Share News

సచివాలయాలకు రప్పించకుండా పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:27 AM

సామాజిక పింఛన్ల లబ్ధిదారులను గ్రామ సచివాలయాకు రప్పించకుండానే పింఛన్ల సొమ్ము అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌ సూచించారు. సామాజిక పింఛన్లపై శనివారం జిల్లా కలెక్టర్లు, డీఆర్‌డీఏ పీడీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శశిభూషణ్‌కుమార్‌, రావత్‌ మాట్లాడారు.

సచివాలయాలకు రప్పించకుండా పింఛన్ల పంపిణీ
రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ విజయసునీత, పక్కన డీఆర్‌డీఏ పీడీ మురళి

- రాష్ట్ర అధికారుల సూచన

పాడేరు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్ల లబ్ధిదారులను గ్రామ సచివాలయాకు రప్పించకుండానే పింఛన్ల సొమ్ము అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌ సూచించారు. సామాజిక పింఛన్లపై శనివారం జిల్లా కలెక్టర్లు, డీఆర్‌డీఏ పీడీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శశిభూషణ్‌కుమార్‌, రావత్‌ మాట్లాడారు. పింఛన్‌ సొమ్మును డీబీటీ పద్ధతిలో లబ్ధిదారుల ఖాతాల్లోనే పడేలా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆధార్‌ ఆధారంగా ఖాతాల్లో వేయడం, ఇప్పటికే ఖాతా నంబర్‌ మ్యాపింగ్‌ జరిగితే అందులోనే జమచేయడం వంటి చర్యలతో సొమ్మును అందించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకూడదని, మే, జూన్‌ నెలల పింఛన్లను సైతం ఇదే పద్ధతిలో అందించేందుకు సిద్ధం కావాలన్నారు. మే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తికావాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.విజయసునీత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళీ, సచివాలయాల సమన్వయకర్త కె.సునీల్‌ పాల్గొన్నారు.

గత నెల స్ఫూర్తితో పింఛన్ల పంపిణీ

జిల్లాలో గత నెలలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో(99.18శాతం) రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని, అదే స్ఫూర్తితో వచ్చే నెల పింఛన్ల పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఎం.విజయసునీత అన్నారు. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారులు ఒక లక్షా 26 వేల 773 మంది ఉన్నారన్నారు. అలాగే మెడికల్‌ పింఛన్‌దారులు 1,121 మందిలో కలిపి మొత్తం లక్షా 27 వేల 894 మంది పింఛన్‌ లబ్ధిదారులున్నారన్నారు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత సులభతరంగా పింఛన్ల సొమ్మును అందించాలని కలెక్టర్‌ విజయసునీత సూచించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:27 AM