Share News

గ్రోయిన్ల నిర్వహణ గాలికి..

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:24 AM

జిల్లాలో గ్రోయిన్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రోయిన్ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో చాలా చోట్ల గ్రోయిన్లు శిథిలావస్థకు చేరి సాగునీరు వృథా అవుతోంది. దీని వల్ల పంటలకు నీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

గ్రోయిన్ల నిర్వహణ గాలికి..
అనకాపల్లి మండలం తగరంపూడి శారదా నది గ్రోయిన్‌ పరిస్థితి ఇలా..

- వైసీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులపై నిర్లక్ష్యం

- జిల్లాలో చాలా చోట్ల గ్రోయిన్లు శిథిలావస్థకు చేరినా పట్టించుకోని వైనం

- మరమ్మతులకు ఒక్క పైసా విడుదల చేయలేదు

- సాగునీరు అందక నష్టపోతున్నామని రైతుల గగ్గోలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గ్రోయిన్ల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రోయిన్ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో చాలా చోట్ల గ్రోయిన్లు శిథిలావస్థకు చేరి సాగునీరు వృథా అవుతోంది. దీని వల్ల పంటలకు నీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల పరిధిలో శారదా నదిపై తగరంపూడి, సీతానగరం, తుమ్మపాల, చెర్లోపల్లి, నాగులాపల్లి, కాశీమదుం, పేరంటాలపాలెం, వెదురుపర్తి, ఉగ్గినపాలెం ప్రాంతాల్లో గ్రోయిన్లు ఉన్నాయి. వీటి కింద అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల పరిధిలో సుమారు 9 వేల ఎకరాల ఆయకట్ట ఉంది. కశింకోట మండలంలో కాశీమదుం గ్రోయిన్‌, పేరంటాలపాలెం, వెదురుపర్తి, ఉగ్గినపాలెం గ్రోయిన్లు, అనకాపల్లి మండలం బవులువాడ, దిబ్బపాలెం, పంచాయతీల పరిధిలోని సీతానగరం గ్రోయిన్లకు వైసీపీ అధికారం చేపట్టిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా విదల్చలేదు. చోడవరం నియోజకవర్గ పరిధిలో శారదా, పద్దేరు నదులపై వడ్డాది, గౌరీపట్నం, బెన్నవోలు, చాకిపల్లి, కలిగొట్ల, మల్లాం ప్రాంతాల్లో గ్రోయిన్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో సుమారు ఆరు వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. అలాగే పంట కాలువలు పూడుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం సాగునీటి వనరులపై నిర్లక్ష్యం చూపిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:24 AM