Share News

ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

ABN , Publish Date - May 05 , 2024 | 01:55 AM

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని, ఇందుకోసం సమష్టి కృషితో ముందుకువెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా సూచించారు.

ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని, ఇందుకోసం సమష్టి కృషితో ముందుకువెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా సూచించారు. శనివారం నగరానికి వచ్చిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్‌రూమ్‌, మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను పరిశీలించారు. ఈ క్రమంలో న్యూక్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్‌లో ఈవీఎం కమిషినింగ్‌ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులంతా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్ల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీవో, ఏపీవోలకు ఈవీఎంల వినియోగంపై అందించిన శిక్షణపై ఆరా తీశారు. ఈవీఎంలలో పేర్లు, గుర్తులు లోడ్‌ చేసే విధానం, వీవీ ప్యాట్ల ద్వారా స్లిప్పులు వస్తున్న తీరును పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఒకటికి, రెండుసార్లు తనిఖీ చేయాలన్నారు. ఉద్యోగులు ఓట్లు వేసేందుకు అనువుగా ఏయూ తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల పరిధిలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల చిరునామా తెలిసేలా సైన్‌ బోర్డుల ఏర్పాటుపై జీవీఎంసీ ఏడీసీ విశ్వనాఽథన్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఏయూ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ మయూర్‌ అశోక్‌లతో కలిసి పరిశీలించారు.

Updated Date - May 05 , 2024 | 01:55 AM