Share News

బాహుదా.. ఇక అంతేనా?

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:07 AM

ఇచ్ఛాపురంలో 97ఏళ్ల చరిత్ర కల్గిన బాహుదా నది వంతెన గతేడాది కూలి సగభాగం నేలకొరిగింది. నెలల వ్యవధిలో ఆ వంతెనకు మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. నూతన వంతెన నిర్మాణానికి రూ.20కోట్లు మంజూరు కాగా.. మంత్రి సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు. కానీ, ఇంతవరకూ టెండర్లు లేవు. పనులు ప్రారంభం కాలేదు.

బాహుదా.. ఇక అంతేనా?
కూలిన బాహుదానది వంతెన (ఫైల్‌)

- బ్రిడ్జి కూలి ఏడాదైనా.. ప్రారంభం కాని పనులు

- శంకుస్థాపనకే పరిమితం

- నేటికీ కానరాని టెండర్ల ప్రక్రియ

- అధికార పార్టీ నేతల ప్రకటనలు ఉత్తుత్తివే

(ఇచ్ఛాపురం)

ఇచ్ఛాపురంలో 97ఏళ్ల చరిత్ర కల్గిన బాహుదా నది వంతెన గతేడాది కూలి సగభాగం నేలకొరిగింది. నెలల వ్యవధిలో ఆ వంతెనకు మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. నూతన వంతెన నిర్మాణానికి రూ.20కోట్లు మంజూరు కాగా.. మంత్రి సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు. కానీ, ఇంతవరకూ టెండర్లు లేవు. పనులు ప్రారంభం కాలేదు. కేవలం ఎన్నికల స్టంట్‌లో భాగంగానే శంకుస్థాపన చేసి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాహుదా నదిపై 1927 ఫిబ్రవరిలో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం వంతెన నిర్మించింది. వంతెన కాలపరిమితి 50 ఏళ్లు మాత్రమే. భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోజురోజుకీ వంతెన క్షీణించింది. 20 టన్నుల లోడుకు మించి ఈ వంతెనపై ప్రయాణం చేయకూడదు. కానీ గతేడాది మే 3న వేకువజామున పరిమితికి మించి 80 టన్నుల భారీ గ్రానైట్‌ లోడు ఓ ట్రాలర్‌ ఒడిశా నుంచి బెంగళూరుకు ఈ వంతెనపై ప్రయాణించింది. దీంతో ఒక్కసారిగా వంతెన కుప్పకూలిపోయింది. వంతెన శిథిలాలుతో పాటు ట్రాలర్‌ కూడా కిందకి కూరుకుపోయింది. అప్పటి కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ స్పందించి.. తాత్కాలిక వంతెన నిర్మాణం కోసం రూ.40లక్షల నిధులు మంజూరు చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులు యుద్ధప్రాతిపదిక తాత్కాలిక వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. కానీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసింది. కానీ, ఇంతవరకూ టెండర్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో పనుల ఊసేలేదు. త్వరలోనే నూతన వంతెన నిర్మిస్తామన్న అధికారపార్టీ నేతల హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నందున.. ఇటీవల కేవలం శంకుస్థాపన చేసి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, పాలకులు స్పందించి వంతెన రోడ్డు నిర్మాణం అయినా పూర్తిచేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:07 AM