Share News

అంతా.. తుస్‌..

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:12 AM

‘గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇప్పుడు ఇంకొన్ని హామీలు అమలు చేస్తామంటే ఎట్టా నమ్మేది’ అని వైసీపీ మేనిఫెస్టోపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరిని కదిలించినా.. ఏ ఉద్యోగివద్ద రాష్ట్ర ప్రభుత్వం గురించి చర్చించినా... వైసీపీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతా.. తుస్‌..

- తొలి ఇచ్చిన హామీలకే దిక్కులేదు

- సీపీఎస్‌ రద్దు సంగతి మరిచిన సీఎం

- పేరుకే.. పోలీసులకు వీక్లీ ఆఫ్‌

- ఉద్యోగ, ఉపాధ్యాయులకు 150 డీఏలు బకాయి

- పీఎఫ్‌ నిధుల చెల్లింపులోనూ జాప్యం

- వైసీపీ మేనిఫెస్టోపై ఉద్యోగ సంఘాల మండిపాటు

- ఓట్ల రూపంలో బుద్ధి చెబుతామంటూ నిర్ణయం

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ఇచ్ఛాపురం)

‘గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇప్పుడు ఇంకొన్ని హామీలు అమలు చేస్తామంటే ఎట్టా నమ్మేది’ అని వైసీపీ మేనిఫెస్టోపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరిని కదిలించినా.. ఏ ఉద్యోగివద్ద రాష్ట్ర ప్రభుత్వం గురించి చర్చించినా... వైసీపీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు, పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు కాలేదని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏలు బకాయిలు పేరుకు పోయాయని, పీఎఫ్‌ నిధుల చెల్లింపులోనూ జాప్యం నెలకొందని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా.. ఉద్యోగ సంఘాలు సైతం ప్రభుత్వంపైనా.. రాజకీయనాయకులపై విమర్శలు చేసేందుకు వీళ్లేదు. వారి చేసేది విమర్శలు కాకున్నప్పటికీ... రాజకీయ కారణంగా వ్యాఖ్యలకు దురుద్దేశం ఆపాదించి సస్పెన్షన్‌ వేటు వేయిస్తారేమో అన్న కారణంతో పేర్లు ప్రస్తావించకుండా వారి సమస్యలను మాత్రం పంచుకుంటున్నారు. ఉద్యోగుల కోసం ఎంతో శ్రద్ధచూపించినట్లు చెబుతున్నట్లుగా వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై పెదవి విరుస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలంతా ఓట్ల రూపంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

- తొలి ఇచ్చిన హామీ ‘వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు’...

పాదయాత్ర సమయంలో.. 2019 ఎన్నికల ప్రచారంలో.. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మాటిచ్చే వెనక్కి తగ్గేది లేదని, ప్రధానంగా ఉద్యోగులను వేధిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగులంతా వైసీపీకి అండగా నిలిచారు. వైసీపీ పాలనకు ఐదేళ్లు గడిచిపోయింది. కానీ ఇంతవరకూ సీపీఎస్‌ రద్దు చేయలేకపోయారు. పైగా సీపీఎస్‌ కోసం ఉద్యమాలు పట్టిన ఉద్యోగులపై ఈ ప్రభుత్వ హయాంలో వేధింపులు అధికమయ్యాయి. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో సీపీఎస్‌ రద్దు ప్రస్తావన లేదని ఉద్యోగులు అసంతృప్తి చెందుతున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనివారికి.. ఈ ఎన్నికల్లో బదులివ్వాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు.

- బిల్లుల కోసం నాలుగేళ్లు నరకయాతన..

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు సమస్యలు తీవ్రమయ్యాయి. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఏళ్లతరబడి నిరీక్షించేలా చేశారు. ఏపీజీఎల్‌ఐ వంటి క్లయిమ్‌ల కోసం నిరీక్షలు తప్పలేదు. ఎర్నల్‌ లీవ్‌(సంపాదిత సెలవులు)లను నగదు రూపంలో ఉద్యోగులకు మార్చుకునేందుకు మూడేళ్లు పట్టింది. సకాలంలో చెల్లింపులు లేవు. గత ప్రభుత్వంలో ఈ సమస్యలు లేవు. ఎన్నికల ముంగిట.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో మాత్రమే కొంతమందికి డబ్బులు చెల్లించారు. ఉపాధ్యాయులకు జీవో 117 ఇబ్బంది కరంగా ఉంది. దీనిద్వారా భారాన్ని తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు. అన్నింటికంటే మించి ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు.. ఈ విషయాన్ని ప్రభుత్వమే మరిచిపోయంది. ఏకంగా 150 డీఏలు బకాయి ఉన్నాయి. గత ప్రభుత్వంలో మెరుగైన పీఆర్సీ ఉండేది. ఇప్పుడు పీఆర్సీ గురించే చర్చలేదు. బకాయిలు చెల్లిస్తామన్న హామీకూడాలేదు. ఉద్యోగ సంక్షేమం అంతా తూచ్‌ అని మండిపడుతున్నారు. తమను ఇంతలా ఇబ్బందిపెట్టి.. ఇప్పుడు మేనిఫెస్టోలో ఆశ చూపినంత మాత్రాన నిర్ణయం మారిపోదని.. సైలెంట్‌గా మా బదులు కూడా ఉంటుందని కొంతమంది ఉద్యోగులు వెల్లడించారు.

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ మున్నాళ్ల ముచ్చటే..

పోలీసులు సెలవులు లేకుండా విధులు నిర్వహించేవారు. పోలీసులకు కూడా ఇతర ప్రభుత్వ శాఖల మాదిరి వీక్లీఆఫ్‌ అమలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాస్థాయి అధికారుల నుంచి కానిస్టేబుల్‌ వరకూ వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని చెప్పడంతో సంతోషించారు. కాగా.. కొన్ని నెలలు వీక్లీఆఫ్‌లు అమలుచేసి.. తర్వాత ఎత్తేసింది. దీంతో మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. జిల్లాలో 1,520 మందికిపైగా పోలీస్‌ శాఖలో పనిచేస్తున్నారు. వీరితో పాటు ఏఆర్‌ కానిస్టేబుల్స్‌ 370 మందికి పైగా విధుల్లో ఉన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అధికారిక సెలవులు, వారాంతపు సెలవులు, పండుగల సెలవులు ఉన్నా.. పోలీస్‌ శాఖలో మాత్రం వాటిని పొందే అవకాశం ఉండదు. నిత్యం పని ఒత్తిడితో మునిగి తేలే తమకు కూడా వారాంతపు సెలవులు ఇవ్వాలంటూ పోలీస్‌ శాఖలో చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. 2019 ఎన్నికల సమయంలో నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌.. తాము అధికారంలోకి వస్తే పోలీసులకు వారాంతపు సెలవు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పోలీసులు సైతం గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీక్లీ ఆఫ్‌లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పది నెలలు అమలు చేసి.. మళ్లీ ఎత్తేశారు. దీంతో పోలీసులంతా మరింత ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ.. ఇబ్బందులు పడుతున్నారు. వీక్లీ ఆఫ్‌ ప్రకటనల్లోనే తప్ప.. ఆచరణకు నోచుకోవడం లేదని.. ఇబ్బందులను బయటకు చెప్పుకోలేని పరిస్థితి తమదంటూ పోలీసులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:12 AM