Share News

షుగర్‌ ఫ్యాక్టరీల అభివృద్ధి ఉత్తి మాటేనా?

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:29 AM

‘మేం అధికారంలోకి వస్తే జిల్లాలోని సహకార షుగర్‌ ఫ్యాక్టరీలన్నింటికీ మంచి రోజులు వచ్చినట్టే. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తాం’... ఇదీ ఐదేళ్ల్ల క్రితం పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీల కార్మికులు, రైతులకు ఇచ్చిన హామీ.

షుగర్‌ ఫ్యాక్టరీల అభివృద్ధి ఉత్తి మాటేనా?
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని నాలుగేళ్ల క్రితం నిపుణుల కమిటీ సందర్శించినప్పటి చిత్రం

- జిల్లాలోని సహకార షుగర్‌ ఫ్యాక్టరీలను లాభాల బాట పట్టిస్తానని పాదయాత్రలో జగన్‌ హామీ

- గోవాడ షుగర్స్‌కు మంచి రోజులంటూ ఊకదంపుడు

- వైసీపీ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

- బహిర్గతంకాని నివేదికలు

- మూడేళ్ల క్రితం మూతపడిన తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు

- అగమ్యగోచరంగా గోవాడ షుగర్స్‌ భవిష్యత్తు

- సర్కారు తీరుపై కార్మికులు, రైతుల మండిపాటు

చోడవరం, ఏప్రిల్‌ 28: ‘మేం అధికారంలోకి వస్తే జిల్లాలోని సహకార షుగర్‌ ఫ్యాక్టరీలన్నింటికీ మంచి రోజులు వచ్చినట్టే. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తాం’... ఇదీ ఐదేళ్ల్ల క్రితం పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీల కార్మికులు, రైతులకు ఇచ్చిన హామీ.

అభివృద్ధి మాట దేవుడెరుగు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత అప్పటికే నడుస్తున్న మూడు షుగర్‌ ఫ్యాక్టరీలలో తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు మూతపడగా, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ అతి కష్టమ్మీద నడుస్తోంది. ఇది కూడా నేడో, రేపో మూతపడే స్థితికి వచ్చింది. షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడుతుంటే వైసీపీ ప్రభుత్వం ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు, రైతులు మండిపడుతున్నారు.

జిల్లాలోని సహకార షుగర్‌ ఫ్యాక్టరీలను ఆదుకుంటామని, అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల క్రితం పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో కార్మికులు, రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సహకార షుగర్‌ ఫ్యాక్టరీలను అభివృద్ధి బాటలో నడి పించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ప్రత్యేకంగా నిపుణుల కమిటీని అన్ని ఫ్యాక్టరీలకు పంపించింది. ఈ నిపుణుల కమిటీ అన్ని ఫ్యాక్టరీలను సందర్శించి వాటిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. అనంతరం ఫ్యాక్టరీలపై ప్రత్యేకంగా సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, అప్పటి వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు, నాటి పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో షుగర్‌ ఫ్యాక్టరీలకు మహర్దశ పట్టనుందని, అప్పటికే మూతపడిన తుమ్మపాల ఫ్యాక్టరీ కూడా తిరిగి తెరుచుకుంటుందని రైతులు, కార్మికులు ఆశించారు. అయితే నిపుణుల కమిటీ, మంత్రి వర్గ ఉపసంఘం సందర్శనలు పూర్తయిన తరువాత ఫ్యాక్టరీల పరిస్థితిలో ఏమాత్రం మార్పులేకపోగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత నడుస్తున్న మూడు షుగర్‌ ఫ్యాక్టరీలలో తాండవ, ఆ తరువాత ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇక మిగిలిన గోవాడ ఫ్యాక్టరీ కూడా మూడేళ్లుగా ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నది. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో వంద కోట్ల రూపాయలతో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కూడా ప్రకటనలకే పరిమితమైంది. ఈ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా నేడో, రేపో మూతపడడం ఖాయం అన్న చందంగా దిగజారింది. సహకార షుగర్‌ ఫ్యాక్టరీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ నాడు జగన్‌ ఇచ్చిన హామీకి భిన్నంగా జిల్లాలోని సహకార ఫ్యాక్టరీలు మూతపడినప్పటికీ, ప్రభుత్వపరంగా ఎలాంటి చేయూత లభించకపోవడంపై చెరకు రైతులు, కార్మికులు నిరాశ చెందుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో, మంత్రివర్గ ఉపసంఘం ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నదో అనే విషయాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. సహకార షుగర్‌ ఫ్యాక్టరీలను లాభాల బాట పట్టిస్తామని నాడు జగన్‌ హామీ ఇచ్చి ఇప్పుడు ఫ్యాక్టరీలు మూత పడుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:29 AM