Share News

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు

ABN , Publish Date - May 05 , 2024 | 01:56 AM

అదానీ గంగవరం పోర్టు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తోంది.

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు

స్టీల్‌ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయని అదానీ పోర్టు

కార్మికులతో చర్చల పేరుతో కాలయాపన

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

అదానీ గంగవరం పోర్టు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తోంది. నిర్వాసిత కార్మికుల సమ్మె అనే చిన్న కారణం చూపించి పోర్టులో గత 20 రోజులకుపైగా ఆపరేషన్లు నిలిపివేసింది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఇక్కడి నుంచి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా వెళ్లాల్సిన ముడి పదార్థాలన్నీ ఆగిపోయాయి. దాంతో అక్కడ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు అధికారుల సంఘం హైకోర్టును ఆశ్రయించగా, జాతీయ సంపద అయిన స్టీల్‌ ప్లాంటుకు ఇబ్బందులు సృష్టించవద్దని, అంతా సమన్వయంతో పనిచేసి తక్షణమే బొగ్గు, ఇతర ముడి పదార్థాలు సరఫరా చేయాలని పోర్టు యాజమాన్యాన్ని, విశాఖ జిల్లా యంత్రాంగాన్ని, సమ్మె చేస్తున్న కార్మికులను శుక్రవారం ఆదేశించింది. దీంతో శనివారం నుంచి పోర్టులో పనులకు వెళతామని నిర్వాసిత కార్మికులు వెల్లడించారు. శనివారం ఉదయం పలువురు ఉద్యోగులు విధులకు హాజరవుతామని పోర్టు ఉన్నతాధికారులకు సమాచారం పంపితే, తామే కబురు చేస్తామని అంతవరకూ రావద్దని చెప్పినట్టు తెలిసింది. అలాగే నిర్వాసిత కార్మికులను విధుల్లోకి పిలవకుండా చర్చలకు ఆహ్వానించింది. ఈ పరిణామానికి బిత్తరపోయిన కార్మికులు సమావేశం ఏర్పాటు చేసుకొని, తమతో ఏ చర్చలు జరపాలన్నా...కలెక్టర్‌ లేదా సిటీ పోలీస్‌ కమిషనర్‌ మధ్యవర్తిగా ఉండాలని, యాజమాన్యం మాటలను తాము నమ్మలేమని తెలియజేశారు. దాంతో ఆ విధంగానే చర్చలకు ఏర్పాటుచేస్తామని పోర్టు ప్రతినిధులు వారికి తెలిపారు. ఈ చర్చలతోనే శనివారం అంతా గడిచిపోయింది. స్టీల్‌ప్లాంటుకు తక్షణం సాయం అందించే విషయంలో పోర్టు యాజమాన్యం తగు రీతిలో స్పందించకుండా జాప్యం చేయడంపై ఉక్కు వర్గాలు మండిపడుతున్నాయి.

రూ.650 కోట్ల ముడి పదార్థాలు మూలుగుతున్నాయి

అదానీ గంగవరం పోర్టులో స్టీల్‌ప్లాంటుకు చెందిన కోల్‌, లైమ్‌స్టోన్‌ 2.6 లక్షల టన్నులు ఉన్నాయి. వాటిని ఆస్ట్రేలియా, ఇండోనేషియా, అమెరికా, గల్ఫ్‌ దేశాల నుంచి దఫదఫాలుగా దిగుమతి చేసుకున్నారు. వాటి విలువ రూ.650 కోట్లు. ఇవన్నీ పోర్టులో ఉండిపోవడం వల్ల ప్లాంటుకు ముడి పదార్థాల కొరత ఏర్పడి స్టీల్‌ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. రోజుకు 20 వేల టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 3 వేల టన్నులే వస్తోంది. దీనివల్ల స్టీల్‌ప్లాంటు కు భారీ నష్టాలు రానున్నాయి.

ఇది అదానీ కుట్ర

అయోధ్యరామ్‌, ఉక్కు పరిరక్షణ కమిటీ

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును నష్టాల్లోకి నెట్టి అతి తక్కువ ధరకు తీసుకోవాలనే కుట్రలో భాగంగానే అదానీ యాజమాన్యం ఇలా చేస్తోంది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం పక్కనపెట్టింది. కార్మికులను పిలిచే వరకు విధులకు రావద్దని చెబుతోంది. గత 18 రోజులుగా ఇంత నష్టం జరుగుతున్న కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోలేదు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా జోక్యం చేసుకొని తక్షణమే మెటీరియల్‌ అందేలా అదానీని కోరాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇసుక, మాంగనీస్‌, క్వార్ట్జ్‌ సరఫరా ఎలాగూ ఏపీ ప్రభుత్వం ఆపేసింది. కనీసం ఈ పని అయినా చేయాలి.

Updated Date - May 05 , 2024 | 01:56 AM