Share News

గొలుగొండ.. ఒకప్పటి లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం...

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:32 AM

ఒకప్పటి లోక్‌సభ నియోజకవర్గం కేంద్రం ‘గొలుగొండ’ ప్రస్తుతం మండల కేంద్రానికే పరిమితమైంది.

గొలుగొండ.. ఒకప్పటి లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం...

నేడు మండల కేంద్రానికే పరిమితం

గొలుగొండ, ఏప్రిల్‌ 28:

ఒకప్పటి లోక్‌సభ నియోజకవర్గం కేంద్రం ‘గొలుగొండ’ ప్రస్తుతం మండల కేంద్రానికే పరిమితమైంది. 1957లో అనకాపల్లి ప్రాంతమంతా గొలుగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1952లో జరిగిన ఎన్నికల్లో ద్విసభ్య విధానాన్ని అమలు చేయడంతో ఒకరు జనరల్‌ అభ్యర్థి, మరొకరు రిజర్వు అభ్యర్థిని గొలుగొండ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవలసి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున మిస్సుల సూర్యనారాయణమూర్తి (జనరల్‌), అల్లూరి అనుచరుడు కేవీ పడాల్‌ (మల్లుదొర) (ఎస్టీ రిజర్వేషన్‌పై) గెలుపొందారు. 1957లో నియోజకవర్గాల పునర్విభజనలో ప్రస్తుతం ఉన్న అనకాపల్లి ప్రాంతం గొలుగొండ లోక్‌సభ నియోజకవర్గంలో చేరింది. అనంతరం 1962లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో గొలుగొండ స్థానాన్ని రద్దు చేసి, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో చేర్చారు. 2003 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో గొలుగొండ మండలాన్ని అనకాపల్లి లోక్‌సభ స్థానంలో చేర్చారు. అలాగే గతంలో గొలుగొండ చింతపల్లి కేంద్రంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండేది. 2003లో నర్సీపట్నం సెగ్మెంట్‌లోకి మార్చారు.

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో విలీనం అయిన అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బోళెం ముత్యాలపాప, తెలుగుదేశం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఇక్కడి ఓటర్లు మెజారిటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ తరపున పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ పోటీ చేశారు. ఈ మండలంలో వైసీపీ కంటే తెలుగుదేశానికి వెయ్యి మెజారిటీ వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు 14,243 ఓట్లు, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌గణేష్‌కు 18,290 ఓట్లు పడ్డాయి. మండలంలో వైసీపీకి 4,047 మెజారిటీ లభించింది.

Updated Date - Apr 29 , 2024 | 01:32 AM