Share News

పార్కులపై వైసీపీ నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:56 PM

ఒంగోలు నగరంలో పార్కులన్నీ నామరూపాలు కోల్పోయాయి. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఆటలు ఆడుకునేందుకు ఏ పార్క్‌లో కూడా సరైన వసతులు మృగ్యమయ్యాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కులన్నీ కళావిహీనంగా మారాయి.

పార్కులపై వైసీపీ నిర్లక్ష్యం
ఎండిపోయిన చెట్లు, లేచిపోయిన టైల్స్‌

ఒంగోలులో అధ్వానంగా పార్కులు..

గాంధీపార్కులో నాటి సందడి ఏదీ ?

ఐదేళ్లుగా పార్కుల అభివృద్ధిని పట్టించుకోని వైసీపీ పాలకులు

గత టీడీపీ హయాంలో నిర్వహించిన హ్యాపీసండే ఊసే లేదు

ఒంగోలు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 29 : నగరంలో పార్కులన్నీ నామరూపాలు కోల్పోయాయి. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఆటలు ఆడుకునేందుకు ఏ పార్క్‌లో కూడా సరైన వసతులు మృగ్యమయ్యాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కులన్నీ కళావిహీనంగా మారాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరంలోని పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రతి ఆదివారం హ్యాపీసండేలతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపించేది. సినిమాలను సైతం కాదని గాంధీపార్కులో కూర్చోవడానికి నగర ప్రజలు ఆసక్తి చూపేవారు. బోట్‌ క్లబ్‌, అందమైన పచ్చని మొక్కలు, వినోదాలకు రోజూ భారీ స్ర్కీన్‌పై ఓ సినిమా ప్రదర్శన ఉండేది. కుటుంబ సమేతంగా కూర్చుని కాసేపు సరదాగా గడిపేవారు. ఇపుడా పరిస్థితి లేదు. సినిమాకు తెరదించేయగా, క్యాంటీన్‌ మూసేశారు. బోట్‌ క్లబ్‌ సంగతే మరిచిపోయారు. వేసవి సెలవులు రావడంతో పిల్లలతో కలిసి కాసేపు సరదాగా గడిపేందుకు ఒంగోలులో సరైన పార్కు ఒక్కటైనా లేకపోవడం విచారకరం. వైసీపీ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయింది. నగర అభివృద్ధిని వదిలేసినట్లే పిల్లల పార్కుల అభివృద్ధిని కూడా వైసీపీ పాలకులు వదిలేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉండీ ఉపయోగం లేదు..

నగరంలోని దాదాపు అన్ని పార్కులు పచ్చదనం కోల్పోయాయి. పిల్లలు ఆటల పరికరాలు విరిగిపోయి పనికిరాకుండా పోయాయి. వినోద వేదికలైన పార్కుల్లో పిల్లల ఆట పరికరాలు, పచ్చదనం కొరవడటంతో ఆహ్లాదం ఆవిరిగానే మారింది. మొత్తం దాదాపు 26 పార్కుల వరకు ఉండగా వాటిలో సగానికిపైగా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. పలు పార్కుల్లో పచ్చదనం కనిపించకపోవడంతో తప్పేదేముందన్నట్లు ఆ ప్రాంత చిన్నారులు అరకొర ఆట వస్తువులతోనే సరిపెట్టుకుంటున్నారు. అన్నవరప్పాడులోని పార్కు నిర్మాణం చేసి పదేళ్లకుపైగా కావస్తుండగా నేటికీ ప్రజలకు పెద్దగా ఉపయోగపడటం లేదు. సంతపేటలోని నాటు బాబురావు పార్కులో పచ్చదనం కొంత ఫర్వాలేదనిపించినా, పిల్లల ఆట వస్తువులు మాత్రం తుప్పుబట్టి విరిగిపోయాయి. పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న వస్తువులే కనిపిస్తున్నాయి. రోజూ సాయంత్రం వేళల్లో పిల్లలు, పెద్దలు, యువత, కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు 200 మందికిపైగా వస్తుంటారు. పార్కులో మౌలిక వసతులు కరువవడంతో వారు రావడం మానేశారు. నిర్మల్‌నగర్‌, గద్దలగుంట పార్కులు స్థానికుల పర్యవేక్షణలో ఓ కమిటీగా ఏర్పడటంతో కొంతమేర బాగున్నాయి. అవి అక్కడి ప్రాంత వాసులకే ఉపయోగపడుతుండగా, ఇతరులు వెళ్లలేని పరిస్థితి. దేవుడుచెరువు పార్కు స్థానికులకు కొంత ఉపయోగకరంగా ఉంది. 3లక్షల లక్షల జనాభా గల ఒంగోలుకు ఒక్క పార్కు కూడా పూర్తిస్థాయిలో ఉపయోగంగా లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ పాలనలో ఎంతో అందంగా కనిపించిన పార్కులు గడిచిన ఐదేళ్లుగా వైసీపీ పాలకులు పట్టించుకోకపోవడంతో అందహీనంగా మారడంపై పెదవివిరస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 10:56 PM