Share News

జీవీఎంసీ గెస్ట్‌హౌస్‌గా ఐఏఎస్‌ అధికారి భవనం

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:34 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) నిధులను అధికారులు తమ అస్మదీయులకు అప్పనంగా పంచి పెడుతున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

జీవీఎంసీ గెస్ట్‌హౌస్‌గా ఐఏఎస్‌ అధికారి భవనం

నెలనెలా రూ.20 లక్షలు అద్దె చెల్లింపు

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపణ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) నిధులను అధికారులు తమ అస్మదీయులకు అప్పనంగా పంచి పెడుతున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారి పోలా భాస్కర్‌ భార్య అమరావతి పేరుతో నగరంలోని విశాలాక్షి నగర్‌లో ఐదంతస్థుల భవనం ఉందన్నారు. ఆ భవనానికి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు రెసిడెన్షియల్‌ కేటగిరీలో ఇంటి పన్ను విధించి ఆరు నెలలకు రూ.1,350 చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారన్నారు. అయితే సదరు ఐఏఎస్‌ అధికారి...జీవీఎంసీకి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి తెచ్చి తన భవనాన్ని జీవీఎంసీ గెస్ట్‌హౌస్‌గా తీసుకునేలా చేశారని ఆరోపించారు. సదరు ఐఏఎస్‌ అడగడమే తరువాయి అన్నట్టు జీవీఎంసీ అధికారి ఆ భవనానికి నెలకు రూ.20 లక్షలు అద్దెగా చెల్లించేస్తున్నారన్నారు. ఆ భవనంలో జీవీఎంసీ అధికారులు ఎవరూ బస చేయకపోయినా అక్కడ జీవీఎంసీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పది మందిని కేటాయించి నిత్యం పనులు చేయిస్తున్నారు. దీనివల్ల జీవీఎంసీ నిధులు దుబారా అవడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని సక్రమం చేసినట్టయిందని మూర్తియాదవ్‌ ఆరోపించారు. జీవీఎంసీకి వచ్చే ప్రముఖులకు నిజంగా వసతి కల్పించాలంటే కిర్లంపూడి లేఅవుట్‌లో రూ.ఆరు కోట్ల వ్యయంతో నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను వాడుకోవచ్చునని, అఽయినా అధికారులు ప్రతి నెలా అప్పనంగా రూ.20 లక్షలు చెల్లించేందుకు ఆసక్తి చూపడం దురదృష్టకరమన్నారు. జీ-20 పేరుతో నగరంలో చేపట్టిన సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు కోసం ఏపీ గ్రీన్‌ కార్పొరేషన్‌కు జీవీఎంసీ నిధుల నుంచి రూ.10 కోట్లు చెల్లించారని, దీనివెనుక రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పాత్ర ఉందన్నారు. నగర ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయించాల్సిన నీటిని భవన నిర్మాణ అవసరాలకు అధికారులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు నగర ప్రజలు తాగునీటి కోసం కటకటలాడుతుంటే అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా భవన నిర్మాణానికి శుద్ధిచేసిన నీటిని తరలించడం వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. ఈ సమావేశంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌, టీడీపీ అధికారప్రతినిధి పోతనరెడ్డి, జనసేన నేత ప్రసాద్‌, బీజేపీ నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 01:34 AM