Share News

స్థానికసంస్థలతోనే తొలిఅడుగు

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:57 PM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చట్టసభల్లో ప్రవేశించిన పలువురు తొలుత స్థానిక సంస్థల్లో వివిధ రకాల పదవులు అలంకంచారు. తొలి అడుగు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల నుంచే పడింది. శాసనసభకు ఎన్నికై మంత్రులుగా కూడా ప్రాతినిధ్యం వహించారు. జడ్పీ చైర్మన్లగా పనిచేసిన పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులను సైతం అలంకరించారు. విజయనగరం జిల్లా ఏర్పాటు కాక ముందు ఆ ప్రాంతం కూడా శ్రీకాకుళం జిల్లాలో అంతర్భాగంగానే ఉండేది. అక్కడి ప్రజాప్రతినిధులు కూడా తొలుత స్థానిక సంస్థల్లోనే ప్రాతినిధ్యం వహించారు.

స్థానికసంస్థలతోనే తొలిఅడుగు

(రణస్థలం)

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చట్టసభల్లో ప్రవేశించిన పలువురు తొలుత స్థానిక సంస్థల్లో వివిధ రకాల పదవులు అలంకంచారు. తొలి అడుగు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల నుంచే పడింది. శాసనసభకు ఎన్నికై మంత్రులుగా కూడా ప్రాతినిధ్యం వహించారు. జడ్పీ చైర్మన్లగా పనిచేసిన పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులను సైతం అలంకరించారు. విజయనగరం జిల్లా ఏర్పాటు కాక ముందు ఆ ప్రాంతం కూడా శ్రీకాకుళం జిల్లాలో అంతర్భాగంగానే ఉండేది. అక్కడి ప్రజాప్రతినిధులు కూడా తొలుత స్థానిక సంస్థల్లోనే ప్రాతినిధ్యం వహించారు.

ఏకకాలంలో జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేగా ఎన్నిక..

ఫ శ్రీకాకుళం జడ్పీకి తొలి చైౖర్మన్‌గా బెండి కూర్మన్న 1960-62లో పనిచేశారు. అదే సమయంలో ఆయన శాసనసభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఏకకాలంలో జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

ఫ ప్రస్తుత విజయనగరం జిల్లా తెర్లాం ప్రాంతానికి చెందిన వాసిరెడ్డి కష్ణమూర్తినాయుడు 1963-64లో ఏడాది పాటు శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తెర్లాం నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సుదీర్ఘకాలం మంత్రిగా సేవలందించారు. అతి కీలక మైన ఇరిగేషన్‌, హోం శాఖలను చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారు. ఆయన కృషి ఫలితం గానే బొబ్బిలిలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటైంది. ఇటీవల వరకు శ్రీకాకుళం జిల్లా ఇరిగేషన్‌ కార్యాలయం కూడా బొబ్బిలి ఎస్‌ఈ సర్కిల్‌ పరిధిలోనే ఉండేది.

ఫ రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన గొర్లె శ్రీరాములునాయుడు 1964-69, 1970-74, 1981-83 మధ్య శ్రీకాకుళం జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై ఇరిగేషన్‌శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉండగానే మడ్డువలస ప్రాజెక్ట్‌కు పునాది రాయిపడింది. ఆ తర్వాత 1983లో టీడీపీ ప్రభంజనంలో చీపురుపల్లి నుంచి శ్రీరాములునాయుడు పోటీచేసి త్రిపురాన వెంకటరత్నం (టీడీపీ) చేతిలో ఓడిపోయారు.

ఫ 1974-76, 2006-11 మధ్యలో రెండుసార్లు జడ్పీ చైౖర్మన్‌గా పని చేసిన పాలవలస రాజశేఖరం 1994లో ఉణుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 37 నియోజకవర్గాల్లో 36 స్థానాల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించగా, కేవలం ఉణుకూరులోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. రాజ్యసభ సభ్యునిగా కూడా రాజశేఖరం వ్యవహరించారు.

ఫ జలుమూరు మండలం అచ్యుతాపురానికి చెందిన బగ్గు లక్ష్మణరావు 1983-85లో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1994లో నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఫ జడ్పీచైర్‌పర్సన్‌గా డాక్టర్‌ కిమిడి మృణాళిని 1987-92, 1995-2000 మధ్య ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో మూడేళ్లపాటు మంత్రిగా వ్యవహరించారు.

మరికొందరు నేతలు..

జిల్లాలో పలువురు నేతలు స్థానిక సంస్థలతోనే రాజకీయ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికాకముందు సర్పంచ్‌, ఎంపీపీ, తదితర పదవులు అలంకరించారు.

ఫ శ్రీకాకుళం ఎంపీగా, టెక్కలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హనుమంతు అప్పయ్యదొర వజ్రపుకొత్తూరు బెండి సర్పంచ్‌గా పనిచేశారు. ఫ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పోలాకి మండలం మబగాం సర్పంచ్‌గా, పోలాకి ఎంపీపీగా పనిచేశారు. ఫ ఆమదాలవలస నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూన రవికుమార్‌ పొందూరు ఎంపీపీ, జడ్పీటీసీగా వ్యవహరించారు. ఫ శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మునిసిపల్‌ వైస్‌చైౖర్‌పర్సన్‌గా పనిచేశారు. ఫశ్రీకాకుళం మునిసిపల్‌ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా పసగాడ సూర్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహించారు. ఫ ఆమదాలవలసకు రెండుసార్లు శాసనసభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించిన బొడ్డేపల్లి సత్యవతి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఫ జి.సిగడాం మండలం ఆర్సీహెచ్‌ అగ్రహరం సర్పంచ్‌గా, జి.సిగడాం ఎంపీపీగా పనిచేసిన మీసాల నీలకంఠంనాయుడు ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

Updated Date - Apr 29 , 2024 | 11:57 PM