Share News

భవన నిర్మాణాలకు తాగునీరా!?

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:27 AM

మన జేబులు నిండితే చాలు, జనం ఏమైపోయినా పర్వాలేదన్నట్టు...అన్నట్టుగా ఉంది జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారుల తీరు.

భవన నిర్మాణాలకు తాగునీరా!?

ఇనార్బిట్‌మాల్‌ సేవలో జీవీఎంసీ

ప్రతిరోజూ రెండు లక్షల లీటర్లు కేటాయింపు

భవన నిర్మాణాలకు శుద్ధి చేసిన నీరు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం

అయినా ఆరు నెలలుగా కొనసాగుతున్న సరఫరా

అధికారులకు భారీగా మామూళ్లు అందడమే కారణమని ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మన జేబులు నిండితే చాలు, జనం ఏమైపోయినా పర్వాలేదన్నట్టు...అన్నట్టుగా ఉంది జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారుల తీరు. ప్రజలకు సరఫరా చేయాల్సిన నీటిని భవన నిర్మాణ పనులకు ఇచ్చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఇప్పటికే నగరంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. అయినప్పటికీ కైలాసపురంలో నిర్మాణంలో ఉన్న ఒక భారీ వాణిజ్య సముదాయానికి అధికారులు గత ఆరు నెలలుగా ప్రతిరోజూ రెండు లక్షల లీటర్ల నీటిని కేటాయిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో తాగునీటి కోసం ప్రతిరోజూ 64 మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. ఆ మేరకు నీటిని ఏలేరు, తాటిపూడి, రైవాడ రిజర్వాయర్ల నుంచి నగరానికి తీసుకొస్తున్నారు. కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌, ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లలో శుద్ధి చేసి నగరంలోని వివిధ ప్రాంతాలకు కొళాయిల ద్వారా సరఫరా చేస్తుంటారు. కొళాయి సదుపాయం లేని ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జిలు, అపార్టుమెంట్లకు తాగునీరు అవసరమైతే ట్యాంకర్లతో సరఫరా చేసేందుకు వీలుగా ద్వారకా నగర్‌లోని టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ప్రతిరోజూ మూడు లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. ఆ నీటిని జీవీఎంసీకి చెందిన ట్యాంకర్లతోపాటు ప్రైవేటు ట్యాంకర్లతో అవసరమైన వారికి సరఫరా చేస్తుంటారు. శుద్ధి చేసిన నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని జీవీఎంసీ అధికారులు ట్యాంకర్లతో నీటిని తీసుకువెళ్లే వారికి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌ నుంచి తీసుకువెళుతున్న శుద్ధి చేసిన నీటిని కొంతమంది ఇతర అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కైలాసపురంలో నిర్మాణంలో ఉన్న భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ (ఇనార్బిట్‌ మాల్‌) నిర్మాణ పనులకు టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ నుంచి శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్లతో తరలిస్తున్నారని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంప్లెక్స్‌ నిర్మాణ పనుల్లో గోడలు, శ్లాబులు తడిపేందుకు నిత్యం టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ రిజర్వాయర్‌ నుంచి రెండు లక్షల లీటర్ల నీటిని తీసుకుపోతున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరు ట్యాంకర్లతో రెండు లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీటిని తీసుకుపోతున్నారు. అది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికారులు అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా 30 వేల లీటర్లు నీరు భవన నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తాగేందుకు అంటూ రూ.1200 చలాన్‌ మాత్రమే తీసి, దానిపైనే రెండు లక్షల లీటర్ల నీటిని తరలించుకుపోతున్నారని నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న సిబ్బందే చెబుతున్నారు. ఒకవేళ భవన నిర్మాణదారులు నిర్మాణ పనులకు జీవీఎంసీ నుంచి నీరు తీసుకోదలిస్తే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు తగిన ఫీజులు కట్టించుకుని, ప్రధాన రిజర్వాయర్ల నుంచి తీసుకొచ్చిన రా వాటర్‌ (శుద్ధి చేయని నీరు)ని సరఫరా చేస్తుంది. కానీ కైలాసపురంలో నిర్మాణంలో ఉన్న భారీ షాపింగ్‌మాల్‌కు మాత్రం ఎంతో ఖర్చుపెట్టి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి ప్రారంభమైన తర్వాత ఒకపక్క తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతుంటే, అధికారులు ఆ సమస్యను పట్టించుకోకుండా తాగడానికి పనికొచ్చే నీటిని భవన నిర్మాణ పనులకు కేటాయించడం విడ్డూరంగా ఉంది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు ముట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భవన నిర్మాణ పనులకు వాడకూడదు

శేఖర్‌, నీటి సరఫరా విభాగం ఈఈ

టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ నుంచి తీసుకువెళ్లే నీటిని తాగునీటి అవసరాలకు తప్ప భవన నిర్మాణ పనులకు వాడకూడదు. కైలాసపురంలో నిర్మాణంలో ఉన్న షాపింగ్‌మాల్‌ ప్రతినిధులు తమ సిబ్బంది తాగడానికి అని చెప్పి గత ఆరు నెలలుగా ప్రతి రోజూ 30 వేల లీటర్ల నీటిని తీసుకువెళుతున్నారు. కానీ అనధికారికంగా మరికొన్ని ట్యాంకర్లు వెళుతున్నట్టు తెలిసింది. దీనిపై మేము అక్కడకు వెళ్లి ప్రశ్నిస్తే మాపై తిరగబడడంతో ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశాం. ఇప్పుడు దీనిపై మరోసారి చర్చ జరుగుతుండడంతో నీటి సరఫరాను నిలిపివేయడంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

Updated Date - Apr 29 , 2024 | 01:27 AM