Share News

జగనాసుర పాలనను అంతమొందించండి

ABN , Publish Date - May 05 , 2024 | 01:53 AM

రాష్ట్రంలో జగనాసుర పాలనను ఓటు అనే ఆయుధంతో అంతమొందించాలని ప్రజలకు నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

జగనాసుర పాలనను అంతమొందించండి

  • ఓటు అనే ఆయుధం ఉపయోగించండి

  • నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపు

  • ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి నిల్‌

  • రైతులను, నిరుద్యోగులను మోసం చేశారు

  • ఎస్సీ, ఎస్టీలకు పథకాలను రద్దు చేశారు

  • వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి

  • ఎలమంచిలి, కొత్తకోటల్లో రోడ్డు షో

  • అడుగడుగునా ప్రజల ఘన స్వాగతం

రావికమతం/ఎలమంచిలి, మే 4:

రాష్ట్రంలో జగనాసుర పాలనను ఓటు అనే ఆయుధంతో అంతమొందించాలని ప్రజలకు నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం ఆయన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి, రావికమతం మండలం కొత్తకోట గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు. బాలకృష్ణకు అడుగడుగునా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పెద్దఎత్తున పూల వర్షం కురిపించారు. జై బాలయ్య, జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రజా ధనాన్ని దోచుకున్నారన్నారు. ఈ రావణ జగనాసురుడిని ఈ ఎన్నికల్లో ఓటు ఆయుధంతో అంతమొందించకుంటే తెలుగుజాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. పొదుపుతో డ్వాక్రా మహిళలు ప్రపంచ ఖ్యాతి పొందేలా చంద్రబాబు తీర్చిదిద్దితే...నేడు జగన్‌రెడ్డి తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరిపై రూ.5 లక్షల అప్పు చేశాడన్నారు. అభివృద్ధిని విస్మరించి, ప్రతిపక్షాలపై అక్రమ కేసుల బనాయింపుతోనే ఐదేళ్లు గడిపేశారన్నారు. రైతులను, యువతను, నిరుద్యోగులను మోసం చేశారని బాలకృష్ణ ఆరోపించారు. చివరకు తల్లి, చెల్లికి కూడా అన్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో ఎస్సీల కోసం అమలు చేసిన 25 పథకాలను రద్దు చేశారన్నారు. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను మోయలేని భారం మోపారని దుయ్యపట్టారు. ఏ గ్రామంలోనైనా ఒక సీసీ రోడ్డు అయినా నిర్మించారా?...అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యకు నోచుకోకుండా చేశారన్నారు. అవన్నీ మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే సాకారం అవుతాయన్నారు. జగన్‌ పాలనలో ఇబ్బందులు, అక్రమ కేసులకు గురైన వారికి త్వరలో మంచి రోజులు రానున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా సీఏం రమేశ్‌ను, చోడవరం ఎమ్మెల్యేగా కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు, టీడీపీ నేత గూనూరు మల్లునాయుడు, నియోజకవర్గ తెలుగు మహిళ అఽధ్యక్షురాలు కోట నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు రాజాన కొండనాయుడు, గల్లా రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 01:53 AM