Share News

పడకేసిన పనులు

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:45 AM

జిల్లాలో ప్రభుత్వ నూతన భవన నిర్మాణాలు పడకేశాయి. చేసిన పనులకు ప్రభుత్వం నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.

పడకేసిన పనులు

నాలుగేళ్లయినా పూర్తికాని సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవనాలు

460 సచివాలయాలకు 342కి మాత్రమే వసతి

రూ.140 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌

రూ.124 కోట్లు మాత్రమే చెల్లింపులు

డిసెంబరు నుంచి కదలిక లేని పనులు

362 ఆర్‌బీకేలు.. 213 భవనాలు పూర్తి

రూ.53 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌.. రూ.12 కోట్లు పెండింగ్‌

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవనాలకు రూ.32 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌

గత డిసెంబరు వరకు రూ.17 కోట్లు మాత్రమే చెల్లింపు

బిల్లులు రాకపోవడంతో ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆపేసిన కాంట్రాక్టర్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ నూతన భవన నిర్మాణాలు పడకేశాయి. చేసిన పనులకు ప్రభుత్వం నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా గ్రామ/ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు భవనాలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా వున్నాయి. ఈ మూడు శాఖల భవనాలకు సంబంధించి సుమారు రూ.45 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో వున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో బిల్లుల క్లియరెన్స్‌పై కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన గ్రామ/ వార్డు సచివాలయాల్లో చాలా వాటికి ఇంతవరకు పూర్తిస్థాయిలో సొంత గూడు సమకూరలేదు. అదే విధంగా రైతులకు అన్ని రకాల సేవలు ఒకేచోట అందుబాటులోకి తీసుకువస్తామంటూ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నూతన భవన నిర్మాణాల పరిస్థితి కూడా ఇదే విధంగా వుంది. ఆరోగ్య ఉప కేంద్రాల స్థానంలో ఏర్పాటు చేస్తున్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవనాలు చాలా వరకు అసంపూర్తిగానే వుండిపోయాయి. సుమారు నాలుగేళ్ల క్రితం భవనాలు మంజూరుకాగా.. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు నత్తనడకన సాగించారు. చాలాచోట్ల నెలల తరబడి పునాదులు, పిల్లర్ల దశలోనే వుండిపోయాయి. భవన నిర్మాణాల జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, పనులు పూర్తి చేసేందుకు గడువులు విధించినా... కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో భవన నిర్మాణ పనులు పడకేశాయి.

సచివాలయాల భవనాలు..

జిల్లాలో 460 గ్రామ/ వార్డు సచివాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.40 లక్షలు చొప్పున కేటాయించారు. ఏడాదిలో పనులు పూర్తి చేసి భవనాలు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ భావన. కానీ నాలుగేళ్లు దాటినప్పటికీ ఇంతవరకు 342 భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లు రూ.140 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి, బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. కానీ గత ఏడాది డిసెంబరు వరకు రూ.124 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.16 కోట్ల మేర కాంట్రాక్టర్లకు అందాల్సి వుంది. బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో ఎక్కడికక్కడ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

రైతు భరోసా కేంద్రాలు..

జిల్లాలో 362 రైతు భరోసా కేంద్రాలకు భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రతి భవన నిర్మాణానికి రూ.21.8 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 213 భవన నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇంకా 149 భవన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు రూ.53 కోట్ల మేర బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. ఇంతవరకు రూ.41 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. రూ.12 కోట్లు విడుదల కాకపోవడంతో ఈ ఏడాది జనవరి నుంచి పనులు నిలిచిపోయాయి.

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు...

జిల్లాలో 297 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకుగాను 143 క్లినిక్‌ల భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో 154 భవన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.20.89 లక్షలు అంచనా వ్యయం అవుతుందని నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు రూ.32 కోట్ల మేర బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. గత ఏడాది డిసెంబరు వరకు రూ.17 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.15 కోట్ల మేర బిల్లులు నిలిచిపోయాయి. నిధులు ఎప్పుడు విడుదల అవుతాయన్న దానిపై అధికారులకు కూడా స్పష్టత లేదు. పనులు పర్యవేక్షించిన సంబంధిత పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లు ఎన్నికల విధుల్లో ఉండడంతో భవన నిర్మాణ పనుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా జిల్లాలో ప్రభుత్వ శాఖల భవన నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంపై పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ వీరన్నాయుడును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఎన్నికల షెడ్యూల్‌ కారణంగా నిర్మాణ పనులు ఆగిన మాట వాస్తవమేనన్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఎం.బుక్‌ ప్రకారం సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశామని చెప్పారు. ఒకింత ఆలస్యం అయినప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరుగుతాయని ఆయన తెలిపారు

Updated Date - Apr 16 , 2024 | 01:45 AM