Share News

ధరల మంట

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:31 AM

‘‘నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగిపోయాయి. గడిచిన ఐదేళ్లలో ప్రతి వస్తువు ధర రెట్టింపు అయింది.

ధరల మంట

  • ఐదేళ్లలో రెట్టింపు అయిన నిత్యావసర సరకుల ధరలు

  • బియ్యం 25 కిలోల బస్తాపై రూ.400 నుంచి రూ.600 వరకూ పెరుగుదల

  • ఒక్కో కుటుంబంపై నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు అదనపు భారం

  • ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు

  • అప్పులు చేయాల్సిన పరిస్థితి

  • నియంత్రణలో వైసీపీ సర్కారు విఫలం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగిపోయాయి. గడిచిన ఐదేళ్లలో ప్రతి వస్తువు ధర రెట్టింపు అయింది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి...నిత్యావసర సరకులు, ఇతర వస్తువుల ధరలను పెంచి సాధారణ, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. గతంలో నిత్యావసర సరకులకు నెలకు ఐదు వేల రూపాయలు అయ్యేవి. ఇప్పుడు పది వేలు దాటిపోతోంది. ఆదాయంలో రూపాయి పెరుగుదల లేదు. పైపెచ్చు కరోనా తరువాత జీతాల్లో కోతలు. ఇలా అయితే ఎలా బతకాలో అర్థం కావడం లేదు’’

- ఇదీ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న నగరంలోని హెచ్‌బీ కాలనీకి చెందిన లలితకుమారి ఆవేదన. సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారంతా ధరల పెరుగుదలతో చాలా ఇబ్బందిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన ఐదేళ్లలో నిత్యావసర సరకుల ధరలు రెట్టింపయ్యాయి. ఒక్కో కుటుంబంపై కనీసం నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకూ అదనపు భారం పెరిగింది. ఏటా పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ కష్టమవుతోందన్న భావనను అందరూ వ్యక్తంచేస్తున్నారు. నిత్యావసర సరకులతోపాటు పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని శివాజీపాలెం ప్రాంతానికి చెందిన రోహిణి వాపోయారు.

భారీగా పెరిగిన ధరలు

గడిచిన ఐదేళ్లలో నిత్యావసర సరకులైన ఉప్పు, పప్పు, వంటనూనెలు వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఐదేళ్ల కిందట ఆయిల్‌ ధర రూ.72 ఉండగా, ప్రస్తుతం రూ.95 ఉంది. అంటే, కిలోకు 23 రూపాయలు పెరిగింది. గతంలో వేరుశనగ నూనె కిలో రూ.102 ఉండగా, ప్రస్తుతం రూ.160కి చేరింది. పంచదార రూ.22 ఉండగా, ప్రస్తుతం రూ.48కి పెరిగింది. పెసరపప్పు గతంలో కిలో రూ.70 ఉండగా రూ.134కు, కందిపప్పు రూ.94 నుంచి 186కి చేరింది. ఐదేళ్ల కిందట 25 కిలో బియ్యం బస్తా బ్రాండ్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.1200 మధ్యలో లభించేది. ప్రస్తుతం రూ.1,400 నుంచి రూ.1,800 మధ్య వెచ్చించాల్సి వస్తోంది. గతంలో మినపగుండ్లు ధర కిలో రూ.78 ఉండగా ప్రస్తుతం 156కు పెరిగింది. వీటితోపాటు అనేక సరకుల ధరలు రెట్టింపు, అంతకంటే ఎక్కువ పెరగడంతో సాధారణ మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోంది.

రెట్టింపు అయిన భారం

ధరల పెరుగుదలతో ప్రతి ఇంటిపైనా ఆర్థికంగా భారం రెట్టింపు అయింది. సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు గతంలో నిత్యావసర సరకులకు నెలకు రూ.4 వేల నుంచి ఆరు వేలు ఖర్చయితే, ప్రస్తుతం ఎనిమిది వేల రూపాయల నుంచి రూ.12 వేల వరకు అవుతోంది. సరకులతోపాటు రోజువారీ కొనుగోలు చేసే కూరగాయలు, ఇతరత్రా అన్నింటి ధరలూ పెరిగాయని, మొత్తం నెలకు కనీసం రూ.15 వేలు ఖర్చవుతోందని వెంకోజీపాలెం ప్రాంతానికి నాగమణి అనే గృహిణి పేర్కొన్నారు. ఆదాయంలో పెరుగుదల లేకపోయినా ఖర్చు మాత్రం పెరిగిందని, ప్రభుత్వాలు నిత్యావసర సరకుల ధరలను అదుపులో ఉంచకుండా ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని రామకృష్ణ అనే మెకానిక్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయాడు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెబుతూనే, మరోవైపు ధరలను పెంచి అంతకు రెట్టింపు తమ వద్ద వసూలు చేస్తున్నారని లక్ష్మి అనే గృహిణి వాపోయారు.

