Share News

రక్తదాతలు కావలెను!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:48 AM

దాతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో రక్తనిల్వలు తగ్గిపోతున్నాయి.

రక్తదాతలు కావలెను!

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో తగ్గుతున్న నిల్వలు

ప్రతి నెలా 100కి పైగా యూనిట్ల రక్తం అవసరం

కేంద్రంలో ప్రస్తుతం అందుబాటులో 16 యూనిట్లు!

దాతలు ముందుకు రావాలని అధికారులు వినతి

నర్సీపట్నం, ఏప్రిల్‌ 15:

దాతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో రక్తనిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో 16 యూనిట్లు మాత్రమే రక్తం నిల్వ ఉండగా ప్రతినెలా వందకు పైగా రక్తం యూనిట్లు అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో నర్సీపట్నం మునిసిపాలిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన దాతలు స్పందించి ప్రాణదాతలు కావాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నీలవేణి కోరుతున్నారు.

ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వివిధ ప్రాంతాలకు చెందిన రోగుల తాకిడి ఉంటుంది. వీరిలో రక్తం అవసరమైన వారు ఎక్కువమందే ఉంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా సుమారు 100 యూనిట్ల రక్తం అవసరమవుతుంటుంది. ప్రస్తుతం కేంద్రంలో కేవలం 16 యూనిట్లు మాత్రమే రక్తనిల్వలు ఉండడంతో అత్యవసరమైన రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిలో ఓ పాజిటివ్‌ 4, బీ పాజిటివ్‌ 11, ఏబీ నెగెటివ్‌ ఒక యూనిట్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏ పాజిటివ్‌, ఏబీ పాజిటివ్‌, ఓ నెగెటివ్‌, బి నెగెటివ్‌, ఏ నెగెటివ్‌, ఏబీ పాజిటివ్‌ గ్రూప్‌ రక్తం లేదు. అత్యవసరమైన రోగుల బంధువులు డోనర్‌ని తెచ్చుకుంటే అందిస్తున్నారు. ప్రైవేటుగా కొనుగోలు చేయాలంటే ఒక్కో యూనిట్‌ రూ.1,100కు విక్రయిస్తున్నారు. అదీ డోనర్‌ నుంచి రక్తం తీసుకుని మాత్రమే అందిస్తున్నారు.

ఏరియా ఆస్పత్రిలోని గర్భిణులు, రోడ్డు ప్రమాదాలలో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులు, రక్తహీనత గల రోగులకు, తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా రోగులకు రక్తం అందిస్తున్నారు. గత ఏడాది 908 మందికి రక్తం అందించగా ఈ ఏడాది జనవరిలో 106, ఫిబ్రవరిలో 100, మార్చిలో 84 మందికి రక్తం సరఫరా చేసి ప్రాణాలను కాపాడారు.

వేసవి, ఎన్నికల ఎఫెక్ట్‌

ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో రక్తం కొరత ఏర్పడుతుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవడంతో దాతల కొరత నెలకొంటోంది. ఈ ఏడాది ఎన్నికల హడావిడి కావడంతో రాజకీయ నాయకులు బ్లడ్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయడం లేదు. ఎన్నికల ప్రచారంలో ఉండిపోవడంతో సాధారణ రక్తదాతలు ముందుకు రావడం లేదు. దీంతో ఏరియా ఆస్పత్రిలోని కేంద్రంలో రక్త నిల్వలు తరిగిపోతున్నాయి. స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం కొరతను తీర్చాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణి దేవి కోరుతున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:48 AM