Share News

ఇక సమరమే

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:28 AM

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. అభ్యర్థుల లెక్క తేలింది. ఇక అసలు సమరం మొదలుకానుంది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి గానూ 13 మంది, జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 73 మంది.. మొత్తంగా 86 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

ఇక సమరమే

- ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ

- సార్వత్రిక ఎన్నికల బరిలో 86 మంది..

- శ్రీకాకుళం లోక్‌సభకు 13 మంది పోటీ

- 8 అసెంబ్లీ స్థానాలకుగానూ 73 మంది పోరుకు సన్నద్ధం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. అభ్యర్థుల లెక్క తేలింది. ఇక అసలు సమరం మొదలుకానుంది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి గానూ 13 మంది, జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 73 మంది.. మొత్తంగా 86 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. శ్రీకాకుళం లోక్‌సభకు టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్‌, కాంగ్రెస్‌ నుంచి పేడాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. మిగిలిన పది మందిలో ఐదుగురు అభ్యర్థులు ఇతర పార్టీలు, మరో ఐదుగురు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు.

అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే..

- ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి 9 మంది బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బెందాళం అశోక్‌, వైసీపీ నుంచి పిరియా విజయ, కాంగ్రెస్‌ నుంచి మాసుపత్రి చక్రవర్తి రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే ముగ్గురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

- పలాస నియోజకవర్గం నుంచి పది మంది బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి గౌతు శిరీష, వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు, కాంగ్రెస్‌ నుంచి మజ్జి త్రినాథ్‌ బాబు పోటీలో ఉన్నారు. ఇతర పార్టీలతోపాటు ముగ్గురు ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగారు.

- ఆమదాలవలస నియోజకవర్గం నుంచి 13 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి కూన రవికుమార్‌, వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం, కాంగ్రెస్‌ నుంచి సనపల అన్నాజీరావు పోటీ చేస్తున్నారు. ఐదుగురు ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు.

- నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి, వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్‌, కాంగ్రెస్‌ నుంచి మంత్రి నరసింహమూర్తి పోటీలో ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

- శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి గొండు శంకర్‌, వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి అంబటి కృష్ణారావు బరిలో ఉన్నారు. ఇతరపార్టీల నుంచి మరో నలుగురు పోటీ చేస్తున్నారు.

- పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మామిడి గోవిందరావు, వైసీపీ నుంచి రెడ్డి శాంతి, కాంగ్రెస్‌ నుంచి కొప్పురోతు వెంకట్రావు పోటీచేస్తున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నలుగురు ఉన్నారు.

- ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పది మంది ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ నుంచి నడుకుదిటి ఈశ్వరరావు, వైసీపీ నుంచి గొర్లె కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి కరిమజ్జి మళ్లేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా నలుగురు పోటీచేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులను పోలిన పేర్లతో మరో ఇద్దరు ఎన్నికల బరిలో స్వతంత్రంగా నిలిచారు.

- టెక్కలి నియోజకవర్గం నుంచి ఏడుగురు ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నుంచి కిల్లి కృపారాణి పోటీలో ఉన్నారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

- ఇదిలా ఉండగా టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గాల్లో ఇద్దరి ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. జిల్లాలో జనసేన అభ్యర్థులెవరూ పోటీ లేకపోవడంతో... గాజుగ్లాసు గుర్తుపై ఎటువంటి గందరగోళం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:28 AM