Share News

పొలిటికల్‌ నర్సరీ... పెందుర్తి!

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:43 AM

పొలిటకల్‌ నర్సరీగా పేర్గాంచి, రాజకీయ దిగ్గజాలను అందించిన పురిటిగడ్డగా పెందుర్తి నియోజకవర్గం చరిత్ర కెక్కింది.

పొలిటికల్‌ నర్సరీ... పెందుర్తి!

దిగ్గజ నేతల పురిటిగెడ్డగా గుర్తింపు

ఇక్కడి గెలిస్తే... అధికారమే... బలమైన సెంటిమెంట్‌

అభ్యర్థులెవరైనా ఒకసారే చాన్స్‌...

ఈ ఎన్నికల్లో ఆ ఆనవాయితీకి బ్రేక్‌

రెండు జిల్లాల పరిధిలో నియోజకవర్గం

టీడీపీ, కాంగ్రెస్‌కు నాలుగు సార్లు విజయం

ఒక్కోసారి గెలిచిన సీపీఐ, పీఆర్పీ, వైసీపీ

పొలిటకల్‌ నర్సరీగా పేర్గాంచి, రాజకీయ దిగ్గజాలను అందించిన పురిటిగడ్డగా పెందుర్తి నియోజకవర్గం చరిత్ర కెక్కింది. 1978లో ఏర్పడిన రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఘనత సాధించింది. గ్రామీణ, పట్టణ సమ్మేళనంతో ఉన్న ఇక్కడి ఓటర్ల తీర్పు ప్రతి ఎన్నికలో విలక్షణమే. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఏపార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న బలమైన సెంటిమెంట్‌ ఉంది. అంతేకాదు అభ్యర్థులెవరైనా ఇక్కడి నుంచి ఒకసారే గెలుపొందుతారని, రెండోసారి కష్టమనే నానుడి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆ నానుడికి బ్రేక్‌ పడనుంది.

దిగ్గజనేతలతో పాటు అనామకులనుకున్న వారిని ఈ నియోజకవర్గం అందలమెక్కించిన చరిత్ర సొంతం చేసుకుంది. 2004 ఎన్నికల వరకు విశాలమైన నియోజవర్గంగా నిలిచిన పెందుర్తి ఆ తరువాత జరిగిన నియోజవర్గాల పునర్వ్యవస్థీకరణలో రూపురేఖలు కోల్పోయింది. పార్లమెంటు నియోజవర్గాల వారీగా కొత్త జిల్లాల ఆవిర్భావంతో విశాఖ జిల్లాకే పరమితమైన నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో విలీనమయింది. అయితే పెందుర్తి రెవెన్యూ మండలాన్ని మాత్రం విశాఖ జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నియోజవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వచ్చింది.

నియోజకవర్గ చరిత్ర...

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు గాజువాక గోపాలపట్నం, మధురవాడ, అడివివరం, పోతినమల్లయ్యపాలెం వరకు విస్తరించి, ఉమ్మడి రాష్ట్రంలో రెండో అతిపెద్ద నియోజకవర్గంగా పేర్గాంచింది. పునర్విభజనలో కొత్తగా పశ్చిమ, గాజువాక, నియోజకవర్గాలు ఏర్పడగా కొన్ని ప్రాంతాలు వాటిలో విలీనమయ్యాయి. మరిన్ని ప్రాంతాలు భీమునిపట్నంలో చేరాయి. అప్పటివరకు పరవాడ నియోజకవర్గంలో ఉన్న పరవాడ, సబ్బవరం మండలాలతో పాటు, పెందుర్తి, పెదగంట్యాడ మండలాలను కలుపుతూ పెందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. పెందుర్తి మండలంలో 24 పంచాయతీలుండగా పెందుర్తి, చినముషిడివాడ, పురుషోత్తపురం, వేపగుంట, చీమలాపల్లి, లక్ష్మీపురం, పొర్లుపాలెం, నరవ, గవరజగ్గయ్యపాలెం మేజర్‌ పంచాయతీలు 2006లో గ్రేటర్‌ విశాఖలో విలీనమై 57, 69, 70, 71, వార్డులుగా రూపాంతరం చెందాయి. దీంతో పాటు 72వ వార్డులో కొన్నిప్రాంతాలు ఇందులోకి వచ్చాయి. ఇక పెందుర్తి మండలంలోని 15 పంచాయతీలు, సబ్బవరం మండలంలో 24 పంచాయతీలు, పరవాడ మండలంలో 16 పంచాయతీలు, పెదగంట్యాడ పరిధిలో కొన్ని గ్రామాలు నియోజకవర్గంలోకి వచ్చి చేరాయి. అనంతరం 2021లో జరిగిన గ్రేటర్‌ వార్డుల పునర్విభజనలో ఈ వార్డులు 92 నుంచి 96 వరకు వార్డులుగా మారాయి.

