Share News

- భారీగా పడిపోయిన బెల్లం దిగుమతి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:59 AM

దేశంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్‌గా పేరొందిన అనకాపల్లి మార్కెట్‌ నేడు వెలవెలబోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఏటా చెరకు పంట విస్తీర్ణం తగ్గిపోయి బెల్లం దిగుమతులు పడిపోయాయి. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ.. చెరకు రైతులకు చేసిందేమీ లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2018-19 సీజన్‌లో అనకాపల్లి మార్కెట్‌కు 22,23,746 బెల్లం దిమ్మలు రాగా, 2023-24 సంవత్సరం సీజన్‌లో 7,52,457 దిమ్మలు మాత్రమే దిగుమతి అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెల్లం రైతులను ఆదుకుంటామని గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- భారీగా పడిపోయిన బెల్లం  దిగుమతి
అరకొరగా ప్లాట్‌ఫారంపై ఉన్న బెల్లం దిమ్మలు బెల్లం మార్కెట్‌ డీలా

జిల్లాలో తగ్గిన చెరకు విస్తీర్ణం

- షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడడం, బెల్లం తయారీ లాభసాటిగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్న రైతులు

- బెల్లం రైతులను ఆదుకుంటామని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ

- అధికారంలోకి వచ్చాక పట్టించుకోని వైనం

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 29: దేశంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్‌గా పేరొందిన అనకాపల్లి మార్కెట్‌ నేడు వెలవెలబోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఏటా చెరకు పంట విస్తీర్ణం తగ్గిపోయి బెల్లం దిగుమతులు పడిపోయాయి. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ.. చెరకు రైతులకు చేసిందేమీ లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2018-19 సీజన్‌లో అనకాపల్లి మార్కెట్‌కు 22,23,746 బెల్లం దిమ్మలు రాగా, 2023-24 సంవత్సరం సీజన్‌లో 7,52,457 దిమ్మలు మాత్రమే దిగుమతి అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెల్లం రైతులను ఆదుకుంటామని గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల జిల్లాలో చెరకు పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. 2018-19 సీజన్‌లో జిల్లాలో 31,514 హెక్టార్లల్లో రైతులు చెరకును పండించే వారు. ప్రస్తుతం ఈ పంట 8,450 హెక్టార్లకు పడిపోయింది. ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, చెరకుకు తెగుళ్లు సోకడంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు చెరకు పంట వేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

దీనికి తోడు బెల్లం ధరలు కూడా ఆశాజనకంగా లేవు. పండిన చెరకును చక్కెర కర్మాగారాలకు రవాణా చేయాలనుకుంటే ఇటు తుమ్మపాల, అటు ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. గోవాడ చక్కెర కర్మాగారం ఒకప్పుడు ఐదు లక్షల టన్నుల చెరకును క్రషింగ్‌ చేయగా, ప్రస్తుతం రెండు లక్షలకే పరిమితమైంది. టన్ను చెరకుతో బెల్లం తయారు చేస్తే వంద కి లోల బెల్లం వస్తుంది. అయితే దీనికి అయ్యే ఖర్చు సుమారు రెండు వేల రూపాయల వరకు అవుతుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌కు ఈ బెల్లాన్ని రవాణా చేస్తే వంద కిలోలకు రూ.3,400లు నుంచి రూ.3,600లు వరకు వస్తుంది. ఖర్చులు పోను ఏడాదిలో కేవలం రూ.1500 నుంచి రూ.2000 వేలు వరకు మాత్రమే ఆదాయం లభించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చెరకు పంట దిగుబడులు బాగా పడిపోవడంతో రైతులు సరుగుడు, యూకలిప్టస్‌ పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అనకాపల్లి మార్కెట్‌కు చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి రైతులు బెల్లాన్ని అధికంగా దిగుమతి చేసేవారు. ప్రస్తుతం ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గ ప్రాంతాల నుంచే ఎక్కువగా బెల్లం దిగుమతి అవుతోంది. మార్కెట్‌కు ఐదేళ్ల క్రితం రోజుకి 12 నుంచి 15 వేల దిమ్మలు వరకు దిగుమతి అయ్యేవి. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం రెండు రోజుల మార్కెట్‌కు సుమారు 25 వేల దిమ్మలు వరకు దిగుమతి అయ్యేవి. ఈ ఐదేళ్ల కాలం నుంచి చూస్తే ఒక రోజులో పది వేల దిమ్మల దిగుమతి దాటిన దాఖలాలు లేవు. రెండు రోజుల మార్కెట్‌ కూడా 15వేల లోపు బెల్లం దిమ్మలు దిగమతి అయ్యేవి. ఈ కారణంగా అటు రైతులతో పాటు వేతనం గిట్టుబాటు కాక ఇటు కొలగార్లు, కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

సీజన్‌ వారీగా బెల్లం దిమ్మల దిగుమతి, కమిటీకి వచ్చిన ఆదాయ వివరాలు

సీజన్‌ దిమ్మలు కమిటీకి ఆదాయం

2018-19 22,23,746 91.08 లక్షలు

2019-20 16,86,458 78.74 లక్షలు

2020-21 16,64,840 77.53 లక్షలు

2021-22 14,21,277 83.40లక్షలు

2022-23 9,99,475 47.51లక్షలు

2023-24 7,52,457 42.12లక్షలు

Updated Date - Apr 30 , 2024 | 12:59 AM