Share News

వైసీపీ వెంపర్లాట!

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:40 AM

ఎన్నికల వాతావరణం వేడెక్కే కొద్దీ పెరిగిపోతున్న వలసల నివారణకు వైసీపీ నేతలు అన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నారు. బాబ్బాబు ఆగండి.. అంటూ బతిమాలుకొంటున్నారు.

వైసీపీ వెంపర్లాట!

వలసల కట్టడికి కుయుక్తులు

ఇప్పుడు డబ్బులిస్తాం.. రేపు బిల్లులు ఇప్పిస్తాం అంటూ ఆశలు

వినని చోట బెదిరింపులు

పార్టీని వీడేవారిని ఆపేందుకు పాట్లు

కొన్నిచోట్ల డీలాపడ్డ అధికారపార్టీ

ఎన్నికల వాతావరణం వేడెక్కే కొద్దీ పెరిగిపోతున్న వలసల నివారణకు వైసీపీ నేతలు అన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నారు. బాబ్బాబు ఆగండి.. అంటూ బతిమాలుకొంటున్నారు. కాకుంటే డబ్బులిస్తామని ప్రలోభపెట్టడం, రేపు బిల్లులు ఇప్పిస్తామంటూ ఆశచూపడం, అవేమీ పనిచేయకపోతే బెదిరించటం పరిపాటైంది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ తంతు కొనసాగుతోంది. పశ్చిమప్రాంతంలో మరీ అధికంగా కనిపిస్తోంది. ‘మళ్లీ గెలుపు మా పార్టీదే.. జగనే కాబోయే ముఖ్యమంత్రి’ అని ఒకవైపు చెప్పుకుంటూనే మరోవైపు వైసీపీ నాయకులు పడుతున్న హైరానా చూసి సాధారణ ప్రజానీకం ఔరా.. ఇదేం వెంపర్లాట! అని ముక్కున వేలేసుకుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లావ్యాప్తంగా అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ కూటమిలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గంలో అయితే ఏడాదిన్నర క్రితమే వలసల పరంపర ప్రారంభమై తాజాగా అది తారస్థాయికి చేరింది. ప్రస్తుతం కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో వైసీపీకి గుడ్‌బై చెప్పేవారు పెరిగిపోయారు. తూర్పుప్రాంతంలోని ఒంగోలు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ పరంపర ప్రస్తుతం సంతనూతలపాడు, కొండపిలకు పాకింది. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో అయితే పార్టీలో చేర్చుకునే పనిలో టీడీపీ అభ్యర్థులు మునిగిపోయారు. అభ్యర్థి ఎంపికలో జాప్యం జరిగిన దర్శి నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరడం ప్రారంభించారు. పైస్థాయిలో ఇప్పటికే మాగుంట కుటుంబం పార్టీలో చేరగా, ఉమ్మడి జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరమైన విషయం విదితమే. వీటికితోడు ఎన్నికల వాతావరణ వేడెక్కడంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రధానంగా గ్రామాల్లో ప్రభుత్వ పనితీరుతో పూర్తి వ్యతిరేకంగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మండలస్థాయి పదవుల్లో ఉన్న నాయకులు, వీరికితోడు ఆయా వర్గాలకు చెందిన సాధారణ ప్రజానీకం వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు.

అంతటా ప్రలోభాల పర్వం

మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో టీడీపీకి చెందిన ఒక గ్రామ నాయకుడి ఆర్థిక అవసరాన్ని గుర్తించి ఆయన్ను ప్రలోభపెట్టి వైసీపీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. మార్కాపురంలో టీడీపీకి చెందిన ఒక వ్యాపారి ఇంటికి ఎదురే ఒకరు భవన నిర్మాణం చేయబోతున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి అది అడ్డు అవుతుంది. దీంతో ఆయన వారితో సంప్రదింపులు జరపగా విషయం వైసీపీ నాయకుల వద్దకు చేరింది. వెంటనే వైసీపీ కండువా వేసుకో మీ ఇంటికి అడ్డుగా ఏ నిర్మాణం లేకుండా చూస్తామని చెప్పడం గమనార్హం. మరో సామాజికవర్గంలో టీడీపీకి చెందిన ఒక ముఖ్యుడిపై కారు అమ్మకం విషయమై పోలీసులకు ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. దానిని అడ్డుపెట్టుకొని పార్టీ మారితే ఓకే, లేకపోతే ఊచలు లెక్కేయాల్సిందేనంటూ వైసీపీ నాయకులు బెదిరించారు. వైపాలెం నియోజకవర్గంలో ఇప్పటికే వలసలు భారీగా జరగ్గా ఒక గ్రామ నాయకుడిపై వేరే ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యుడితో ఒత్తిడి తెప్పించి వెనక్కు రప్పించుకున్నారు. ఇక డబ్బులు ఇప్పిస్తా, బిల్లులు ఇప్పిస్తా అంటూ పార్టీ మారబోయే వారి వెంట వైసీపీ నాయకులు తిరుగుతున్నట్లు సమాచారం. ఒంగోలు గోపాలనగర్‌లో ఒక ముఖ్యుడు 25రోజుల క్రితం టీడీపీలో చేరాడు. తిరిగి ఆరురోజుల క్రితం ఆయన వైసీపీ కండువా కప్పుకున్నాడు. గోపాలనగర్‌ వాసులంతా ఇదంతా డబ్బుమహిమని వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్డిపాలెంలో టీడీపీ నాయకులు ఇద్దరు వైసీపీలోకి పోగా ఆయన్ను విభేదిస్తూ అటు వైపు వారు ఇటు వచ్చేశారు.

