Share News

సీఎం బటన్‌ నొక్కినా.. అందని విద్యాదీవెన

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:11 AM

విద్యాదీవెన, వసతిదీవెన నిధుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, డిప్లమా తదితర కోర్సులకు సంబంధించి ఏడాది ఫీజును రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా నాలుగు విడతలుగా ‘విద్యాదీవెన’ పథకం కింద విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సీఎం బటన్‌ నొక్కినా.. అందని విద్యాదీవెన

- ఊసేలేని వసతి దీవెన

- ఫీజులు చెల్లించాలని కళాశాలల ఒత్తిడి

- ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక విద్యార్థుల గగ్గోలు

(గుజరాతీపేట)

విద్యాదీవెన, వసతిదీవెన నిధుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, డిప్లమా తదితర కోర్సులకు సంబంధించి ఏడాది ఫీజును రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా నాలుగు విడతలుగా ‘విద్యాదీవెన’ పథకం కింద విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా 2023-24 విద్యాసంవత్సరం పూర్తయినా.. ప్రభుత్వం నుంచి విద్యాదీవెన ఒక్క టెర్మ్‌ కూడా చేతికందలేదు. మార్చి ఒకటో తేదీన సీఎం జగన్మోహన్‌రెడ్డి మొదటి విడత కింద విద్యా దీవెనకు సంబంధించి బటన్‌ నొక్కారు. కానీ ఇంతవరకూ విద్యార్థుల బ్యాంకు ఖాతాలో నిధులు జమకాలేదు. దీంతో ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 48,431 మంది విద్యార్థులను విద్యాదీవెన పథకానికి అర్హులుగా గుర్తించారు. మార్చిలో సీఎం బటన్‌ నొక్కినప్పుడు కేవలం ఐదుశాతం మందికే డబ్బులు జమయ్యాయి. మిగిలిన వారంతా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. సెమిస్టర్‌ ఫీజు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అలాగే వసతి దీవెన ఊసేలేదు. వసతి దీవెనకు సంబంధించి డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, డిప్లమా విద్యార్థులకు రూ.7,500 చొప్పున ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. ఇప్పటివరకు నిధులు జమకాకపోవడంతో.. డేస్కాలర్‌, హాస్టల్‌ విద్యార్థులు.. యాజమాన్యాలకు డబ్బులు చెల్లించలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి విద్యాదీవెన, వసతిదీవెన నిధులు తమ ఖాతాల్లో జమ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

పేదలకు మరింత భారం

ఫీజు రీయింబర్స్‌మెంటు రాకపోవడంతో తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. ప్రభుత్వమే న్యాయం చేయాలి. పేదలు ఒక్కసారి డబ్బులు కట్టాలంటే కష్టమే.

- బి.నిఖిల్‌, బీఎస్సీ విద్యార్థి

................

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ఫీజు మొత్తం ఒక్కసారి కట్టలేక విద్యార్థులంతా ఆందోళనకు గురవుతున్నారు. హాస్టల్‌ ఫీజుతోపాటు రీయింబర్స్‌మెంటు చెల్లించాలంటే తలకు మించిన భారమవుతోంది. ఫీజు విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి

శిమ్మ గణేష్‌, శ్రీకాకుళం

..................

పాతపద్ద్ధతే మేలు

టీడీపీ హయాంలో అమలు చేసేలా.. కళాశాలలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పద్ధతి మేలు. కళాశాలలు, ప్రభుత్వం మధ్య లావాదేవీ వ్యవహారాలు చూసుకునేవారు. ఇప్పుడు జాయింట్‌ అకౌంట్‌లో ఎప్పుడు డబ్బులు పడతాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నాం.

చల్లా హేమసుందర్‌, డిప్లమా విద్యార్థి

Updated Date - Apr 29 , 2024 | 12:11 AM