోజకవర్గానికి 14 నామినేషన్లు ఆమోదం పొందగా, నలుగురు ఉపసంహరించుకున్నారు. 10 మంది పోటీలో నిలిచారు. పాయకరావుపేట(ఎస్సీ) నియోజకవర్గానికి 17 నామినేషన్లు ఆమోదం పొందగా, ఎనిమిది మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 9 మంది పోటీలో నిలిచారు. పెందుర్తిలో నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 14 మంది పోటీలో ఉన్నారు. పంచకర్ల రమేశ్‌బాబు(జనసేన), అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌(వైసీపీ), కాంగ్రెస్‌ అభ్యర్థిగా పిరిడి భగత్‌ బరిలో ఉన్నారు.

అన్నిచోట్ల కూటమి, వైసీపీ మధ్యే పోరు

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ అభ్యర్థులు, మూడు చోట్ల జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నర్సీపట్నం అసెంబ్లీ స్థానానికి కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉంది. పాయకరావుపేట (ఎస్సీ) నియోజకవర్గంలో కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు. ఆమెపై వైసీపీ తరఫున విజయనగరం జిల్లా రాజాం వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు పోటీలో ఉన్నారు. చోడవరం టీడీపీ అభ్యర్థిగా కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పోటీలో ఉంటే, ఆయనపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పోటీలో నిలిచారు. మాడుగుల నుంచి టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, వైసీపీ తరఫున బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ పోటీ చేస్తున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ పోటీ చేస్తుండగా, ఆయనపై వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్‌ తలపడనున్నారు. ఎలమంచిలి నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్‌ పోటీలో నిలిచారు. ఆయనపై వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కన్నబాబురాజు తలపడుతున్నారు. పెందుర్తి నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేశ్‌, ఆయనపై వైసీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు పోటీ పడుతున్నారు. ఇక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో వున్నా, ప్రధానమైన పోటీ కూటమి, వైసీపీ మఽధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 01:04 AM