ఎత్తుగడల్లో ఆరితేరిన చెవిరెడ్డి

వలసల నివారణ కుయుక్తులకు ముందుగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శ్రీకారం పలికారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టగా ఆయనకు పేరుంది. అనేక పన్నాగాలు పన్నుతున్నారన్న విషయం విదిత మే. సంతనూతలపాడు ఎమ్మెల్యేను తనవైపునకు తిప్పుకోవడం లోనూ, జంకె వెంటకరెడ్డిని ఆపుకోవడంలోనూ, కదిరి బాబూరావును నిలుపుకోవడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. సీఎంతో పదవులు ఇప్పించడం, బెదిరించడం.. కాకపోతే నేరుగా సీఎం ద్వారానే హెచ్చరికలు చేయించడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీ వైపు వెళ్లకుండా బ్రేక్‌ పడటం, వ్యాపారపరమైన ఇబ్బందులపై బెదిరింపులు రావడం వెనుక చెవిరెడ్డి కీలకపాత్ర వహించినట్లు ప్రచారం ఉంది.

గిద్దలూరులో బరితెగింపు

గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మరింత బరితెగింపును ప్రదర్శిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం నుంచి అక్కడ వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారు. గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యుల నుంచి తాజాగా ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతరత్రా వైసీపీలో కీలక పదవులు ఉన్న వారంతా పోలోమని టీడీపీలో చేరుతున్నారు. దీంతో వలసల నివారణ కోసం వైసీపీ నేతలు బెదిరింపు రాజకీయాలకు తెరతీశారు. పార్టీ మారిన మునయ్య అనే గిరిజన యువకుడి హత్య వెనుక కారణం ఇదేనని స్పష్టమైంది. గిద్దలూరులో నగర పంచాయతీలోని ఒక చిన్నపాటి నామినేటెడ్‌ పదవిలో నాయకుడు, మరికొందరు టీడీపీలో చేరిన తర్వాత వైసీపీ శ్రేణులు దాడి ప్రారంభించారు. డబ్బులు ముట్టజెప్పి ఒకరిని వెనక్కు తీసుకోగలిగారు. బేస్తవారపేటలో ఒక సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు టీడీపీలో చేరారు. వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ నాయకులు సామ,దాన,భేద దండోపాయాలతో ఒకరిని వెనక్కు తీసుకెళ్లారు. అతన్ని ఒక రోజంతా వారి వాహనంలో తిప్పుకొని అర్ధరాత్రి ఇంటికి తెచ్చారు. అయితే కొందరు నాయకులు, ప్రధానంగా కొన్ని సామాజికవర్గాల వారు డబ్బులు, బెదిరింపులకు లొంగమని ఎదురుతిరగడంతో వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. పార్టీ మారిన ఒక మహిళా సర్పంచ్‌, ఆమె భర్తను కలిసి పెండింగ్‌ బిల్లులు ఇప్పిస్తామని ఎన్నికల్లో ఖర్చు అయివుంటే ఎంతోకొంత ఇస్తామని హామీ ఇచ్చి తిరిగి తీసుకున్నట్లు తెలిసింది.

అద్దంకి, పర్చూరుల్లో తాడేపల్లి నేతల జోక్యం

అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో పార్టీ మారే వారి నివారణ కోసం తాడేపల్లి నాయకులు సైతం జోక్యం చేసుకున్నారు. ప్రలోభాలు, బెదిరింపులకు లొంగని వారు తాడేపల్లి పెద్దల మాటను కూడా ఖాతారు చేయలేదు. అయినప్పటికీ తాజాగా పర్చూరు నియోజకవర్గంలో ఒక మండలంలో పార్టీ మారుతున్న వారిని ఆపుకునేందుకు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే అక్కడ అన్ని గ్రామాల్లోని ఆ నాయకుడి అనుచరులంతా ఏలూరిని కలిసి మద్దతు ప్రకటించడం విశేషం. ఇలా అన్నిచోట్లా పార్టీ మారే వారిని నిలుపుకునేందుకు వైసీపీ నేతలు వెంపర్లాడినా ఆశించిన పలితం దక్కడం లేదని చెప్పవచ్చు.

Updated Date - Apr 16 , 2024 | 01:40 AM