Share News

వైసీపీ పాలనలో అన్నింటా మోసం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:08 AM

‘వైసీపీ పాలనలో అంతా మోసమే. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం. ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించి.. గెలిపించండి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు.

వైసీపీ పాలనలో అన్నింటా మోసం
సభలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

- కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

- పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

టెక్కలి, ఏప్రిల్‌ 28: ‘వైసీపీ పాలనలో అంతా మోసమే. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం. ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆశీర్వదించి.. గెలిపించండి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా ఆదివారం టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో నిర్వహించిన ప్రచారసభలో ఆమె మాట్లాడారు. ‘శ్రీకాకుళం పరిధిలో వంశధార ప్రాజెక్టు పూర్తిచేస్తానని మాట ఇచ్చి విస్మరించారు. టెక్కలి, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఆఫ్‌షోర్‌ ప్రాజెక్ట్‌ను.. రాజశేఖరరెడ్డి కొడుకుగా పూర్తిచేస్తానని చెప్పారు. కానీ ఇంతవరకూ పనుల పూర్తికాలేదు. సీఎం జగన్‌ ఇన్నాళ్లూ ప్రజల వద్దకు రాలేదు. కనీసం తోటి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు ప్రభుత్వం.. సొమ్ములు జమచేయలేదు. దీంతో వారి సర్టిఫికెట్లు విద్యాసంస్థలు అంటిపెట్టుకున్నాయి. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి.. కాలయాపన చేశారు. ఎన్నికల ముందు.. ఆరువేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ ప్రకటించి.. నిరుద్యోగులను మోసం చేశారు. మద్యపాన నిషేధమంటూ మేనిఫెస్టోను ప్రకటించి.. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌తో సమానమని చెప్పి.. ప్రభుత్వమే మద్యం విక్రయించి సొంత బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఎన్నికల వేళ సిద్ధమంటూ ప్రజల ముందుకు వచ్చి.. మరోసారి మోసగించేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు’ అని షర్మిల ఆరోపించారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు.. ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. యువత భవిష్యత్‌ కోసం.. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ మాటిచ్చారు. దానిని పొందేందుకు కాంగ్రెస్‌కు అండగా నిలవాల’ని షర్మిల కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లి కృపారాణి, ఇండియా కూటమి అభ్యర్థులు గోవిందరావు, షణ్ముఖరావు, టీబీజీ గుప్త, పొట్నూరు ఆనందరావు, చింతాడ దిలీప్‌ పాల్గొన్నారు.

పలాసలో సభ రద్దు

పలాస, ఏప్రిల్‌ 28: పలాసలో ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ బస్టాండు వద్ద నిర్వహించాల్సిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి సభ అర్ధాంతరంగా రద్దయింది. టెక్కలిలో సభ పూర్తయిన వెంటనే ఆమె పలాస చేరుకున్నారు. కాగా.. కాకినాడలోని అత్యవసర సమావేశంలో పాల్గొనాల్సి ఉండడంతో ఆమె వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో షర్మిల సభ రద్దయిందని పలాస కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి మజ్జి త్రినాథ్‌బాబు ప్రకటించారు.

Updated Date - Apr 29 , 2024 | 12:08 AM