Share News

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరిస్తున్నా పట్టదా?

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:44 AM

విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నా సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరిస్తున్నా పట్టదా?

  • జగన్మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజం

  • కర్మాగారం నష్టాల్లో ఉన్నట్టు తెలియదంటే...ఇక మీరెందుకు

  • రాష్ర్టానికి రాజధాని కూడా లేకుండా పోయింయి

  • చేతిలో చిప్ప, నెత్తిన కుచ్చుటోపీ మాత్రమే మిగిలాయి

  • రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ‘ఇండియా’ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పిలుపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నా సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం ఉదయం నగర పరిధిలోని అక్కయ్యపాలెంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ కోసం పోరాడుతున్న నాయకులకు మూడేళ్లపాటు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం అవకాశం ఇచ్చారని...ఆ సమయంలో స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందా?...కార్మిక సంఘ నేతలను జగన్మోహన్‌రెడ్డి అడిగారంటే ఆయనకు ఏపాటి శ్రద్ధ, అవగాహన ఉన్నాయో అవగతమవుతున్నాయన్నారు. ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చుకోండని సూచించారని...మరి సీఎంగా ఆయన ఉండి దేనికని షర్మిల ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?...అని షర్మిల ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంటు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, నష్టాల ఊబిలోకి నెట్టి అంబానీ, అదానీలకు విక్రయించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే..ఒక్కో నియోజకవర్గానికి కొత్తగా 50 నుంచి 100 వరకు పరిశ్రమలు వచ్చేవని, కానీ, అటువంటి అవకాశం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా పోయిందని, చేతిలో చిప్ప, నెత్తిన కుచ్చుటోపీ మాత్రమే మిగిలాయన్నారు. బిడ్డలు, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని, ఈసారి ఆలోచించి ఓటేయాలని సూచించారు. ‘గతంలో ఎవరికి ఓట్లేశారు. వాళ్లు ఏం చేశారు. మళ్లీ వేయాలా..? వద్దా..? అన్న ఆలోచన చేయాలి’ అని ప్రజలకు షర్మిల సూచించారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి జీవితాలను మార్చుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించిన వ్యక్తి ఐదేళ్లలో ఒక్కసారైనా విశాఖ ప్రజలు, వారి హక్కులు కోసం, విశాఖ మేలు కోసం పోరాడారా..? అని షర్మిల ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధికి కృషిచేసే వారినే ఎన్నుకోవాలని సూచించిన షర్మిల.. ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. సమావేశంలో విశాఖ ఎంపీ అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి), కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వజ్జపర్తి శ్రీనివాసరావు మాట్లాడారు. ఇండియా అభ్యర్థులు లక్కరాజు రామారావు, అడ్డాల వెంకట వర్మరాజు, వాసుపల్లి సంతోష్‌, విమల, జగ్గునాయుడుతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 01:44 AM