Share News

డిప్యూటీ సీఎంకు ఝలక్‌!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:31 AM

సాధారణ ఎన్నికల ముందు మాడుగుల నియోజకవర్గం లో అధికార వైసీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, అసంతృప్తి ఒక్కసారిగా బయ టపడ్డాయి.

డిప్యూటీ సీఎంకు ఝలక్‌!

సొంత మండలం దేవరాపల్లిలో ‘కిలపర్తి’ కుటుంబం తిరుగుబాటు

భాస్కరరావు సతీమణి రాజేశ్వరి ఎంపీపీ పదవికి రాజీనామా

మూడు వారాల ముందు నుంచే మంత్రితో కటీఫ్‌

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు పేరును ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం

మాడుగుల ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కిలపర్తి

తన కుమార్తెకు టికెట్‌ ఇప్పించుకున్న డిప్యూటీ సీఎం

అప్పటి నుంచి కిలపర్తి కుటుంబం అలక

దేవరాపల్లి, ఏప్రిల్‌ 15:

సాధారణ ఎన్నికల ముందు మాడుగుల నియోజకవర్గం లో అధికార వైసీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, అసంతృప్తి ఒక్కసారిగా బయ టపడ్డాయి. ఉప ముఖ్యమంత్రి, వైసీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి అయిన బూడి ముత్యాలనాయుడు సొంత మండలం దేవరాపల్లి మండల పరిషత్‌ అధ్యక్ష పదవికి ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి సోమవారం రాజీనామా చేయడం తీవ్ర సంచల నం రేపింది. తన భర్త, ఉప ముఖ్యమంత్రికి కుడి భుజంగా వున్న కిలపర్తి భాస్కరరావుతోపాటు జిల్లా పరిషత్‌ సీఈవోను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందిం చారు. ఈ పరిణామం వైసీపీకి షాక్‌గా భావిస్తున్నారు.

కిలపర్తి భాస్కరరావు తండ్రి కిలపర్తి సూరి అప్పారావు నియోజకవర్గంలో కీలకనేత. మాడుగుల అసెంబ్లీకి గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేశారు. ఆయన మరణం తరువాత భాస్కరరావు రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ తరపున దేవరాపల్లి ఎంపీపీగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో గట్టి పట్టున్న ఆయన.. కొద్దికాలంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం తొలుత ప్రకటించిన అభ్యర్థుల జాబి తాలో బూడి ముత్యాలనాయుడుకు మాడుగుల అసెంబ్లీ టికెట్‌ కేటాయించింది. అయితే అనకాపల్లి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీఎం రమేశ్‌ బరిలో దిగడంతో.. వైసీపీ పెద్దలు ఇటీవల బూడి ముత్యాలనాయుడును ఆ పార్టీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మాడుగుల ఎమ్మెల్యే టికెట్‌ తనకు లభిస్తుందని, తన పేరును ఉప ముఖ్యమంత్రి సిఫారసు చేస్తారని కిలపర్తి భాస్కరరావు భావించినట్టు తెలిసింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్‌ను బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనూరాధకు కేటాయించడంతో భాస్కరరావు తీవ్ర నిరాశ చెందారు. అంతకుముందు వరకు ఉప ముఖ్యమంత్రి దేవరాపల్లి మండలంలో ఏ గ్రామంలో పర్యటించినా భాస్కరరావు వెంట వుండేవారు. మాడు గుల టికెట్‌ను అనూరాధకు కేటాయించినప్పటి నుంచి డిప్యూటీ సీఎం వెంట కనిపించడంలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. డిప్యూటీ సీఎం ఫోన్‌ చేసినా ఎత్తడంలేదని తెలిసింది. భాస్కరరావు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా డిప్యూటీ సీఎం ప్రయత్నాలు చేసినప్పటికీ, స్పందన లేదన్టి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిలపర్తి భాస్కరరావు వ్యవహారంపై ఆదివా రం రాత్రి మండలానికి చెందిన పార్టీ ముఖ్యనేతలతో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు సమాచారం. భాస్కరరావును బుజ్జగించే ప్రసక్తే లేదని, అతనికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ తనను మోసగించారంటూ డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. అతనితో తెగతెంపులు చేసుకుంటామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కిలపర్తి భాస్కరరావు, తన భార్య రాజేశ్వరిని వెంటబెట్టుకుని సోమవారం మధ్యాహ్నం విశాఖపట్నం వెళ్లి జడ్పీ సీఈవో ఎం.పోలినా యుడును కలిశారు. రాజేశ్వరి ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తూ, లేఖను ఆయనకు అందజేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. కాగా ఎంపీటీసీ పదవికి, వైసీపీకి రాజీనామా చేయలేదని భాస్కరరావు, రాజేశ్వరి చెప్పారు.

Updated Date - Apr 16 , 2024 | 01:31 AM