రెండు జిల్లాలకు ప్రాతినిథ్యం

జిల్లాల పునర్విభజన తరువాత పెందుర్తి నియోజకవర్గం రెండు జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలోనూ, పరవాడ, సబ్బవరం మండలాలను అనకాపల్లి జిల్లాలోనూ కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెందుర్తి ఎమ్మెల్యే రెండు జిల్లాల్లో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.

గెలిస్తే అధికారమే...

పెందుర్తిలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆపార్టీ అఽధికారంలోకి వస్తుందనేది సెంటిమెంట్‌. అయితే ఈ సెంటిమెంట్‌కు 2009లో బ్రేక్‌ పడింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేశ్‌బాబు గెలిచినప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనంకావడంతో సెంటిమెంట్‌ కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కొత్త రాష్ట్రంలోనూ...

రాష్ట్ర విభజన జరిగిన తరువాతా అదే సెంటిమెంట్‌ కొనసాగింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయింది. 2019లో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ విజయం సాధించగా వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఒకసారే ఛాన్స్‌కు ఈసారి బ్రేక్‌

పెందుర్తి నుంచి ఏ పార్టీ అభ్యర్థి అయినా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అవుతారనేది ఇప్పటివరకు కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే నాలుగున్నర దశాబ్దాల ఈ రికార్డుకు ప్రస్తుత ఎన్నికల్లో బ్రేక్‌ పడనున్నది. 1978 నుంచి 2019 వరకు ఇక్కడ పోటీచేసినవారు ఒక్కసారి మాత్రమే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు గతంలో పెందుర్తి నుంచి గెలుపొందినవారు కావడంతో ఇద్దరిలో ఎవరు విజయం సాఽధించినా ఈ ఆనవాయితీకి బ్రేక్‌ పడినట్టే.

పెందుర్తి ఓటర్లే కీలకం...

పెందుర్తి మండలంలో సుమారు రెండు లక్షల జనాభా ఉంది. తుది ఓటరు జాబితాలో 282 పోలింగ్‌ కేంద్రాలకు గాను 3,07,545 ఓటర్లు ఉండగా, పురుషులు 1,52,592, మహిళలు 1,54,948, ట్రాన్స్‌జెండర్స్‌ ఐదుగురున్నారు. కాగా పెందుర్తి మండలంలోనే 1,71,915 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో వీరే కీలకం కానున్నారు. వీరంలో పురుషులు 85,670, మహిళలు 86,243 టాన్స్‌జెండర్స్‌ ఇద్దరున్నారు. కాగా సబ్బవరం మండలంలో 59,548 ఓటర్లకు పురుషులు 29,147మంది, మహిళలు 30,400 మంది, ఒక టాన్స్‌జెండర్‌ ఉన్నారు. ఇక పరవాడ మండలంలో 64,459 మంది ఓటర్లకు గాను పురుషులు 31,893 మంది, మహిళలు 32,564 మంది, ఇద్దరు టాన్స్‌జెండర్స్‌ ఉన్నారు, పెదగంట్యాడ మండలంలో 11,623 ఓటర్లు ఉండగా పురుషులు 5,882 మంది, మహిళలు 5741 మంది ఉన్నారు, ఈ మూడు మండలాల మొత్తం ఓటర్లు 1,35,630 కాగా, పెందుర్తి మండలంలోనే అత్యధికంగా 1,71,915 మంది ఉన్నారు.

- పెందుర్తి

1978 నుంచి 2019 వరకు పెందుర్తిలో విజేతలు

సంవత్సరం విజేత పార్టీ మెజారిటీ

1978 గుడివాడ అప్పన్న కాంగ్రెస్‌ 10,047

1980 (ఉపఎన్నిక) ద్రోణంరాజు సత్యనారాయణ కాంగ్రెస్‌

1983 పెతకంశెట్టి అప్పలనరసింహం టీడీపీ 41,283

1985 ఆళ్ల రామచంద్రరావు టీడీపీ 9,107

1989 గుడివాడ గురునాథరావు కాంగ్రెస్‌ 13,093

1994 మానం ఆంజనేయులు సీపీఐ 30,987

1999 పెతకంశెట్టి గణబాబు టీడీపీ 23,589

2004 తిప్పల గురుమూర్తిరెడ్డి కాంగ్రెస్‌ 18,150

2009 పంచకర్ల రమేశ్‌బాబు ప్రజారాజ్యం 3,272

2014 బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ 18,648

2019 అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ వైసీపీ 28,860

పెందుర్తి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు 3,07,545

పురుషులు 1,52,592

మహిళలు 1,54,948

ఇతరులు 5

Updated Date - Apr 29 , 2024 | 01:43 AM