నెలకు అదనంగా మూడు వేలకుపైగా ఖర్చు

- ఎం.లక్ష్మి, గృహిణి, వెంకోజీపాలెం

నిత్యావసర సరకులకు గతంలో నెలకు ఐదు వేల రూపాయల వరకు అయ్యేవి. గడిచిన కొన్నాళ్ల నుంచి పెరిగిన ధరలతో భారీగా వ్యయం పెరిగింది. ప్రతినెలా కూరగాయలు, పప్పులు, ఉప్పులకు తొమ్మిది వేల వరకూ ఖర్చవుతోంది. గ్యాస్‌, పెట్రోల్‌ ఖర్చులు కలిపి మరో మూడు వేల వరకూ అవుతున్నాయి. పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ధరలను అదుపులో ఉంచకపోవడం వల్ల మాలాంటి సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పథకాలేమో గానీ ముందు ధరలను అదుపులో ఉంచాలి

- వి.భవానీ, గృహిణి, గాజువాక

నిత్యావసర సరకుల ధరలు చూస్తుంటే భయమేస్తోంది. నిన్న ఉన్న ధర ఈరోజు ఉండడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక వస్తువుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆయిల్‌, పుప్పలు ధరలు అయితే మరింత దారుణంగా పెరుగుతున్నాయి. ఆదాయానికి, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది. సొంత ఊరు వదిలి రూపాయి సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతో నగరానికి వచ్చాం. కానీ, పెరిగిన ధరలతో బతకడమే కష్టంగా ఉంది. పథకాలేమోగానీ ముందు నిత్యావసర సరకుల ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలి. గతంతో పోలిస్తే నిత్యావసర సరకులకే అదనంగా మూడు వేలు ఖర్చవుతోంది. గ్యాస్‌, పెట్రోల్‌ ధరలతో కలిపి మొత్తం రూ.12 వేలు అవుతోంది.

గతంలో రూ.5 వేలు సరిపోయేవి, ఇప్పుడు రూ.8 వేలు

- నమ్మి ధనలక్ష్మి, గృహిణి, షీలానగర్‌

ధరలు భారీగా పెరగడంతో గతంతో పోలిస్తే నెలకు అదనంగా మూడు వేలు ఖర్చు అవుతోంది. గతంలో పప్పులు, కూరగాయలకు ఐదు వేల రూపాయలు సరిపోయేవి. ఇప్పుడు ఎనిమిది వేలు దాటుతోంది. అది కూడా జాగ్రత్తగా చూసి కొంటే. పప్పులు వంటి వినియోగాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయిల్‌ ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. అలాగే వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళుతుంటా. కనీసం రూ.700 ఖర్చు అవుతోంది. కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.

ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

- ఎస్‌.అనురాధ, గృహిణి, అక్కయ్యపాలెం

సరకుల ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పప్పులు, ఉప్పులు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుంటే సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలకు డబ్బులు వెచ్చించడాన్ని తగ్గించి నిత్యావసర సరకుల ధరలను అదుపులో ఉంచేందుకు యత్నించాలి. ధరల పెరుగుదల వల్ల ఒక్కో కుటుంబం నుంచి నెలకు కనీసం రూ.మూడు వేల నుంచి పది వేలు వరకు అదనంగా ఖర్చవుతోంది. ఈ మొత్తం డబ్బంతా ఏమవుతోంది. తిండి, బట్ట, విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం.

ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలి

- బి.రాంబాబు, ప్రైవేటు ఉద్యోగి

సాధారణ, మధ్య తరగతి ప్రజల ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదు కానీ, నిత్యావసర సరకులు ధరల మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. ఐదేళ్లలో వేతనం పది శాతం కూడా లేదు. ప్రభుత్వాలు పథకాల పేరుతో డబ్బులు పంపిణీ చేయడం కంటే ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న నిత్యావసర సరకుల ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి. ఆ దిశగా పాలకులు ఆలోచన చేయనంత కాలం ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

సరకు నాటి ధర ప్రస్తుతం

2018 డిసెంబరు

పంచదార 22 48

పెసరపప్పు 70 134

కందిపప్పు 94 186

మినపపప్పు 78 156

బియ్యం 1.000-1100 1.400-1800

గోధుమ పిండి 32 67

ఇడ్లీ రవ్వ 28 45

ఉప్మా రవ్వ 39 60

పామాయిల్‌ 72 95

వేరుశనగనూనె 102 175

Updated Date - Apr 29 , 2024 | 01:31 AM