Share News

భానుడు భగభగ

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:36 AM

జిల్లాలో మళ్లీ భానుడు భగభగ మండుతున్నాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం జిల్లాలో నమోదయ్యాయి.

భానుడు భగభగ

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు

గోళ్లవిడిపిలో 43.27 డిగ్రీలు

పశ్చిమాన ఎక్కువ ప్రాంతాల్లో 40పైనే..

ఒంగోలు, ఏప్రిల్‌ 15 (ఆంరఽధజ్యోతి) : జిల్లాలో మళ్లీ భానుడు భగభగ మండుతున్నాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు సోమవారం జిల్లాలో నమోదయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపిలో 43.27 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఆ సమయంలో రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలలో అదే అధికం. గతనెల చివరి వారంలో జిల్లాలో ఎండల తీవ్రత పెరగ్గా ఈనెల తొలివారం వరకు కొనసాగాయి. గడిచిన వారం రోజులుగా ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఒకట్రెండు చోట్ల 40డిగ్రీలకు అటుఇటుగా ఉన్నా అత్యధిక ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. అది కూడా మధ్యాహ్నం 12 నుంచి 3గంటలలోపు ఉంటుండగా ఆ తర్వాత చల్లబడుతుండటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే సోమవారం మళ్లీ భానుడు భగభగలాడారు. ఉదయం 9 గంటలకే చాలాప్రాంతాల్లో ఎండ తీవ్రత కనిపించగా 11 తర్వాత మరింత పెరిగి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2గంటల సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా 43.29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1 నుంచి 3 గంటలలోపు ఆయా ప్రాంతాల్లో చూస్తే పీసీపల్లిలో 42.88 డిగ్రీలు, మార్కాపురం మండలం దరిమడుగులో 42.43, యండ్రపల్లిలో 41.51, పునుగోడులో 41.50, దొనకొండలో 41.45, మోక్షగుండంలో 41.37, అమనిగుడిపాడులో 41.25, ముండ్లమూరులో 41.15, గురువాజిపేటలో 41.05, వెస్ట్‌నాయుడుపాలెంలో 41.0 డిగ్రీల ఎండ కాచింది. పొదిలి, గిద్దలూరు, కొమరోలు, పెద్దారవీడు, కేకేమిట్ల, దోర్నాల, చీమకుర్తి, సీఎస్‌పురం, పొన్నలూరు అర్ధవీడు, వెలిగండ్ల తదితర మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితితో అన్ని వర్గాల ప్రజలు అవస్థ పడుతున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:36 AM